పోలీసుల చేష్టలకు మహిళ బలి

6 Jul, 2015 16:29 IST|Sakshi

బరబాంకి: తన భర్తను అరెస్టు చేసిన విషయంపై మాట్లాడేందుకు వెళ్లిన ఓ మహిళపట్ల సదరు పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడంతో అవమానం భరించలేని ఓ 28 ఏళ్ల నీతు ద్వివేది అనే మహిళ ఆత్మార్పణం చేసుకొంది. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిలువునా దహించుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరబాంకిలో చోటుచేసుకుంది. కొందరు యువకులు ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్న సమయంలో నీతు ద్వివేది భర్త రామ్ నరేన్ కాల్పులు జరిపాడన్న ఆరోపణల కింద పోలీసులు అరెస్టు చేశారు.

ఇదే విషయంపై ఆమె పోలీసులతో మాట్లాడేందుకు గత శనివారం పోలీస్ స్టేషన్కు వెళ్లగా రామ్ సాహెబ్ సింగ్ యాదవ్ అనే స్టేషన్ ఇన్ ఛార్జీ, ఎస్సై అఖిలేశ్ రాయ్ ఆమెను అవమానించారు. అందరిముందు బూతులు తిట్టారు. స్టేషన్ విడిచి వెళ్లిపోవాలంటూ వెంబడించి మరీ తరిమారు. దీంతో ఈ అవమానం భరించలేని నీతు ద్వివేది ఆత్మాహుతి చేసుకుంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు తావిచ్చింది. దీంతో ఆ స్టేషన్ ఎస్సైపై పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ వేటు వేసి విచారణ ప్రారంభించారు.

 

మరిన్ని వార్తలు