ఎన్నారై ఓటు.. తీసికట్టు

21 Mar, 2019 11:34 IST|Sakshi

కోటీ ముప్పై లక్షలు.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య ఇది. ఓటర్లుగా నమోదు చేసుకున్నది మాత్రం కేవలం 71 వేల మంది మాత్రమే! తాజా ఓటర్ల జాబితా ప్రకారం చూస్తే ఇందులో 92 శాతం మంది కేరళీయులే!! ఆశ్చర్యంగా ఉందా? అయినా ఇదే వాస్తవం. తమకు ఓటు హక్కు కల్పించాలని ఎన్నారై సంస్థలు చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ అంశంపై ప్రభుత్వాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరకు 2010లో ప్రజాప్రాతినిధ్య చట్టానికి మార్పులు చేసి వీరికీ ఓటుహక్కు కల్పించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకూ ఓటర్లుగా నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య మరీ నత్తనడకన సాగుతోందంటే అతిశయోక్తి కాదు. ఇతర దేశాల్లో ఉంటూ పౌరసత్వం తీసుకోని భారతీయులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించగా.. 2012 నుంచి ఎన్నికల కమిషన్‌ ఈ జాబితాను ప్రచురించడం మొదలుపెట్టింది. అప్పటికి కేవలం పదివేల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.

ఆరేళ్ల తరువాత అంటే 2018 నాటికి ఈ సంఖ్య 24,507కి చేరింది. ఇందులో 1,942 మంది మహిళలు. 2019 తాజా జాబితా ప్రకారం మాత్రం ఇది మూడు రెట్లు ఎక్కువై 71,735కు చేరుకుంది. ఇందులో 92 శాతం అంటే 66,584 ఓట్లు కేరళ నుంచి నమోదయ్యాయి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో నమోదైన ఎన్నారై ఓటర్ల సంఖ్య 5,151. ఈ ఏడాది జాబితాలోని ఇంకో విశేషమేమిటంటే 20 మంది ఎన్నారై హిజ్రాలు కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవడం. ఎన్నికల కమిషన్‌ ఎన్నారై ఓటర్ల నమోదును పెంచేందుకూ ఎన్నో ప్రచార కార్యక్రమాలు చేపట్టినప్పటికీ.. నమోదు ప్రక్రియలోని సంక్లిష్టత కారణంగా ఎక్కువమంది మొగ్గుచూపడం లేదు. ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు రావాల్సి ఉండటం ఇంకో కారణంగా చెబుతున్నారు.

మరిన్ని వార్తలు