సుప్రీం కోర్టుకు వెళతాం: అసదుద్దీన్

29 Aug, 2016 20:24 IST|Sakshi
సుప్రీం కోర్టుకు వెళతాం: అసదుద్దీన్

తమిళనాడు వేలూరు కోటలోని మసీదులో ప్రార్థనలు చేసే విధంగా సుప్రీంకోర్టులో కేసు వేయనున్నట్లు పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ తెలిపారు. వేలూరులోని మండీ వీధిలో ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో బహిరంగ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు ఏడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. వేలూరు కోటలో పలు సంవత్సరాలుగా ముస్లింలు ప్రార్థన చేయకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని వీటిపై సుప్రీంకోర్టులో కేసు వేసి ముస్లింలకు న్యాయం చేస్తామన్నారు.

ముస్లింలు రాజకీయ అవగాహన కలిగి ఉండి ప్రతి ఒక్కరూ ఏకమై పోరాటాలు చేస్తే రిజర్వేషన్‌ను తప్పక సాధించవచ్చన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లింలు ఎంఐఎం ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోను పోటీ చేసి తమ సత్తా చాటుకోవాలన్నారు. ముస్లింలకు రిజర్వేషన్‌లు లేక పోవడంతో అన్ని విభాగాల్లో వెనుకబడి పోతున్నారన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్‌పై మసూదా ఇచ్చామని అయితే వీటిపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు.

ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్బాల్ మాట్లాడుతూ డీఎస్పీ విష్ణుప్రియ ఆత్మహత్య కేసులో నేటికి కాలయాపన జరుగుతోందని వీటిపై ముగింపు చర్యలు చేపట్టాలన్నారు. ఆమె ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర జాయింట్ కార్యదర్శులు సయ్యద్ సవాలుద్దీన్, ఇంతియాస్, ముహమద్ షరీఫ్, కోశాధికారి మసుద్దీన్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ముహ్మద్ అల్తాఫ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు