పేదరికమే పెనుముప్పు

30 Jan, 2014 00:02 IST|Sakshi
పేదరికమే పెనుముప్పు

ఈ నెల 22-25 మధ్య దవోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం విపరీతంగా పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలే ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పని అందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ సంపన్నుల వేదిక సమస్యను గుర్తించిందేగానీ పరిష్కారాల వేపు కన్నెత్తి చూడలేదు.
 
 ‘రానున్న దశాబ్దంలో ప్రపంచం ఎదుర్కోనున్న అతిపెద్ద ముప్పు’ ఏమిటని అడిగితే ‘పెరిగిపోతున్న ధనిక, పేద వ్యత్యాసాలే’నని ‘కాలం చెల్లిన’ మార్క్సిజాన్ని పట్టుకు వేలాడే చాదస్తపు కమ్యూనిస్టులుగాక మరెవరు అనగలరు? అదేం వైపరీత్యమో గానీ హఠాత్తుగా కమ్యూనిస్టు భూతం ప్రపంచ కుబేరులందరినీ ఆవహించినట్టుంది. లేకపోతే వంద దేశాల కుబేరులంతా కలిసి ప్రపంచ వృద్ధి రథాన్ని రోదసి బాట పట్టించాలని నిర్వహించిన దవోస్ ‘యజ్ఞ వేదిక’పై నుంచి... పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతల వంటి వినరాని మాటలు వినిపిస్తాయా? ఈనెల 22-25 మధ్య స్విట్జర్లాండ్‌లోని దవోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 44వ వార్షిక సమావేశం జరిగింది.
 
  ‘అతి సంపన్నులకు, అతి పేదలకు మధ్య పెరిగిపోతున్న అంతరం సామాజిక, ఆర్థిక సుస్థిరతతో పాటూ ఆర్థికాభివృద్ధికి కూడా ముప్పుగా మారుతోంది’ అని డబ్ల్యూఈఎఫ్ నివేదిక ప్రకటించింది. వేదిక ప్రధాన ఆర్థిక శాస్త్రవేత్త జెన్నిఫర్ బ్లాంకె మరో అడుగు ముందుకేసి ‘ప్రబలుతున్న అసంతృప్తి సమాజంలో నిరాశానిస్పృహలు ప్రబలే పరిస్థితికి దారితీస్తుం ది. ప్రత్యేకించి యువతీయువకులు భవిష్యత్తు లేదని భావించినప్పుడు జరిగేది అదే’నని ప్రకటించారు. అవును, యూరోజోన్‌లోని కొన్ని దేశాల్లో 50 నుంచి 60 శాతం యువత అలాంటి నిరాశామయస్థితిలోనే ఉంది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ కోలుకుంటోందని అంటున్న కుబేరుల్లో ఈ నైరాశ్యం ఏమిటి? పోగేసుకున్న అపార సంపదలే పీడకలలై వేధించడమేమిటి?  
 
 గుర్రం కాదు గాడిద- గాడిద కాదు గుర్రం
 అమెరికా పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి మంగళవారం అధ్యక్షుడు బరాక్ ఒబామా ‘దేశ పరిస్థితి’పై ఉపన్యసించారు.  రిపబ్లికన్‌లు కాదంటే ఒంటరిగానైనా ఆర్థిక అసమానతలను రూపుమాపుతామని గర్జించారు. అమెరికాను స్వర్గ సీమగా భావించే భారత్‌లో పేదరికం, ఆర్థిక అసమానతలు అనే మాటలు వినిపిస్తేనే ఆర్థిక ‘నిపుణుల’కు, జాతీయ మీడియా ‘విశ్లేషకుల’కు చిర్రెత్తుతుంది. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన అంటూ ప్రభుత్వ సొత్తును ప్రజలకు పందారం చేసే ‘జనాకర్షక పథకాల’ను దుమ్మెత్తి పోయనివాడు మేధావే అనిపించుకోడు. ప్రజా సంక్షేమానికి కోత పెట్టి ద్రవ్యలోటును తగ్గిస్తే తప్ప వృద్ధి సాధ్యం కాదనే అమెరికా విరచిత ఆర్థిక విధానాలను వారంతా వల్లె వేస్తుంటే ఇంతకాలం నోళ్లు తెరుచుకుని వింటున్నాం. ప్రభుత్వాలు ఎన్ని వాతలు పెడుతున్నా, కోతలు కోస్తున్నా కిమ్మనకుండా భరిస్తున్నాం. ఇంతలో ఇదేమిటి? నిన్న మనం గుర్రం అంటే, కాదు కాదు గాడిద అని అనిపించినవాళ్లే... వాళ్ల మాట మేరకే గాడిద అంటున్న దాన్ని ‘కాదు కాదు అది గాడిద కాదు గుర్రం’ అనడమా?
 
