భారత్, యూఎస్ సంబంధాల్లో ఎన్నారైలే కీలకం

19 Jul, 2013 16:38 IST|Sakshi
అమెరికా దేశ ఉపాధ్యక్షుడు జోయి బిడెన్

భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాల్లో యూఎస్లోని భారతీయ సమాజం కీలక పాత్ర పోషిస్తుందని ఆ దేశ ఉపాధ్యక్షుడు జోయి బిడెన్ గురువారం వెల్లడించారు. ఆయన త్వరలో భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో ఆయన భారతీయ సంతతికి చెందిన ఎన్నారైలతో జోయి బిడెన్ బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. వ్యాపారం, వాణిజ్యం, వాతావరణ మార్పులు, ఇంధన రంగాల ప్రభావం ఇరుదేశాల మధ్య ఒకేవిధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

 

ద గ్లోబల్ ఫండ్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకులు మాయ అజ్మీర, మాస్టర్ కార్డ్స్ వరల్డ్వైడ్ అధ్యక్షుడు,సీఈవో మరియు యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ అజయ్ బంగా, వరల్డ్ రిసొరెస్ ఇనిస్టిట్యూట్ కార్యనిర్వహాక ఉపాధ్యక్షుడు మనీష్ బొప్పన తదితర ఎన్నారైలు బుధవారం జోయి బిడెన్తో సమావేశమయ్యారు. భారత పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్తోపాటు పలువురు నాయకలతో జోయి బిడెన్ సమావేశం కానున్నారు. ఈ మేరకు వైట్హౌస్ భవనం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

 

కేంద్ర మంత్రులు పి.చిదంబరం, ఆనంద శర్మలు గత వారం అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా యూఎస్లోని ఉన్నతాధికారులు, చట్టసభ సభ్యులతోపాటు వివిధ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో వారిరువురు భేటీ అయ్యారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ చివర లేదా ఆక్టోబర్ మొదటి వారంలో మన్మోహన్ సింగ్ ఒబామా ఆహ్వానం మేరకు యూఎస్లో పర్యటించనున్నారు.

మరిన్ని వార్తలు