ఆ ప్రశ్న అడగ్గానే బోరుమన్న సీఎం

23 Feb, 2019 13:36 IST|Sakshi

లక్నో : యావత్‌ భారతావనికి తీరని శోకం మిగిల్చిన పుల్వామా ఉగ్రదాడిపై ఎదురైన ఓ ప్రశ్నకు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ బోరుమన్నారు. ‘యువకే మాన్‌కీబాత్‌’ కార్యక్రమంలో భాగంగా ఆయన శనివారం ఇంజనీరింగ్‌ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలనకు మోదీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఉగ్రవాదం తుది దశకు చేరుకుందని, మోదీ ప్రభుత్వం ఉగ్రవాద నిర్మూలనకు కంకణం కట్టుకుందని సమాధానం ఇచ్చారు. దీంతో హాల్‌లో విద్యార్థులంతా భారత్‌ మతాకీ జై.. జై జవాన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన ఆదిత్యనాథ్‌.. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.

తన కర్చీఫ్‌తో కన్నీళ్లను తుడుచుకుంటూ ఆవేశంగా మాట్లాడారు. ఈ దాడి జరిగిన 48 గంటల్లోనే కుట్రదారుడిని భారత బలగాలు మట్టుబెట్టాయని ఈ సందర్భంగా యోగి గుర్తు చేశారు. తీవ్ర శోకాన్ని మిగిల్చిన దాడిలో 40 మందికి పైగా జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే ఒక్క ఉత్తరప్రదేశ్‌ నుంచే 12 మంది జవాన్లు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. జేషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ఇద్దరి అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని కూడా ​యోగి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు