ఇష్టమైన కళ తీరిన వేళ

17 Oct, 2023 00:10 IST|Sakshi

స్ఫూర్తి

పోలియో బాధితురాలైన సునిత త్రిప్పనిక్కర అయిదు సంవత్సరాల వయసు నుంచి బొమ్మలు వేయడం ప్రారంభించింది. సునిత మొదట్లో చేతులతోనే బొమ్మలు వేసేది. అయితే డిగ్రీ చదివే రోజుల్లో చేతుల్లో పటుత్వం కోల్పోయింది. బ్రష్‌ పట్టుకోవడం కష్టంగా మారింది. ఆ సమయంలో తన సోదరుడిని స్ఫూర్తిగా తీసుకుని మౌత్‌ ఆర్టిస్ట్‌గా మారింది. దివ్యాంగుడైన ఆమె సోదరుడు నోటితో కుంచె పట్టుకుని బొమ్మలు వేస్తాడు.

సునిత ఇప్పటివరకు అయిదు వేలకు పైగా పెయింటింగ్స్‌ వేసింది. ఆమె ఆర్ట్‌వర్క్స్‌ సొంత రాష్ట్రం కేరళతోపాటు సింగపూర్‌లోనూ ప్రదర్శితమయ్యాయి. ప్రకృతి సంబంధిత చిత్రాలు వేయడం అంటే సునితకు ఇష్టం. విన్సెంట్‌ వాన్‌ గో ఆమెకు ఇష్టమైన చిత్రకారుడు.

‘ప్రయాణాలు చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. ఇక రంగులు అనేవి నన్ను ఎప్పుడూ అబ్బురపరిచే అద్భుతాలు. సంప్రదాయంతో పాటు ఆధునిక చిత్రధోరణులు అంటే కూడా ఇష్టం. మొదట్లో పళ్ల మధ్య కుంచె పట్టుకుని చిత్రాలు వేయడం చాలా కష్టంగా అనిపించింది. సాధన చేస్తూ చేస్తూ కష్టం అనిపించకుండా చేసుకున్నాను’ అంటుంది సునిత.
సునిత చేసే ప్రయాణాలలో కనిపించే సుందర దృశ్యాలు కాన్వాస్‌పైకి రావడానికి ఎంతోకాలం పట్టదు.

‘బాధితులకు ఓదార్పును ఇచ్చే శక్తి చిత్రకళకు ఉంది’ అంటాడు వ్యాన్‌ గో. ఆ మాట సునిత విషయంలో అక్షరాలా నిజం అయింది. క్యాన్వాస్‌ దగ్గర ఉన్న ప్రతిసారీ తనకు వందమంది స్నేహితుల మధ్య సందడిగా ఉన్నట్లుగా ఉంటుంది. ధైర్యం చెప్పే గురువు దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది. ఆత్మీయతను పంచే అమ్మ దగ్గర ఉన్నట్లుగా ఉంటుంది. ‘నా జీవితంలోకి చిత్రకళ రాకుండా ఉండి ఉంటే పరిస్థితి ఊహకు అందనంత విషాదంగా ఉండేది’ అంటుంది సునిత.

బెంగళూరు నుంచి సింగపూర్‌ వరకు సునిత ఆర్ట్‌ ఎగ్జిబిషన్స్‌ జరిగాయి. అక్కడికి వచ్చే వారు ఆర్టిస్ట్‌గా ఆమె ప్రతిభ గురించి మాత్రమే మాట్లాడడానికి పరిమితం కాలేదు. స్ఫూర్తిదాయకమైన ఆమె సంకల్పబలాన్ని వేనోళ్లా పొగిడారు. ‘మౌత్‌ అండ్‌ ఫుట్‌ పెయింటింగ్‌ ఆర్టిస్ట్స్‌’ సంస్థలో సభ్యురాలైన సునిత దివ్యాంగులైన ఆర్టిస్ట్‌లకు సహకారం అందించే ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వీల్‌చైర్‌కే పరిమితమైన వారిలో విల్‌పవర్‌ పెంపొందించేలా సోదరుడు గణేష్‌తో కలిసి ‘ఫ్లై’ అనే సంస్థను ప్రారంభించింది. ‘చిరకు’ పేరుతో ఒక పత్రికను నిర్వహిస్తోంది.

కాలి వేళ్లే కుంచెలై...
రెండు చేతులు లేకపోతేనేం సరస్వతీ శర్మకు సునితలాగే అంతులేని ఆత్మబలం ఉంది. సునిత నోటితో చిత్రాలు వేస్తే రాజస్థాన్‌కు చెందిన సరస్వతీ శర్మ కాలివేళ్లను ఉపయోగించి చిత్రాలు వేస్తుంది. ఇంగ్లీష్‌ సాహిత్యంలో మాస్టర్స్‌ చేసింది. ఫైన్‌ ఆర్ట్స్‌లో డిప్లొమా చేసింది. ఎడమ కాలితో నోట్స్‌ రాసుకునేది. ‘మొదట్లో ఆర్ట్‌ అనేది ఒక హాబీగానే నాకు పరిచయం అయింది. అయితే అది హాబీ కాదని, అంతులేని శక్తి అని ఆ తరువాత అర్థమైంది’ అంటుంది సరస్వతీ శర్మ. కోచిలోని ‘మౌత్‌ అండ్‌ ఫుట్‌ ఆర్టిస్ట్స్‌’ ఆర్ట్‌ గ్యాలరీలో సునిత చిత్రాలతో పాటు సరస్వతి చిత్రాలను ప్రదర్శించారు. ఒకవైపు నోటితో చిత్రాలు వేస్తున్న సునిత మరో వైపు కాలివేళ్లతో చిత్రాలు వేస్తున్న సరస్వతిలను చూస్తుంటే ప్రేక్షకులకు ఆత్మబలానికి నిలువెత్తు రూపాలను చూసినట్లుగా అనిపించింది.


‘అయ్యో’ అనుకుంటే ఎదురుగుండా కనిపించే దారిలో అన్నీ అవరోధాలే కనిపిస్తాయి.
‘అయినా సరే’ అనుకుంటే మనసు ఎన్నో మార్గాలు చూపుతుంది. కేరళలోని కన్నూర్‌కు చెందిన సునితకు బొమ్మలు వేయడం అంటే ప్రాణం. అయితే చేతులు పటుత్వం కోల్పోవడంతో కుంచెకు దూరం అయింది.
‘ఇష్టమైన కళ ఇక కలగానే మిగలనుందా?’ అనుకునే నిరాశామయ సమయంలో మనసు మార్గం చూపించింది. మౌత్‌ ఆర్టిస్ట్‌గా గొప్ప పేరు తెచ్చుకుంది...

మరిన్ని వార్తలు