బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌గా నటుడు

5 Apr, 2019 19:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ని గుజరాత్‌ రాష్ట్రంలో స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రకటించింది. బీజేపీ విడుదల చేసిన క్యాంపెయినర్ల  జాబితాలో ఆయన పేరు కూడా ఉండటం విశేషం. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌ ‘పీఎం నరేంద్రమోదీ’  సినిమాలో ప్రధాన పాత్రలో నటించింన విషయం తెలిసిందే. స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో అగ్రనేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌లతో పాటు వివేక్‌ ఒబెరాయ్‌ పేరు కూడా చేర్చారు. మోదీ సొంత రాష్ట్రంలో బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌గా బాలీవుడ్‌ నటుడిని పెట్టుకోవడాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. మోదీ బయోపిక్‌ ఈ సార్వత్రిక ఎన్నికల ముందు విడుదల చేస్తే ప్రజల మీద ప్రభావం పడుతుందని, ఎన్నికలు ముగిసే వరకు సినిమా విడుదల వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

మోదీ బయోపిక్‌ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుకుంటుందని సోమవారం (ఏప్రిల్‌ 1)న బాంబే హైకోర్టు తెలిపింది. మోదీ బయోపిక్‌ విడుదల వల్ల ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినట్లు కాదని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందని హైకోర్టు వెల్లడించింది. ఎన్నికల సంఘం అభిప్రాయంతో ఆర్‌జేడీ ఎంపీ మనోజ్‌ ఝా విభేదించారు. మోదీ బయోపిక్‌ ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించడం లేదని చెప్పడం సరికాదని, ఈసీ పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఇప్పుడున్న ఎన్నికల సంఘం బలహీనమైనదిగా చరిత్రలో నిలుస్తుందని విమర్శిచారు. 

మరిన్ని వార్తలు