కశ్మీర్‌లో ఉగ్రవాది హతం

25 May, 2019 02:53 IST|Sakshi

ఎన్‌కౌంటర్‌లో గజ్వత్‌ ఉల్‌ హింద్‌ గ్రూప్‌ చీఫ్‌ జకీర్‌ మృతి

శ్రీనగర్‌: ఉగ్రసంస్థ అల్‌కాయితో సంబంధాలున్న గజ్వత్‌ ఉల్‌ హింద్‌ గ్రూప్‌ చీఫ్‌ జకీర్‌ ముసాను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్‌ పుల్వామా జిల్లాలోని త్రాల్‌ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ‘చనిపోయిన ఉగ్రవాదిని జకీర్‌ ముసాగా గుర్తించాం. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నాం’అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి రాజేశ్‌ కాలియా వెల్లడించారు. తొలుత దాద్‌సారా గ్రామంలో భద్రతా బలగాలు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయని, అదే సమయంలో అతడు పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపినట్లు వివరించారు.

అతడిని పట్టుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా వినలేదని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. కాగా, షోపియాన్, పుల్వామా, అవంతీపురా, శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో జకీర్‌కు మద్దతుగా ప్రజలు ఆందోళనలు చేపట్టారని, నినాదాలు చేస్తూ రోడ్లపైకి రావడంతో అధికారులు లోయలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం.. ముసా 2013 నుంచి ఉగ్రకార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నట్లు తెలిసింది. తొలుత హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రసంస్థతో సంబంధాలు ఏర్పరచుకున్నాడని, ఆ తర్వాత అన్సర్‌ గజ్వత్‌ ఉల్‌ హింద్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. 2017లో హురియత్‌ కాన్ఫరెన్స్‌ నేతలను బెదిరించినట్లు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు