-

ఎన్‌ఐఏ కొత్త చీఫ్‌గా వైసీ మోదీ

19 Sep, 2017 02:19 IST|Sakshi
ఎన్‌ఐఏ కొత్త చీఫ్‌గా వైసీ మోదీ

అక్టోబర్‌ 30న శరద్‌కుమార్‌ నుంచి బాధ్యతలు స్వీకరించనున్న మోదీ
గుజరాత్‌ అల్లర్ల కేసుల్లో సుప్రీం ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యుడు
సశస్త్ర సీమా బల్‌ చీఫ్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ రజనీకాంత్‌ మిశ్రా


న్యూఢిల్లీ:  జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నూతన చీఫ్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వైసీ మోదీ నియమితులయ్యారు. 1984 అస్సాం–మేఘాలయ కేడర్‌కు చెందిన మోదీ ప్రస్తుతం సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) ప్రత్యేక డైరెక్టర్‌గా ఉన్నారు. 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)లో వైసీ మోదీ కూడా సభ్యునిగా ఉన్నారు. గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన మొత్తం తొమ్మిది కేసుల్లో నరోదా పటియ, నరోదాగామ్, గుల్బర్గ్‌ సొసైటీ కేసులను వైసీ మోదీ దర్యాప్తు చేశారు. గుల్బర్గ్‌ సొసైటీ హత్యాకాండ కేసులో నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి క్లీన్‌చిట్‌ లభించిన విషయం తెలిసిందే.

మోదీ పేరుకు ఏసీసీ ఆమోదం..
ఉగ్రవాదం, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయానికి సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే ఎన్‌ఐఏ కొత్త డైరెక్టర్‌ జనరల్‌(డీజీ)గా వైసీ మోదీ పేరును కేబినెట్‌ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించింది. అనంతరం ఎన్‌ఐఏ చీఫ్‌గా ఆయన పేరును ఖరారు చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ(డీవోపీటీ) శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఎన్‌ఐఏ చీఫ్‌ శరద్‌కుమార్‌ నుంచి అక్టోబర్‌ 30న వైసీ మోదీ బాధ్యతలు స్వీకరిస్తారు.

శరద్‌కుమార్‌ నుంచి బాధ్యతలు స్వీకరించే నిమిత్తం మోదీని ఎన్‌ఐఏలో ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ)గా తక్షణం నియమిస్తున్నట్టు డీవోపీటీ శాఖ వెల్లడించింది. ఎన్‌ఐఏ చీఫ్‌గా వైసీ మోదీ 2021 మే 31 వరకూ కొనసాగుతారు. శరద్‌కుమార్‌ 2013 జూలైలో ఎన్‌ఐఏ డీజీగా నియమితులయ్యారు. ఆయనకు రెండుసార్లు పొడిగింపు లభించింది. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి కేసు, వివిధ ఐఎస్‌ఐఎస్‌ సంబంధిత కేసుల దర్యాప్తు నిమిత్తం ఆయన పదవీ కాలాన్ని గత ఏడాది అక్టోబర్‌లో కేంద్రం సంవత్సరం పాటు పొడిగించింది. ఎన్‌ఐఏ చీఫ్‌గా ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి శరద్‌కుమారే.

ఎస్‌ఎస్‌బీ చీఫ్‌గా రజనీకాంత్‌ మిశ్రా
మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రజనీకాంత్‌ మిశ్రా ఇండో–నేపాల్‌ సరిహద్దుల్లో గస్తీ కాసే సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ) డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. 1984 ఉత్తరప్రదేశ్‌ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన మిశ్రా ప్రస్తుతం సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌)లో అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. ఆయన ఎస్‌ఎస్‌బీ చీఫ్‌గా 2019 ఆగస్టు 31 వరకూ కొనసాగుతారని డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు