కేజ్రీవాలా.. మజాకా.. ఢిల్లీకి ప్రత్యేక గన్‌

20 Dec, 2017 08:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 'పొమ్మనలేక పొగబెట్టినట్లు' అనేది సామెత. ఇంటికొచ్చిన చుట్టాన్ని నేరుగా వెళ్లిపోండి అని చెప్పలేక పొగపెట్టడంతో ఆ బాధ తట్టుకోలేక ఆ వచ్చిన చుట్టం వెళ్లిపోతాడంట అనేది దాని వివరణ. అయితే, ఢిల్లీకి మాత్రం పొగే చుట్టమై వచ్చింది. ఎన్నిరకాలుగా బ్రతిమాలినా పోయే పరిస్థితి లేదు. దీంతో ఆ పొగను బెదిరించి పారిపోయేలా చేసేందుకు కేజ్రీవాల్‌ ఒక పెద్ద గన్‌ తీసుకొచ్చారు. అది మాములు గన్‌ కాదు కాలుష్యంతో నిండిన పొగను మాయం చేసే గన్‌ అన్నమాట. ఇప్పుడు ఆ గన్‌ పట్లుకొని వివిధ ప్రాంతాల్లో ప్రయోగాలు చేయిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఢిల్లీని కమ్మేసిన కాలుష్యంతో నిండిన పొగ నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పొగను మాయం చేసే ప్రత్యేక గన్‌ను తెప్పించి పరీక్ష కూడా చేశారు. ఓ వాహనంపై ఉన్ననీటి ట్యాంక్‌కు అనుసంధానం చేసి ఈ గన్‌ను ఉపయోగిస్తారు. నేరుగా గాల్లోకి ఈ గన్‌ను పేల్చడం ద్వారా అది కాస్త దాదాపు వర్షం కురిసినట్లుగా సన్నటి నీటి బిందువులను కురిపిస్తుంది. దీంతో దట్టంగా దుమ్మూధూళి కణాలతో పేరుకుపోయిన పొగ కాస్త విడిపోయి మాయమయ్యేట్లు చేస్తుంది. ఇప్పటికే ఈ గన్‌ను ఢిల్లీలోని సెక్రటేరియట్‌ వద్ద పరీక్షించగా దానిని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇతర అధికారులు పర్యవేక్షించారు. ఈ మెషిన్‌ గన్‌ను ఒక వాహనాకి అమర్చి ఉన్న నేపథ్యంలో ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లి ప్రయోగించేందుకు వీలుంది. ఈ పరికరం దాదాపు రూ.20లక్షలు అవుతుందని, అన్ని చోట్లతో దీనిని ఉపయోగించడానికి ముందు మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని ఈ సందర్భంగా సిసోడియా తెలిపారు. ఢిల్లీ సరిహద్దులో ఎక్కువగా పొగపేరుకుపోయిన ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో బుధవారం ఈ గన్‌ను ప్రయోగించనున్నారు. ఈ గన్‌ నీటిని 50 మీటర్ల ఎత్తులోకి వర్షం మాదిరిగా నీటి తుంపర్లను పంపించగలదు. దీనికి కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఒకసారి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే ఢిల్లీలో పేరుకుపోయే పొగకు ఇదే కీలక పరిష్కారం కానుంది.

>
మరిన్ని వార్తలు