ఇరాక్‌పై ముసుగు యుద్ధం

20 Jun, 2014 00:23 IST|Sakshi
ఇరాక్‌పై ముసుగు యుద్ధం

‘‘మీడియా ఎవరినైనా వెర్రివాళ్లను చేయగలదు- సాధారణంగా ఉద్దేశపూరితంగా, అప్పుడప్పుడు మరెవరి చేతిలోనో వెర్రిదిగా మారి.’’ ఇరాక్ పరిణామాలపై అంతర్జాతీయ మీడియా వడ్డిస్తున్న మూసపోత కథనాలను చూస్తే రెండూ ఒకేసారి జరుగుతున్నట్టుంది. పదిహేను వందల మంది ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ఇలా దాడి చేశారో లేదో 20 లక్షల జనాభాగల మొసుల్ నగరంలోని 50 వేల భద్రతా సిబ్బంది తుపాకులు పారేసి పరుగు లంకించుకున్నారని అది చెప్పింది. నోళ్లు తెరుచుకు విన్నాం. ఐఎస్‌ఐఎస్ ఎంతటి అరి వీర భయంకరమైనది కాకపోతే దాని ధాటికి వారం గడవక ముందే ఉత్తర ఇరాక్‌లోని పట్టణాలు, నగరాలు, చమురు కేంద్రాలు వారి వశమైపోతాయి? శ్వేత సౌధాధీశుడు బరాక్ ఒబామా ఐఎస్‌ఐఎస్ ఉత్పాతం అమెరికా ప్రయోజనాలకు సైతం ప్రమాదకరమని కలవరపడతారు?

ఇరాక్‌ను ఆదుకోడానికి ఇవిగో ద్రోన్‌లు, అవిగో వైమానిక దాడులు, అల్లదిగో సైన్యం అంటూ కాకి గోలే తప్ప కదలడం లేదెందుకు? సీఐఏ ఏం చేస్తున్నట్టు? పేపరు చూస్తేగానీ అధ్యక్షుల వారికి మొసుల్ పతనం సంగతి తెలియలేదు! సీఐఏని మూసేసి, కాంట్రాక్టు కూలీలకు పేపర్లను తిరిగేసే పనిని అప్పగించి ఉంటే ఈ ‘హఠాత్పరిణామానికి’ ‘దిగ్భ్రాంతి’ చెం దాల్సి వచ్చేది కాదు. సిరియాలోని లతాకియా, ఇద్లిబ్ రాష్ట్రాలలోని తన ఉగ్రమూకలను ఐఎస్‌ఐస్ సిరియాకు తూర్పున ఉన్న ఇరాక్ సరిహద్దుల్లో మోహరిస్తోందని లెబనాన్ డైలీ మార్చిలో తెలిపింది. అయినా ప్రపంచ నేతకు తెలియలేదంటే నమ్మాల్సిందే, చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ లోకువే.
 
సద్దాం పునరుత్థానం
 వారం రోజుల పాటూ మొసుల్, తదితర పట్టణాలను సందర్శించి వివిధ వర్గాల ప్రజలతో చర్చించి వచ్చిన జూడెన్ టోడెన్‌హాఫర్ 2,70,000 ఆధునిక సైన్యంపై ఐఎస్‌ఐఎస్ సాధించిన ‘అత్యద్భుత విజయాన్ని’ ఒక్క ముక్కలో చెప్పారు... ఈ యుద్ధంలో ఐఎస్‌ఐఎస్ ‘జూనియర్ పార్టనర్’ మాత్రమే. అసలు పాత్రధారి ఎవరు? మొసుల్‌లో ఇప్పుడు ఇంటింటా వేలాడుతున్న సైనిక దుస్తుల పెద్ద మనిషి... ఇజ్జత్ ఇబ్రహీం అల్-దౌరీ. ఆయన 2003లో అమెరికా సైనిక దురాక్రమణతో హతమార్చిన సద్దాం హుస్సేన్‌కు కుడి భుజం, బాత్ పార్టీ ప్రధాన సిద్ధాంత కర్త, మొసుల్‌లో పుట్టి పెరిగినవాడు. ఐఎస్‌ఐఎస్ వీరాధివీరులు కనిపించగానే ఇరాక్ సేనలు ‘మటుమాయమైపోవడం’ (మెల్టెడ్ ఎవే) అనే అద్భుతం ఎలా సాధ్యమో ఇప్పుడు తేలిగ్గానే అం తుబడుతుంది. తూర్పున ఉన్న కుర్దు ప్రాంతాల్లో, ఉత్తరాదిన షియా ప్రాం తాల్లో మాత్రం సంకుల సమరం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న సున్నీ బాతిస్టు పార్టీ రహస్య నిర్మాణానికి తిరుగులేని నేత దౌరీయే. 2003 నుంచి అమెరికా సేనలకు వ్యతిరేకంగానూ, నేడు షియా నౌరి అల్ మలికి ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ సైనిక ప్రతిఘటనకు నేతృత్వం వహిస్తున్నాడు. ఆయన నేతృత్వంలో కనీసం 20,000 బలగాలు ఉన్నట్టు అంచనా. ఇక సద్దాం హయాంలో ఉన్నతోద్యోగాల్లో, పదవుల్లో వెలగిన సున్నీలు షియా మలికి ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారు. ఈ పరిస్థితిలో ఐఎస్‌ఐఎస్ ముసుగుతో ప్రారంభమైన దాడికి సున్నీ ప్రజల మద్దతు లభిస్తోంది.
 