 ఒబామా అదే చేస్తున్నారు. నిజానికి గత ఏడాది డిసెంబర్ 4న ‘అసమానత నైతికంగా తప్పు, దుష్ట అర్థశాస్త్రం’ అంటూ అసమానతలపై యుద్ధం ప్రకటిం చారు. ‘ఆర్థిక అసమానత వల్ల వృద్ధి మరింత బలహీనపడిపోతోంది, అసమానతలు అధికంగా ఉన్న దేశాల్లోనే ఆర్థిక తిరోగమనాలు తరచుగా సంభవిస్తున్నాయి’ అని అక్షర సత్యాలను చెప్పారు. గత ఐదేళ్లుగా ఆయన అమలు చేస్తున్న ఆర్థిక విధానాలకు ప్రాతిపదిక మార్కెట్ అర్థశాస్త్రమే. ఆ విధానాల మేరకే 2007లో బద్ధలైన సంక్షోభానికి విరుగుడుగా లక్షల కోట్ల డాలర్ల ప్రభుత్వ ధనాన్ని సంపన్నులకు బెయిలవుట్లుగా ఇచ్చారు.
 
 లోటు బడ్జెటు, ద్రవ్యలోటు మహా పాపమంటూ ప్రభుత్వ వ్యయాలపై కోతలు పెడుతూ వచ్చారు. సంపన్నులు మరింత సంపన్నులు కావడానికి, సామాన్యులు పేదరికంలోకి దిగజారడానికి కారకులయ్యారు. ఫలితంగా అమెరికాలోని 1 శాతం అతి సంపన్నుల సంపద రికార్డు స్థాయిలో విస్తరించి దేశ సంపదలో 50.4 శాతానికి చేరింది (1917 తర్వాత ఇదే అత్యధికం). ఆ ఒక్క శాతం ఆదాయాలు 2008-2012 మధ్య  31.4 శాతం పెరిగాయి. జనాభాలో మిగతా 99 శాతం ఆదాయాల పెరుగుదల సున్నాకు రవ్వంత ఎక్కువ... 0.4 శాతం. వృద్ధిలో కాసింత కదలికకు మించి మరేమీ లేని తిరోగమనంలో సంపన్నులు మరింత సంపన్నులెలా అయ్యారు? కాలిఫోర్నియా ఆర్థిక శాస్త్రవేత్త ఇమాన్యుయెల్ సోజే అది విడమరిచారు. ‘ఆర్థిక వ్యవస్థకు వాస్తవంగా ఎలాంటి లబ్ధి కలగకుండానే వాళ్లు కేంద్ర బ్యాంకు నుంచి, ప్రభుత్వం నుంచి లబ్ధిని పొందారు.’
 
 ఒబామాకు కమ్యూనిస్టు దెయ్యం...
 డబ్బున్నవారి దగ్గరికే డబ్బు నడిచిపోదు, ప్రభుత్వ విధానాలే ఆ పని చేస్తాయి. బ్రెజిల్, భారత్, దక్షిణ ఆఫ్రికా, స్పెయిన్, బ్రిటన్, అమెరికా తదితర దేశాలలో డిసెంబర్‌లో జరిగిన సర్వేలో ఆయా దేశాల ప్రజలు తమ దేశంలో... చట్టాలు, ప్రభుత్వాలు సంపన్నులకు అనుకూలంగా ఉన్నాయని నమ్ముతున్నట్టు తేలింది. గత ఆరేళ్లుగా సంపన్నుల సేవలో తరించిన ఒబామాకు జ్ఞానోదయమయిందో లేక కమ్యూనిస్టు దయ్యం పట్టిందో గానీ ‘అప్పుల పాలైపోయిన కుటుంబాలు తక్కువగానే ఖర్చు చేయగలుగుతాయి, పోగుబడ్డ సంపద వినియోగ వ్యయంగా మారే అవకాశం తక్కువ’ అంటూ ఆర్థిక అసమానతలే వృద్ధికి ఆటంకమనే చెప్పరాని ఆర్థిక సత్యాన్ని కూడా చెప్పారు. ఉత్పత్తికి ప్రోత్సాహం పేరిట బడా కుబేరులకు ప్రభుత్వ ఆస్తులను, సహజ వనరులను, రాయితీలను ధారపోసి, పేదలకు ఆసరాగా ఉండే సబ్సిడీలను, సంక్షేమ పథకాల వ్యయాలకు కోత వేయాలనే మన విధానకర్తలకు, విశ్లేషకులకు గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లు కాలేదా? రిపబ్లికన్ల వ్యతిరేకతను లెక్క చేయక, ఒంటరిగానే ఉద్యోగితను పెంచుతామని, ఆర్థిక వ్యత్యాసాలను తగ్గిస్తామని ఒబామా చెబుతున్నారు. అంతేకాదు... ఫెడరల్ కాంట్రాక్టు ఉద్యోగుల కనీస వేతనాలను రోజుకు 7.25 డాలర్ల నుంచి 10.10 డాలర్లకు పెంచారు. దీంతో 2.1 కోట్ల మందికి మేలు జరుగుతుంది. రిపబ్లికన్లతో బరిగీసి తలపడటానికి సిద్ధమైన ఒబామా నిజాయితీ అప్రస్తుతం. ఆయన చెప్పిన సత్యాలే ప్రస్తుతం.
 
