‘ఫిరాయింపులపై అన్నిపార్టీలు స్పందించాయి’

7 Apr, 2017 20:33 IST|Sakshi
చట్టంలో తక్షణం మార్పులు తేవాలి: ఏచూరి

న్యూఢిల్లీ: ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లినప్పుడు రాజీనామా చేయాలని, చట్టంలో తక్షణం మార్పులు తేవాల్సిన అవసరం ఉందని  సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అనర్హతలపై నిర్ణయానికి స్పీకర్‌కు కాలపరిమితి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నాయకులను కలుస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలపై ఏచూరీతో చర్చించి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న పరిణామాలే మణిపూర్‌, గోవాలో జరిగాయని, అలాంటి వాటిని ఉపేక్షించరాదని అన్నారు. దీనిపై తాము ఎన్నికల కమిషన్‌తో కూడా మాట్లాడతామని అన్నారు.

భేటీ అనంతరం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ఫిరాయింపులపై అన్ని పార్టీల నేతలు స్పందించారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు మారాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. వ్యవస్థలో మార్పు కోసం అందరూ కలిసి రావాలని, లేకుంటే వ్యవస్థలు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. అంతకు ముందు వైఎస్‌ జగన్‌...ములాయం సింగ్‌ యాదవ్‌, సురవరం సుధాకర్‌ రెడ్డి, కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ, శరద్‌ యాదవ్‌తో సమావేశం అయిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు