Sakshi News home page

మెరుగ్గా వ్యవహరించిన భారత్‌

Published Mon, Sep 11 2023 12:17 AM

Sakshi Guest Column On Bharat G20 Summit

అంతర్జాతీయ పరిణామాలు సవాలు విసురుతున్న సమయంలో గత ఏడాది భారతదేశం జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. కోవిడ్‌–19 మహమ్మారి ప్రభావం నుండి ప్రపంచం క్రమంగా కోలుకున్నప్పటికీ, ప్రపంచ వృద్ధి ఇంకా దుర్బలంగానే ఉంది. ద్రవ్యోల్బణం కూడా మొండిగాఉంది. విపరీతమైన వాతావరణ ఘటనలు పెరుగుతున్న తరుణంలో (రికార్డుల పరంగా జూలై అత్యంత వేడి అయిన నెల అని గ్రహించాలి), వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ఈ ‘కార్యాచరణ దశాబ్ది’లో తక్షణ చర్యలు అవసరం.

అయితే, అంతర్జాతీయ సహకారాత్మక చర్యకు సంబంధించిన ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ – భౌగోళిక రాజకీయ పోటీ, ఘర్షణ ప్రమాదాలు ఆ సహకారానికి అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ కష్టతరమైన ప్రపంచ ముఖచిత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటే, బహుశా భారతదేశ అత్యంత పరిణామాత్మకమైన, అత్యంత బోధనాత్మకమైన నిర్ణయం, జీ20 చర్చా ప్రక్రియకు ఉపక్రమించడం! చెప్పాలంటే,ఇండియా చేయాల్సినదాని కంటే ఎక్కువ చేసింది.

అత్యంత సంఘటిత ప్రక్రియను నడిపించడం ద్వారా సహకార విధానంలోకి మొగ్గు చూపింది. భౌగోళిక కమ్యూనిటీలు అన్నింటికీ స్వరాలు ఉండాల్సిన ఈ బహుముఖ, బహుళ వాటాదారుల విధానం... ప్రపంచ సహకారాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. మన భాగస్వామ్య ప్రాధాన్యాలపై పురోగతి సాధించడానికి ప్రపంచం తక్షణమే మార్గాలను కనుగొనాల్సిన తరుణంలో ఇది చాలా కీలకమైనది.

ప్రపంచ జనాభాలో 85 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణార్ధ దేశాల సమూహానికి బహుముఖ సంభాషణలలో తరచుగా చోటివ్వరు. అయితే దక్షిణార్ధ ప్రపంచ (గ్లోబల్‌ సౌత్‌) వాణికి అవకాశం ఇవ్వడం ద్వారా భారతదేశం భౌగోళికంగా జీ20 చర్చలను విస్తరించింది. జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మొదటి నెలల్లో భారతదేశం 125 దేశాలకు చెందిన నాయకులు, మంత్రుల భాగస్వామ్యంతో కూడిన ‘వాయిస్‌ ఆఫ్‌ ది గ్లోబల్‌ సౌత్‌’ శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జీ20 కూటమిలో ప్రాతినిధ్యం వహించని దేశాలతో సంప్రదింపులు జరపడం, వారి ప్రాధాన్యాలను అర్థం చేసుకోవడమే దీని లక్ష్యం.

అటువంటి ప్రాధాన్యాల్లో ఒకటి ప్రపంచ సార్వభౌమాధికార దేశాల రుణ సమస్య. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 50 శాతం దేశాలు తీవ్రమైన రుణ బాధలో ఉన్నట్టు అంచనా. ఈ రుణ విచికిత్స కోసం  భారతదేశం గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇచ్చింది. 3 ట్రిలియన్‌ డాలర్ల సామూహిక జీడీపీ ఉన్న 55 ఆఫ్రికన్‌ రాజ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్రికన్‌ యూనియన్‌ను జీ20లో చేర్చాలని కూడా భారతదేశం వాదించింది (ఈ మేరకు సఫలమైంది కూడా).