  ‘నయా నిరంకుశత్వం’
 ‘విశృంఖల పెట్టుబడిదారీ విధానపు నయా నిరంకుశత్వం కారణంగా ఎక్కీతొక్కీ ఉన్నవారికి, మెతుకులతో సరిపెట్టుకునే వారికి మధ్యన అంతరం తీవ్రంగా పెరిగిపోతోంది’ అని డిసెంబర్‌లో పోప్ ఫ్రాన్సిస్ హెచ్చరించాల్సిన స్థాయికి ‘మెరుగైన ప్రపంచం’లోని అసమానతలు పెరిగిపోయాయి. అవి పెట్టుబడిదారీ వ్యవస్థ అస్థిత్వానికే ముప్పును కలిగించే స్థితికి చేరుతున్నాయి. అందుకే అపార సంపదలే కాటేసే కాలనాగులుగా కుబేరులను భయపెట్టే పరిస్థితి ఏర్పడింది. అసాధారణమైన రీతిలో పోప్... వృద్ధి ఫలితాలు సమాజపు పైపొరల్లోంచి అట్టడుగుకు బొట్టుబొట్టుగా ఇంకి మెల్లగా అందుతాయనే ‘ట్రికిల్ డౌన్’ సిద్ధాంతాన్ని ప్రవచించే ప్రపంచ మన్మోహన్‌లందరికీ చెవి మెలి పెట్టి మరీ పాఠం చెప్పినంత పనిచేశారు. ‘కొందరు వ్యక్తులు స్వేచ్ఛా విపణి నుంచి లభించే ప్రోత్సాహంతో ఆర్థిక వృద్ధి, సామాజిక న్యాయం సాధ్యమని ఇంకా నమ్ముతూనే ఉన్నారు’ అంటూ మన్మోహన్ చిదంబరాల స్వేచ్ఛా విపణి సిద్ధాంతాలపై ప్రత్యక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు.
 
 మంత్రాలకు చింతకాయలు...
 విశృంఖల పెట్టుబడిదారీ విధానపు నిరంకుశత్వంతోనే ఆర్థిక మాంద్య కాలంలో సైతం సంపదలను పోగేసుకున్న ప్రపంచ సంపన్నులు మరింత సంపన్నులయ్యారు. ‘సంపద ఆరాధకులు’ దవోస్‌లో ఆర్థిక అసమానతల నుంచి రానున్న ముప్పును తలుచుకుని భయపడ్డారే గానీ... పరిష్కారాల దిశగా కన్నెత్తి చూడలేదు. ప్రపంచ సంపన్నులలో కేవలం 85 మందికి ఉన్న ఆస్తులే ప్రపంచ జనాభాలో సగం అంటే 350 కోట్ల మంది అస్తులకు సమానమని ఆక్స్‌ఫామ్ సంస్థ డిసెంబర్ 20న వెల్లడించింది. గత ఏడాది కాలంలోనే 210 మంది కొత్తగా బిలియనీర్లు (100 కోట్లు పైబడ్డ) అయ్యారు. మన దేశంలో గత దశాబ్ద కాలంగా మన్మోహన్ స్వేచ్ఛావిపణి విధానాల ఫలితంగా మన దేశంలో బిలియనీర్ల సంఖ్య 6 నుంచి 61కి చేరింది. ఇలాంటి కుబేరులు దవోస్‌లో ఆర్థిక అసమాన తల సమస్యను చూసి భయపడ్డారే తప్ప పరిష్కారాల కోసం అన్వేషించింది లేదు. తామే అసమానతలకు సృష్టికర్తలమని తెలియకపోతేగా! మంత్రాలకు చింతకాయలు రాలినట్టుగా అసమానతల జపంతో సమానత్వం వచ్చేస్తుందో, ఏమో 2035కు ప్రపంచంలో పేద దేశాలే ఉండవని  బిల్ గేట్స్ జోస్యం చెప్పారు.    
 - పిళ్లా వెంకటేశ్వరరావు

మరిన్ని వార్తలు