మీ వాదనలు సరిగా లేవు

20 Oct, 2016 01:24 IST|Sakshi
మీ వాదనలు సరిగా లేవు

- ఏపీ, తెలంగాణలను ఉద్దేశించి ట్రిబ్యునల్ వ్యాఖ్య
- 8వ అంశంపై వాదనలు సమర్థనీయంగా లేవు
- తెలంగాణ ప్రయోజనాలు ఉమ్మడి ఏపీ పట్టించుకోలేదన్న వాదన  తిరస్కరణ
- చట్టంలో ఆస్తుల విభజనను పలు సెక్షన్లు సూచిస్తున్నాయి
- అందుకే నీటి పంపకాలు కూడా రెండు రాష్ట్రాల మధ్యే
- కర్ణాటక, మహారాష్ట్ర వాదనల్లో బలం ఉందన్న ట్రిబ్యునల్
 
 సాక్షి, న్యూఢిల్లీ: ‘మీరు లేవనెత్తిన అంశాలపై మీ వాదనలు సమర్థనీయంగా లేవు.. మీరు సరిగా వివరించలేకపోయారు’ ఓ సందర్భం లో తెలంగాణ, ఏపీలను ఉద్దేశించి స్వయంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ చేసిన వ్యాఖ్యలివీ! కృష్ణా జలాలను ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-89 ప్రకారం నాలుగు రాష్ట్రాలకు పంచాలంటూ ఇరు రాష్ట్రాలు చేసిన వాదనల్లో ఏ ఒక్కటీ ట్రిబ్యునల్‌ను మెప్పించలేపోయాయి. ఆ వాదనలేవీ నిలబడలేని తీరుకు 124 పేజీల తీర్పు అద్దం పట్టింది. సెక్షన్-89 పరిధిపై విచారణ జరుగుతున్నప్పుడు అన్ని రాష్ట్రాల సమ్మతితో 9 అంశాలపై విచారణ జరగాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇందులో ఎనిమిదో అంశంపై ఏపీ, తెలంగాణలు తాము లేవనెత్తిన అంశంపై సమర్థనీయంగా వాదించలేకపోయాయని ట్రిబ్యునలే తీర్పులో పేర్కొంది. ‘‘ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిర్దిష్ట కేటాయింపులు జరపకుండా.. తెలంగాణ, ఏపీ ప్రాజెక్టులకే కేటాయింపులు జరి పితే.. తక్కువ నీటి ప్రవాహం ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ ప్రొటొకాల్ నిర్ధారణ సాధ్యమవుతుందా’’ అన్న అంశాన్ని ఏపీ, తెలంగాణ లేవనెత్తడంతో దీన్ని 8వ అంశంగా చేర్చా రు. దీనికి ట్రిబ్యునల్ తీర్పులో సమాధానమిస్తూ.. ‘‘వాస్తవానికి ఈ అంశంపై ఎక్కువగా వాదనలు చేయలేదు. అలాగే ఈ అంశానికి మద్దతుగా ఏ వివరణా లేదు. అందువల్ల ఈ వాదనను నిలబెట్టడానికి మా వద్ద ఎలాంటి కారణం లేదు’’ అని పేర్కొంది. ఇలాంటి కీలక అంశంపై కూడా సవివరంగా వాదించకపోవడం అంతిమంగా ఉభయ రాష్ట్రాలు నష్టపోయే పరిస్థితికి దారితీసింది.

 ఆస్తుల విభజనే ప్రాతిపదికగా: విచారణ సందర్భంగా ట్రిబ్యునల్... పలుమార్లు ఆస్తులు పంచుకున్న రీతిలోనే నీటిని పంచుకుంటే ఎలా ఉంటుందని వ్యాఖ్యానిస్తూ వచ్చింది. కానీ ఈ వ్యాఖ్యలను నిశితంగా పరిగణనలోకి తీసుకుని ఏపీ, తెలంగాణలు బలమైన వాదనలు వినిపించడంలో విఫలమయ్యాయి. తీర్పు కూడా ఈ వ్యాఖ్యలను బలపరుస్తూ ఆస్తుల మాదిరే నీటిని పంచుకోవాలన్న ప్రస్తావనలతో ఉంది. కర్ణాటక తరపున సీనియర్ న్యాయవాది అనిల్ దివాన్ చేసిన వాదనల్లో బలం కనిపించిందని పేర్కొంది. సెక్షన్ 48 రెండు రాష్ట్రాలు భూములు, వస్తువులను, అలాగే సెక్షన్ 49 నగదు, బ్యాంకు నిల్వలను, సెక్షన్ 51 రుణాలు తదితరాలను, సెక్షన్ 52 పెట్టుబడుల్ని పంచుకోవాలని ఆయన వాదించారు.

