సింగపూర్‌లో ఉగాది కల్చరల్‌ నైట్‌

2 Apr, 2018 20:44 IST|Sakshi

సింగపూర్‌ సిటీ : తెలుగు నూతన సంవత్సరం ఉగాది వేడుకలు సింగపూర్‌ నగరంలో శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక కల్లాంగ్‌ థియేటర్‌, వన్‌ స్టేడియం వాక్‌లో ఈ వేడుకలను సింగపూర్‌ తెలుగు సమాజం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 1,700 మంది స్థానిక తెలుగు వారు హాజరయ్యారు. పాటల రచయిత చంద్రబోస్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

యాంకర్‌ శ్యామల, సింగర్స్‌ సత్య యామిని, అనుదీప్‌, ప్రవీణ్‌ కుమార్‌, వీఆర్‌ లక్ష్మీ , కమెడియన్స్‌ మాస్‌ అవినాష్‌, కెవ్వు కార్తీక్‌, తాగుబోతు రాజమౌళి, డ్యాన్సర్స్‌ ఆట సందీప్‌ టీమ్‌తో పాటు ఢీ జోడి ఫేమ్ ప్రియాంకలు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను  మంత్రముగ్ధులను చేశారు. రచయిత చంద్రబోస్‌ తన ఇరవై మూడేళ్ల సాహితీ ప్రస్థానాన్ని పాటలహారంగా మలచి సింగపూర్‌ తెలుగు ప్రజల ముందుంచారు.

తెలుగుభాష పరివ్యాప్తికి, పరిరక్షణ గురించి పాటుపడుతున్న తెలుగు సమాజం కృషిని, తాపత్రయాన్ని ఆయన అభినందించారు. త్వరలో జరగనున్న కార్మిక దినోత్సవ కార్యక్రమ సన్నాహాకాల్లో భాగంగా నిర్వహించే క్రికెట్‌ పోటీలను చంద్రబోస్‌ ఆరంభించారు. తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగువారందరూ కలిసిమెలిసి ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కివక్కాణించారు.

ఉగాది కల్చరల్‌ నైట్‌ 2018కు ముఖ్య స్పాన్సర్స్ గా ఉన్న యప్ టీవీ, గ్రీన్ ఏకర్స్, ఆదిత్య బిల్డర్స్ తదితర స్పాన్సర్స్ కు, అశేషంగా ఆదరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి కోటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ విజయానికి కృషి చేసిన సింగపూర్‌ తెలుగు సమాజం కార్యవర్గ సభ్యులు సత్య ఎస్‌, జ్యోతీశ్వర్‌, నాగేష్‌, వినయ్‌, రామ్‌, అనిల్‌, ప్రదీప్‌, ప్రసాద్, మల్లిక, ఇతర స్వచ్ఛంద కార్యకర్తల కృషిని కార్యదర్శి సత్య చిర్ల కొనియాడారు.

మరిన్ని వార్తలు