‘భారత్ మాతా కీ జై’ అనని వాళ్లు దేశంలో ఉండొద్దు: ఫడ్నవిస్

4 Apr, 2016 01:41 IST|Sakshi
‘భారత్ మాతా కీ జై’ అనని వాళ్లు దేశంలో ఉండొద్దు: ఫడ్నవిస్

నాసిక్: దేశంలో జాతీయవాదంపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ మాతా కీ జై’ అని నినదించడం ఇష్టంలేని వాళ్లకు దేశంలో నివసించే హక్కు లేదని దుయ్యబట్టారు. దేశంలో ఉన్న వాళ్లంతా ఈ నినాదం చేయాల్సిందేనని శనివారం రాత్రి నాసిక్‌లో జరిగిన బహిరంగ సభలో పేర్కొన్నారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసిన కొందరు విద్యార్థులకు మద్దతు పలికిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఫడ్నవిస్ పరోక్ష విమర్శలు చేశారు.

ప్రతిపక్ష పార్టీలు కావాలంటే బీజేపీని విమర్శించొచ్చని...కానీ ‘భారత్ మాతా...’ నినాదాన్ని వ్యతిరేకిస్తే మాత్రం ప్రజలు సహించరని స్పష్టం చేశారు. హిందూ సంస్కృతి ప్రకారం కుల, లింగ వివక్ష లేదని...అందువల్ల కొన్ని ఆలయాల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధం సరికాదని ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై బాంబే హైకోర్టుకు ప్రభుత్వపరంగా సమాధానం చెప్పామని...రానున్న కాలంలో రాష్ట్రంలోని ఆలయాల్లో మహిళల ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోరన్నారు. తన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఫడ్నవిస్ వివరణ ఇచ్చారు. ‘భారతమాతా కీ జై’ అనే నినాదం మతానికి సంబంధించినది కాదని తానన్నానని, మీడియా తన ప్రసంగంలోని కొద్ది భాగాన్నే తీసుకుని తన ఉద్దేశాన్ని వక్రీకరించిందని ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు