ధైర్యంగా ఉండండి, మీకు మేం ఉన్నాం: వీసీ

16 Dec, 2019 09:14 IST|Sakshi
జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ వీసీ నజ్మా అక్తర్‌

సాక్షి, న్యూడిల్లీ: వివాదాస్సద పౌరసత్వ సవరణకు బిల్లు వ్యతిరేక ఆందోళనతో ఢిల్లీ నగరం అట్టుడుకుతోంది. ముఖ్యంగా జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన హింసాత్మక ఘటనలకు దారి తీసింది. దీనిపై యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ నజ్మా అక్తర్‌ స్పందిస్తూ, విద్యార్థులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండించారు. ఈ కష్ట సమయంలో విద్యార్థులకు తమ సంపూర్ణ మద్దతు వుంటుందని వారికి భరోసా ఇచ్చారు.

అనుమతి లేకుండా పొలీసులు జెఎంఐలోకి ప్రవేశించారనీ, విద్యార్థుల తరగతి గదుల్లో చొరబడి మరీ వెంబడించి కొట్టారని ఆరోపించారు. లైబ్రరీలో చదువుకుంటున్న అమాయకులపై దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు. ఈ అనాగరిక ఘటనపై తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్టు ట్విటర్‌లో వెల్లడించారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నానని ట్వీట్‌ చేశారు. అంతేకాదు ఈ కష్టసమయంలో మీరు ఒంటరిగా లేరని జామియా మొత్తం మద్దతు విద్యార్తులకు ఉంటుందని హామీ ఇచ్చారు. మీరు  ఎప్పటికీ ఒంటరికాదు.. నిరుత్సాహపడకండి.. పుకార్లను నమ్మొద్దు అంటూ ఒక వీడియో​ సందేశంలో పేర్కొన్నారు. ఇదిలావుండగా, నిరసనల సందర్భంగా నిన్న అదుపులోకి తీసుకున్న 50 మంది విద్యార్థులను సోమవారం తెల్లవారుజామున విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఢిల్లీ విద్యార్థులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం, వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు), కోల్‌కతా జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం, ఐఐటీ ముంబై విద్యార్థులు నిరసన తెలిపారు. 

కాగా పౌరసత్వ సవరణ  చట్టానికి  నిరసనగా ఆదివారం నిర్వహించిన వ్యతిరేకంగా ప్రదర్శన సందర్భంగా, నాలుగు బస్సులు,  రెండు పోలీసు వాహనాలను తగలబెట్టినట్టు తెలుస్తోంది. ఆందోళనకారులు పోలీసులు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో విద్యార్థులు, పోలీసు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహా దాదాపు 60 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి అలీఘడ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం (ఎఎంయు)లో  ఘర్షణ చెలరేగింది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. టియర్‌గాస్ షెల్స్‌ను ఉపయోగించి, కాల్పులు జరిపారు. యూనివర్శిటీ బాత్రూంలో గాయపడిన విద్యార్థులు, తీవ్ర రక్తస్రావంతో పడివున్న విద్యార్థుల ఫుటేజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఢిల్లీ పోలీసులు బలవంతంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి విద్యార్థులను కొట్టారని యూనివర్శిటీ చీఫ్ ప్రొక్టర్ వసీమ్ అహ్మద్ ఖాన్ ఆదివారం ఆరోపించారు.

మరిన్ని వార్తలు