మీ పర్యటన ఖర్చులు ఎవరు పెట్టారు?

18 Oct, 2017 18:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాబర్ట్‌ వాద్రా విమాన టిక్కెట్ల విషయంలో బీజేపీపై కాంగ్రెస్‌ పార్టీ ఎదురుదాడి ప్రారంభించింది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ దేశవ్యాప్త పర్యటనలు ఖర్చుల వివరాలను ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ముఖ్యంగా 2003 నుంచి 2007 మధ్య కాలంలో నరేంద్రమోదీ చార్టర్డ్‌ ఫ్లయిట్‌లో వందసార్లు జాతీయ, అంతర్జాతీయ పర్యటనలు నిర్వహించారని.. ఈ మొత్తం ఖర్చును ఎవరు భరించారో చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వి డిమాండ్‌ చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ అప్పటి పర్యటనల ఖర్చు మొత్తం రూ.16.56 కోట్ల వరకూ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ఖర్చు ఎవరు పెట్టారో.. ప్రజలకు తెలపాలని ఆయన బీజేపీని డిమాండ్‌ చేశారు. వివాదాస్పద ఆయుధ వ్యాపారి సంజయ్‌ భండారితో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు ఉన్న సాన్నిహిత్యం మరోసారి తెరపైకి వచ్చిన నేపథ్యంలో సింఘ్వి ఇటువంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. రాబర్ట్‌ వాద్రా-సంజయ్‌ భండారి ఈ మెయిల్స్‌లో తమకు అనుకూలంగా ఉన్న ఈ మెయిల్స్‌నే కేంద్రం లీక్‌ చేస్తోందని ఆయన ఆరోపించారు. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు, ఇతర బీజేపీ నేతలతోమ కూడా సంబయ్‌ భండారీ సన్నిహితంగా ఉన్నారని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు