అమరావతిలో పండగనెల పట్టారు!

12 Dec, 2015 00:41 IST|Sakshi
అమరావతిలో పండగనెల పట్టారు!

అక్షర తూణీరం
 
ప్రతి వాకిట్లోనూ ‘‘కృష్ణార్పణం’’ అంటూ, ఏదో పోతోంది జాగ్రత్త అని హెచ్చరిస్తూ సాతాని జియ్యరు సాగిపోతున్నాడు. కనికట్టు, హస్తలాఘవం విద్యలు ప్రదర్శిస్తూ, కళ్లెదురు వాటిని మాయం చేస్తూ విప్రవినోదులు తమాషాలు చేస్తున్నారు. పిల్లిమొగ్గలు వేయిస్తూ, కర్రసాము చేయిస్తూ కోతుల్ని ఆడిస్తున్నాడు. కోతి ఆటలు మనిషికెప్పుడూ ఆహ్లాదంగానే ఉంటాయి.
 
నిన్నటిదాకా ముక్కారు పంటలు పండిన సుక్షేత్రాలు. ఇప్పుడు నవ్యాంధ్ర క్యాపిటల్ కోసం, రాబోయే ఆకాశ హార్మ్యాలను భరించడానికి విధిలేక సిద్ధపడుతున్నాయి. ఇప్పుడు అమరావతికి తొలి సారిగా పండుగ నెల ఆవరి స్తోంది. మనదంతా పూర్తి తెలుగు సంప్రదాయం. కాని అన్నీ హైటెక్ పోకడలు. అదిగో సంక్రాంతి నెలకి ఆనవాలుగా పొగమంచు వ్యాపించింది. పంట చేల మీద పరిగె పిట్టలు గుంపులు గుంపులుగా చేరి మేతలు ఏరుతున్నాయి. లేగదూడలు మంచులో చెంగనాలు వేస్తున్నాయి. మేలిరకం పగడాలు కుప్పలు పోసినట్టు మిరప్పళ్ల కళ్లాలు. ఎక్కడ చూసినా ముగ్గులు! కళాత్మకంగా, తెల్లగా మెరిసిపోతూ వీధులను అలంకరిస్తూ ముగ్గులు!  వాటిలో తీరుగా గొబ్బెమ్మలు. వాటిపై గన్నేరు, గుమ్మడిపూలు. ఇక బంతిపూల సందడి అయితే చెప్పనలవి కాదు. అప్పుడప్పుడు కోడిపుంజుల కూతలు వినిపిస్తున్నాయి. కనులకు, చెవులకు, మనసుకు హాయిగా తోచింది.

ఒక పెద్ద ముగ్గులో గంగిరెద్దుల ఆటకు తెరలేచింది. రంగురంగుల బొంతలతో, మూపురాలకు, కొమ్ములకు నగలతో గంగిరెద్దులు కైలాసం నుంచి దిగి వచ్చినట్లున్నాయి. డూడూ బసవన్నా అంటే సవినయంగా తలలూపుతూ గంగిరెద్దు నైజాన్ని ప్రదర్శిస్తున్నాయి. ‘‘అయ్యగారు దేశాన్ని ఏలాల, చినబాబు రాష్ట్రాన్ని ఏలాల’’ అంటే, ఔనౌనంటూ తలలూపి దీవిస్తున్నాయి. తెలుగు నేలకు పూర్వ వైభవం వచ్చిందనిపించింది. అలాంటి కండ పుష్టిగల గంగిరెద్దుల్ని  ఈ మధ్య కాలంలో చూడలేదు. చక్కగా చిరుగంటలు, సన్నాయితో, మంచి పాగా, కోటుతో ఠీవిగా వాటిని ఆడించిన స్వాములు కూడా నిండుగా ఉన్నారు. ఎందుకుండరు? మొత్తం బృందమంతా మైక్రోసాఫ్ట్‌ది. ఈ ప్రదర్శనకి సంబంధించి ఎనిమిది రోబోలను వారే రూపొందించారు. తెలుగుతనంపై అభిమానం, పట్టు ఉందని సత్య నాదెళ్ల ద్వారా ఈ ఏర్పాటు చేయించారట. మొదట్లో చెప్పిన పొగమంచు, పరిగె పిట్టలు వగైరాలన్నీ జపాన్ కంపెనీ ప్రయోగాత్మకంగా చేసి పెట్టిందట.

ప్రతి వాకిట్లోనూ ‘‘కృష్ణార్పణం’’ అంటూ, ఏదో పోతోంది జాగ్రత్త అని హెచ్చరిస్తూ సాతాని జియ్యరు సాగిపోతున్నాడు. కనికట్టు, హస్తలాఘవం విద్యలు ప్రదర్శిస్తూ, కళ్లెదురు వాటిని మాయం చేస్తూ విప్రవినోదులు తమాషాలు చేస్తున్నారు. పిల్లిమొగ్గలు వేయిస్తూ, కర్రసాము చేయిస్తూ కోతుల్ని ఆడిస్తున్నాడు. కోతి ఆటలు మనిషికెప్పుడూ ఆహ్లాదంగానే ఉంటాయి. తత్త్వాలు పాడుతూ బైరాగి తలకు మించిన ఊర్ధ్వపుండ్రాల భారంతో తిరుగుతున్నాడు. తత్త్వంలో సవీసారం లేదు. అరిగో పగటి భాగవతులు. శివ, విష్ణు, వినాయక, బ్రహ్మ వేషాలతో బిచ్చమెత్తుతూ కనిపిస్తున్నారు. మనకిదో పెద్ద దరిద్రం. మన దేవుళ్ల వేషాలు వేసుకుని మన దగ్గరకు ముష్టికి రావడం. మనం ఏ మాత్రం భయం భక్తి లేదా దయ చూపకుండా పొమ్మనడం ఒక విషాదం. మొత్తం మీద బాగా రక్తికట్టించిన కళాకారులు పిట్టల దొరలు. ఎన్ని కబుర్లు, ఎన్నెన్ని గొప్పలు, ఎన్నో కోతలు. కట్టె తుపాకీ, ఖాకీదుస్తులు ధరించి గొప్ప వినోదాన్ని అందిస్తారు పిట్టల దొరలు. నేచెప్పిన వీరంతా నిజం వాళ్లే, టెక్నాలజీ మాయలేదు.
 
- శ్రీరమణ
 (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు