కేంద్రం ప్రతిపాదనకు వాట్సాప్‌ నో

24 Aug, 2018 04:25 IST|Sakshi

న్యూఢిల్లీ: సందేశాలు తొలుత ఎక్కడి నుంచి వచ్చాయో కనిపెట్టగలిగే సాంకేతికతను అభివృద్ధి చేస్తే యూజర్ల వ్యక్తిగత గోప్యతతో పాటు ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉద్దేశాలు దెబ్బతింటాయని ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ వాట్సాప్‌ భారత ప్రభుత్వానికి స్పష్టంచేసింది. నకిలీ సందేశాలను అడ్డుకునేందుకు వార్తల మూలాలను కనిపెట్టే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. ‘దీనివల్ల వాట్సాప్‌ ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిష్షన్‌(మెసేజ్‌ పంపేవారు, రిసీవ్‌ చేసుకునేవారు తప్ప మరెవరూ సమాచారాన్ని చూడలేని సాంకేతికత) ఉద్దేశాలు దెబ్బతింటాయి.

ఒకవేళ అలాంటి సాఫ్ట్‌వేర్‌ను తయారుచేస్తే మా యూజర్లకు సంబంధించి సున్నితమైన సమాచారం, గోప్యత తీవ్రమైన ప్రమాదంలో పడతాయి. యూజర్ల గోప్యత నిబంధనల్ని ఉల్లంఘించే పనులను వాట్సాప్‌ ఎన్నడూ చేయబోదు’ అని ఆయన అన్నారు. నకిలీ వార్తలు, వదంతుల కారణంగా సంభవిస్తున్న మూకహత్యలను నియంత్రించేందుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని కేంద్రం గతంలో వాట్సాప్‌ను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నకిలీ వార్తలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను తాము చేపడుతున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. ఇందుకోసం భారత్‌లో ఓ బృందాన్ని నియమించామని, వాట్సాప్‌లో ఓసారి గరిష్టంగా పంపగలిగే సందేశాల సంఖ్యను తగ్గించామని పేర్కొంది. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసిన వాట్సాప్‌కు ప్రస్తుతం భారత్‌లో 20 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు