ఓటింగ్‌ ముగిసింది.. ఇక లెక్కింపే

5 Aug, 2017 17:34 IST|Sakshi
ఓటింగ్‌ ముగిసింది.. ఇక లెక్కింపే

న్యూఢిల్లీ: దేశంలో రెండో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌ ఆవరణలో మొదలైన ఈ ఓటింగ్‌ ప్రక్రియ, సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 781 ఓట్లలో 771 ఓట్లు పోలయ్యాయి. వెంటనే పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఫలితాలు రాత్రి 7 గంటల వరకు వెల్లడయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు కొనసాగుతున్న హమీద్‌ అన్సారీ పదవీకాలం ఈ నెల 10తో ముగియనున్న నేపథ్యంలో ఈ ఎన్నిక అనివార్యమైంది.

ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో అధికారపక్షం ఎన్డీయే తరుఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు బరిలోకి దిగగా... ప్రతిపక్షాలు మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీని పోటీకి దింపాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు తెలిపిన బీజేడీ, జేడీయూ ఇప్పుడు గోపాలకృష్ణ గాంధీకి మద్దతిచ్చాయి. అయితే, లోక్‌సభలో మెజార్టి ఉన్న ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడి గెలుపు లాంఛనమే.

మరిన్ని వార్తలు