విభిన్న భౌగోళిక ప్రాంతాల నుండి పెట్టుబడులను తీసుకువచ్చే బహుముఖ ప్రక్రియకు నాయకత్వం వహించడంతో పాటు, భారతదేశం కమ్యూనిటీలలో కూడా వాటాదారులతో చర్చలు జరిపింది. ఉదాహరణకు, థింక్‌20 కమ్యూనిటీ అనేది, జీ20కి ‘ఐడియా బ్యాంక్‌’గా పనిచేస్తుంది. అదే సమయంలో, ప్రపంచ వాణిజ్య కమ్యూనిటీకి ప్రాతి నిధ్యం వహించే అధికారిక డైలాగ్‌ ఫోరమ్‌గా బి20 వ్యవహరిస్తుంది. గ్లోబల్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌కు మొట్ట మొదటిసారిగా ‘స్టార్టప్‌20 ఎంగేజ్‌మెంట్‌ గ్రూప్‌’ ప్రాతినిధ్యం వహిస్తుంది.

జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్, సాధారణ సవాళ్లను పరిష్కరించడానికి ఒక సాధనంగా అంతర్జాతీయ బహుళ వాటాదారుల సహకారానికి ప్రాముఖ్యమిస్తోంది. ఈ విధానం స్పష్టమైన హామీని కలిగి ఉంది. పెరుగుతున్న సంక్లిష్ట ప్రపంచంలో– భౌగోళికాలు, వ్యాపార రంగాలు, పర్యావరణ వ్యవస్థలు, కమ్యూనిటీలలోని సవాళ్లను పరిష్కరించడానికి బహుళ వాటాదారుల విధానం చాలా అవసరం. సమ్మిళిత జీ20 ప్రక్రియను తీర్చి దిద్దడానికి చేసిన భారత ప్రయత్నాలను సులభంగా తీసేయకూడదు. 

జనాభాలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారత్‌. ప్రస్తుతం నిట్టనిలువుగా ఎదుగుతున్న పథంలో ఉంది. అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో వరుసగా మూడేళ్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతేకాకుండా 2030 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. 100 కంటే ఎక్కువ స్టార్టప్‌ యునికార్న్స్‌ (1 బిలి యన్‌ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్‌లు) కలిగివుంది.

ఇటీవలి సంవత్సరాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెరుగుదలను చూసింది. ఇవి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 85 బిలియన్‌ డాలర్ల కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం, ప్రపంచం త్వరలో కొత్త జీ3 యుగానికి స్వాగతం పలుకుతుంది. ఈ అంచనా అమెరికా, చైనాతోపాటు ప్రపంచంలోని ఉత్కృష్ట దేశాలలో భారతదేశాన్ని కూడా చేర్చింది.

ఇది మరోలా ఉండి వుంటే, ఈ పరిణామాలు వేరుగా ఉండేవి. ఇదంతా భారతదేశం దాని తలలోకి ఎక్కించు కొని ఉండవచ్చు. అందరినీ కలుపుకొని పోవడం కాకుండా, కొందరితో ప్రత్యేకంగా చర్చలు జరిపి వుండొచ్చు. కానీ భారతదేశం స్వభావరీత్యా పైనుంచి కిందివరకూ చర్చలను నడిపించడానికి ప్రోత్సహించింది.

జీ20 అధ్యక్షతలో తొలి నుండీ ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ మకుటంతో, మరింత సంపన్నమైన, సురక్షితమైన భవి ష్యత్తును రూపొందించడానికి ఏకైక మార్గం సహకారమే అని గుర్తు చేసింది. సహకారం పట్ల అంతర్జాతీయ నిబద్ధత క్షీణిస్తున్న తరుణంలో, భారతదేశ జీ20 అధ్యక్షత ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రధారులు తమ సహకార విధానాలకు మళ్లీ కట్టుబడి ఉండాలని గుర్తుచేస్తోంది. 
బోర్గే బ్రెండే  
వ్యాసకర్త వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ అధ్యక్షుడు; నార్వే మాజీ విదేశాంగ మంత్రి 

Advertisement

What’s your opinion

Advertisement