ఇలా సెక్షన్ 67 వరకు ఇలాంటి నిబంధనలే ఉన్నాయంటూ ఆయన చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్నట్టు ట్రిబ్యునల్ తీర్పులో అవగతమవుతోంది. అలాగే నీటి వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటులో ఏపీ, తెలంగాణకే చోటుందని, ఇతర రాష్ట్రాలకు ఇందులో చోటు లేదని మహారాష్ట్ర తరపు సీనియర్ న్యాయవాది చేసిన వాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంది. సెక్షన్ 89లో ‘సక్సెసర్ స్టేట్స్’ అన్న ప్రస్తావన ఉందని, దానికి కేవలం కొత్త రాష్ట్రాలని మాత్రమే అర్థమని అంధ్యార్జున చేసిన వాదనలను ప్రస్తావించింది. అలాగే ఇతర రాష్ట్రాలు విడిపోయినప్పుడు విడిపోయిన రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే కేటాయింపులు జరిగాయి తప్ప ఏ ఇతర రాష్ట్రాలను ఆ వివాదంలో చేర్చలేదన్న కర్ణాటక, మహారాష్ట్ర వాదనలను తీర్పు ప్రముఖంగా ప్రస్తావించింది.

 తెలంగాణ వెనుకబాటుపై ఏమందంటే
 వెనకబాటుతనం, నీళ్ల కోసమే రాష్ట్ర ఏర్పాటు, తమ ప్రాంత ప్రయోజనాలను ఉమ్మడి రాష్ట్రం ట్రిబ్యునల్ ముందు వినిపించకపోవడం వంటి అంశాలను తెలంగాణ ప్రస్తావించిందని ట్రిబ్యునల్ పేర్కొంది. అయితే ఇవేవీ సెక్షన్ 89ను అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయాలన్న వాదనలకు బలం చేకూర్చేలా లేవని స్పష్టం చేసింది. ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా తెలంగాణ ప్రయోజనాలను కూడా వినిపించిందని పేర్కొంది. తెలంగాణలో ఎగువ ప్రాంతానికి 20 టీఎంసీల నీటిని కేటాయించాలని ఉమ్మడి
 
 ఏపీ చేసిన వాదనలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీంతో ఈ వాదనలను లోతుగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనిపించిందని, ఒకవేళ కొన్ని నీళ్లు ఆంధ్రా ప్రాంతానికి ఎక్కువగా వచ్చినా, తెలంగాణకు తక్కువగా వచ్చినా.. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల సమయంలో సర్దుబాటు చేసుకోవచ్చంది. నీటి కోసమే తెలంగాణ ఏర్పడిందన్న వాదనలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. దీన్ని బలపరస్తూ ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ‘కారణాలు, లక్ష్యాలు’ శీర్షిక కింద కూడా కనీస ప్రస్తావన లేదంది.
 
 ట్రిబ్యునల్‌కు ఆ అధికారం ఉంది
 విచారణకు ముందు అన్ని రాష్ట్రాల సమ్మతితో రూపొందించుకున్న 9 అంశాలతో పాటు విచారణ సందర్భంగా తలెత్తిన మరో అంశంపై కూడా ట్రిబ్యునల్ వివరణ ఇచ్చింది. సెక్షన్ 89 పరిధి ఏంటన్న అంశాన్ని ట్రిబ్యునల్ ఎలా విచారిస్తుందని, కేవలం నీటి వివాదాన్ని మాత్రమే పరిష్కరిస్తుందని చేసిన వాదనలపై తీర్పులో సుదీర్ఘ ప్రస్తావన చేసింది. భవిష్యత్తులో తలెత్తే వివాదాన్ని కూడా పరిష్కరించే అధికారం ట్రిబ్యునల్‌కు ఉందని, అందువల్లే ట్రిబ్యునల్ పరిధిని నిర్వచించేందుకు విచారణ చేపట్టినట్టు పేర్కొంది.

మరిన్ని వార్తలు