ప్రభుత్వ ఆదేశాలే పాటిస్తాం

2 Jan, 2020 02:13 IST|Sakshi
ఢిల్లీలో గౌరవ వందనం స్వీకరిస్తున్న రావత్‌

రాజకీయాలకు మేము దూరం

కొత్త సీడీఎస్‌ రావత్‌   

న్యూఢిల్లీ: సాయుధ బలగాలు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తాయని బుధవారం కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. త్రివిధ దళాల్లోనూ రాజకీయాలు ప్రవేశిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు దళాలు సమన్వయంతో కలసికట్టుగా పనిచేయాలని, అలా చేసేలా చూడడమే సీడీఎస్‌ పని అని స్పష్టం చేశారు ‘‘ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ ఒక బృందంగా కలిసి పనిచేస్తాయని హామీ ఇస్తున్నాను. సీడీఎస్‌గా వాటిని పర్యవేక్షిస్తూ నియంత్రిస్తూ ఉంటాను. కానీ ఏ పనైనా త్రివిధ బలగాలు ఒకరికొకరు సహకారం అందించుకుంటూ పనిచేస్తాయి’’అని జనరల్‌ రావత్‌ అన్నారు.

కొత్త బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రావత్‌ సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సీడీఎస్‌గా జనరల్‌ రావత్‌ నియామకంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. రాజకీయపరమైన ప్రయోజనాలను ఆశించే వ్యక్తిని సీడీఎస్‌గా నియమించడమేంటని నిలదీసింది. ఈ ఆరోపణల్ని రావత్‌ కొట్టి పారేశారు. ‘‘మేము రాజకీయాలకు చాలా దూరం. అధికారంలో ఎవరుంటారో వారి ఆదేశాల మేరకే పనిచేస్తాం‘‘అని రావత్‌ స్పష్టం చేశారు. మూడు బలగాలకు కేటాయించిన వనరుల్ని సంపూర్ణంగా, అధిక ప్రయోజనాలు కలిగేలా సద్వినియోగం చేయడమే తన కర్తవ్యమని అన్నారు. మూడు దళాలు సమన్వయంతో పనిచేస్తూ వాటి సామర్థ్యం పెంచడానికే కృషి చేస్తానని జనరల్‌  రావత్‌ అన్నారు.  

1+1+1=3 కాదు 5 లేదా ఏడు  
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ ఈ మూడింటిని కలిపితే త్రివిధ బలగాలు అనే అంటాం. కానీ జనరల్‌ రావత్‌ దీనికి సరికొత్త భాష్యం చెప్పారు. ఇవి మూడు కాదని, అయిదు, లేదా ఏడు అవ్వాలని జనరల్‌  రావత్‌ వ్యాఖ్యానించారు. అంటే ఈ మూడు బలగాలు సంఘటితమైతే అంత శక్తిమంతంగా మారతాయని జనరల్‌  రావత్‌ అభిప్రాయపడ్డారు. అలా చేయడం కోసమే సీడీఎస్‌ పదవిని ఏర్పాటు చేశారని జనరల్‌  రావత్‌ అన్నారు. మూడేళ్లలో మూడు బలగాల మధ్య సమన్వయాన్ని సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తానని జనరల్‌  రావత్‌  చెప్పారు. మూడు సైనిక దళాల చీఫ్‌గా తాను తటస్థంగా వ్యవహరిస్తానని, అందరినీ ఒకేతాటిపైకి తెచ్చి పని చేసేలా చూస్తానని అన్నారు. ఆర్మీ చీఫ్‌గా మంగళవారం పదవీ విరమణ చేసిన రావత్‌ భారత్‌ మొట్టమొదటి సీడీఎస్‌గా సోమవారం నియమితులయ్యారు. రక్షణ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సీడీఎస్‌ పదవిని ఏర్పాటు చేస్తూ గత వారం కీలక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. త్రివిధ బలగాలకు సంబంధించి రక్షణ మంత్రికి అన్ని అంశాల్లోనూ సలహాదారుగా ఉండడం, మూడు బలగాల మధ్య సమన్వయం సాధిస్తూ ఉన్న వనరులనే సంపూర్ణంగా సద్వినియోగం చేయడమే సీడీఎస్‌ ప్రధాన విధి.

సంస్కరణల కోసమే సీడీఎస్‌: మోదీ 
మిలటరీ వ్యవహారాల కోసం ఒక శాఖ ఏర్పాటు, సీడీఎస్‌ పదవిని ఏర్పాటు చేయడం అనేది రక్షణ శాఖలో ఒక సంస్కరణగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. జనరల్‌ బిపిన్‌ రావత్‌ సీడీఎస్‌ పదవిని చేపట్టడంతో ఆయనను అభినందించారు. భారత్‌కు ఆయన ఇప్పటికే ఉత్తేజపూరితంగా అపారమైన సేవల్ని అందించారని, కర్తవ్యదీక్ష కలిగిన అధికారని రావత్‌ని కొనియాడారు. ఆధునిక యుద్ధ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో సీడీఎస్‌ పాత్ర ఆవశ్యకత ఎంతో ఉందని, దీనిని రక్షణశాఖలో ఒక సమగ్రమైన సంస్కరణగానే చూడాలని ప్రధాని ట్వీట్‌ చేశారు. భారత దేశ మిలటరీ బలగాల్ని ఆధునీకరించి, 130 కోట్ల మంది ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంలా ఉండే అత్యున్నత బాధ్యత సీడీఎస్‌పైనే ఉందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత్‌లో మిలటరీలో సంస్కరణలు మొదల య్యాయని చెప్పారు. సంస్కరణల ఆరంభం  చరిత్రను సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు