10 మంది ప్రాణత్యాగం చేస్తే బాధ్యులపై చర్యలేవీ?: సీఐసీ

4 Apr, 2016 01:46 IST|Sakshi

న్యూఢిల్లీ: 2009లో నాల్కో (నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్) ఆఫీసుపై మావోయిస్టులు 2009లో దాడి జరిపి 10 మంది సీఐఎస్‌ఎఫ్ బలగాలను బలిగొన్న ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోకపోవడాన్ని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) తీవ్రంగా తప్పుబట్టింది. అధికారులపై చర్యలకు సంబంధించి సీఐఎస్‌ఎఫ్ సీనియర్ కమాండెంట్ శక్తిధార్ దోభల్ ఆర్టీఐ చట్టం కింద కంపెనీకి లేఖ రాయగా.. సమాధానం కోసం ఆయన నాలుగేళ్లు ఎదురుచూడాల్సిన దారుణ పరిస్థితి నెలకొందని గర్హించింది.

అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. దీనికి సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని గనుల శాఖ కార్యదర్శి, నాల్కో సీఎండీకి పంపాలని సమాచార కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్ ఆదేశించారు. చర్యలకు సంబంధించిన రికార్డులు కనిపించలేదని, అందువల్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పడాన్ని ఆజాద్ దుయ్యబట్టారు. నాల్కో కోసం మావోయిస్టులతో వీరోచితంగా పోరాడి పది మంది తమ జీవితాలను త్యాగం చేస్తే.. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడంపై మంత్రిత్వ శాఖ, నాల్కో యాజమాన్యం గానీ పట్టించుకోకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు