-

ముంబై దాడులను ఎన్నటికీ మర్చిపోలేం : మన్‌ కీ బాత్‌లో ప్రధాని

26 Nov, 2023 12:37 IST|Sakshi

న్యూఢిల్లీ: ముంబైలో 2008 నవంబర్‌ 26న జరిగిన ఉగ్రవాద దాడులను ఎప్పటికీ మర్చిపోలేమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అది ఒక దారుణమైన ఉగ్ర దాడి అని అభివర్ణించారు. ఆదివారం తన మన్‌ కీ బాత్‌ ప్రసంగంలో ప్రధాని ముంబై టెర్రర్‌ దాడులను ప్రస్తావించారు.

‘ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడులను ఎప్పటికీ మర్చిపోలేం.ఆ రోజున ఉగ్రవాదులు ముంబైతో పాటు మొత్తం దేశాన్నే వణికించారు. ఆ దాడుల నుంచి మనం ధైర్యంతో కోలుకుని ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నాం’ అని ప్రధాని తెలిపారు. 

మరోపక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్‌లో 26/11 దాడుల్లో మరణించిన అమరవీరులకు నివాళులర్పించారు.వారి కుటుంబాలకు దేశం ఎప్పటికీ అండగా నిలుస్తుందన్నారు. దాడుల్లో మరణించిన పోలీసుల ధైర్య సాహసాలు ఉగ్రవాదంపై పోరులో దేశ పౌరులకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.

గుజరాత్‌లోని అరేబియా సముద్ర తీరం ద్వారా దేశంలోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదులు 2008, నవంబర్‌ 26న ముంబైలోని తాజ్‌ హోటల్‌, ఛత్రపతి శివాజీ రైల్వేస్టేషన్‌తో పాటు పలు ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పలు జరపడంతో పాటు గ్రెనేడ్‌లు విసిరారు. ఈ ఉగ్ర దాడుల్లో 18 మంది భద్రతా సిబ్బందితో పాటు మొత్తం 166 మంది  చనిపోయారు.10 మంది ఉగ్రవాదుల్లో తొమ్మిది మందిని భద్రతా బలగాలు అప్పటికప్పుడే మట్టుబెట్టాయి. ప్రాణాలతో పట్టుబడ్డ అజ్మల్‌ కసబ్‌ అనే ఉగ్రవాదికి మరణశిక్ష పడింది.

ఇదీచవండి..సుప్రీం కోర్టులో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి   

మరిన్ని వార్తలు