అమెరికా వ్యాప్తంగా వైఎస్సార్ వర్థంతి సభలు

27 Aug, 2018 15:09 IST|Sakshi

దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్థంతి సభలను అమెరికాలోని అన్ని ముఖ్యపట్టణాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జన హృదయ నేత రాజశేఖర రెడ్డికి నివాళు అర్పించడానికి అమెరికా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు భారీగా తరలివచ్చి వైఎస్సార్‌ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ యుఎస్ఏ విభాగం, రాజశేఖర రెడ్డి అభిమాన సంఘం పిలుపునిచ్చింది. వైఎస్సార్‌ వర్థంతి సభలతోపాటూ మెగా రక్త దాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

సెప్టెంబర్‌ 3న మేరీల్యాండ్‌లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్యారడైజ్‌ ఇండియన్‌ క్యూసిన్‌లో, సెప్టెంబర్‌7న శుక్రవారం సాయంత్రం డల్లాస్‌లో ఇర్వింగ్‌లోని అల్టిమేట్‌ బీబీక్యూలో, సెప్టెంబర్‌ 9న ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు కాలిఫోర్నియాలో సన్నీవెల్‌లోని సంక్రాంతి రెస్టారెంట్‌లో వైఎస్సార్‌ వర్థంతి సభలు నిర్వహించనున్నారు. కాలిఫోర్నియా, డల్లాస్‌, మేరీల్యాండ్‌లలో జరిగే వర్థంతి సభలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, సామినేని ఉదయభానులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. టెక్సాస్‌లోని జార్జిటౌన్‌లో పార్క్‌సైడ్‌ కమ్యునిటీ సెంటర్‌లో సెప్టెంబర్‌ 9న ఆదివారం 10 గంటలకు వర్థంతి సభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. డా.వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 8, శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు కింగ్‌ ఆఫ్‌ ప్రష్యాలోని రాడిసన్‌ హోటల్‌ వ్యాలీ ఫోర్జ్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. డా. వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్‌, డల్లాస్‌ వైఎస్సార్‌సీపీ సంయుక్తంగా  సెప్టెంబర్‌ 2, ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇర్వింగ్‌లోని ఎలిమెంట్స్‌ డల్లాస్‌ ఫోర్ట్‌ వర్త్‌ ఎయిర్‌పోర్ట్‌ నార్త్‌ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు.

పేద ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేసిన వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడిచి, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తారని ఈ సందర్భంగా ఎన్నారైలు ఆకాంక్షించారు. ప్రజల అండతో 2019లో వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహానేత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన తుది శ్వాస విడిచే వరకు ప్రజలకు అందించేందుకు కృషి చేశారని ఎన్నారైలు పేర్కొన్నారు. పరిపాలన దక్షతకు, రాజనీతిజ్ఞతకు మహానేత వైఎస్ఆర్ నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. వీరందరి నుంచి నేటికి దివంగత నేత డాక్టర్ వైఎస్సార్‌ నిత్య నీరాజనాలు అందుకుంటున్నారని తెలిపారు.


 

మరిన్ని వార్తలు