శతాబ్దాల షియా, సున్నీ శత్రుత్వం మిథ్య

 అంతర్జాతీయ మీడియా వ్యాపింపజేసిన మరో కట్టుకథ.. 1400 ఏళ్ల షియా, సున్నీ వైరం. ఇస్లాంలోని రెండు ప్రధాన శాఖల మధ్య విభేదాలు, కొంత సంఘర్షణ ఉన్నమాట నిజమే. కానీ నేడు ఐఎస్‌ఐఎస్ సాగిస్తున్న షియా ఊచకోత స్థాయికి అది చేరిన వైనం చరిత్రలో ఎక్కడా లేదు. సద్దాం పాలనలో సున్నీల పట్ల పక్షపాతం ఉన్నా... షియాలపై దాడులు, విద్వేషం ఎరుగరు. 2003లో సైనిక దురాక్రమణ తదుపరి అమెరికాయే మొట్టమొదటిసారిగా ఈ విద్వేషాలను రగిల్చింది. సున్నీలంతా, సద్దాం అనుయాయులేనని బావించి వారికి స్థానమే లేని షియా ప్రభుత్వాన్ని మాలికి నేతృత్వంలో ఏర్పాటు చేసింది. బాతిస్టు సైనిక నేతలు అమెరికా ఏర్పరిచే ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధపడినా అమెరికా వారిని వేటాడి చంపింది. (విమర్శకుల ప్రశంసలందుకుని, బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డ ‘గ్రీన్ జోన్’ (2010) చూడండి). సున్నీల పట్ల అమెరికా అనుసరించిన ఈ విద్వేషపూరిత వైఖరే ఇస్లామిక్ తీవ్రవాదం, అల్‌కాయిదాలకు ఊపిరులూదింది. బాతిస్టు పార్టీ, ఇతర సున్నీ మిలీషియాల ప్రతిఘటన తారస్థాయికి చేరడంతో అమెరికా పలాయనం చిత్తగించింది. కానీ అది రగిల్చిన మత విద్వేషాల కార్చిచ్చు రగులుతూనే ఉంది.
 
 2003 ఇరాక్ దురాక్రమణ నుంచి నేటి  వరకు మధ్య ప్రాచ్యంలో అమెరికా సాధించిన ఏకైక ఘనకార్యం ఏమిటి? ఇరాక్, లిబియా, సిరియాల్లో లౌకికవాదం సమాధులపై మతోన్మాద రక్కసులను ఆవిష్కరించడమే. ఇరాక్‌లోని బాతిస్టు పార్టీ లౌకికతత్వానికి కట్టుబడ్డ పార్టీ. సద్దాం హయంలో సైతం బాగ్దాద్‌లో కుర్దులు సురక్షితంగా ఉండగలిగారు! అలాంటి లౌకికవాద బాతిస్టు పార్టీకి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంత్ (ఐఎస్‌ఐఎల్) వంటి సున్నీ ఉగ్రవాద సంస్థకు మధ్య అపవిత్ర కూటమి ఎలా సాధ్యమైంది?  ఆ సూత్రధారి ఎవరో తెలియాలంటే... జోర్డాన్‌లోని సఫావీలో ఐఎస్‌ఐఎస్, జబాత్ అల్ నస్రా తదితర సిరియా ఉగ్రవాద మూకలకు సీఐఏ అధికారులు, సైనిక నేతలు శిక్షణ శిబిరాలను నిర్వహించారని జర్మన్ పత్రిక ‘దెర్ స్పెగెల్’ గత మార్చిలో వెల్లడించింది. అంతర్జాతీయ మీడియా వినిపిస్తున్న కథనాల ప్రకా రం ఇప్పుడు ఐఎస్‌ఐఎస్ వెనుక ఉన్న శక్తులు సౌదీ అరేబియా, ఖతార్‌లు. సౌదీకి, బాతిస్టులకు బద్ద వైరం. అంటే సౌదీ, దాని బద్ధ శత్రువైన బాతిస్టులు కూడా ఐఎస్‌ఐఎస్‌తో కుమ్మక్కయ్యారని అర్థమా? ఇరాక్‌లోని మలికి ప్రభుత్వానికి నమ్మకమైన మిత్రునిగా ఉన్న టర్కీ ప్రధాని ఎర్డోగాన్ మిత్ర ద్రోహా?
 
అదృశ్య సూత్రధారి ఎవరు?
 ఐఎస్‌ఐఎస్ 2003లో అది పుట్టినప్పుడు ఉత్త ఐఎస్‌ఐ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్). దానికి సౌదీ, ఖతార్‌ల అండదండలున్నమాట నిజమే. షియా మలికి ప్రభుత్వాన్ని కూల్చడమే దాని లక్ష్యం. 2012లో జోర్డాన్, టర్కీలలోని సీఐఏ శిక్షణ శిబిరాల్లో అది శిక్షణను పొందినది మాత్రం సిరియాలోని అసద్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం. అందుకే అది ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాక్)గా మారింది. అప్పటికి అది సౌదీ, ఖతార్, టర్కీ, సీఐఏలకు ఉగ్రవాద సేన. ఒబామా సిరియా సమస్యపై రష్యాతో ఘర్షణకు సిద్ధపడక వెనకడుగు వేయడంతో కథ ఊహించని మలుపు తిరిగింది. ఐఎస్‌ఐఎస్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంత్ అంటూ ఇరాక్ సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాన్, సైప్రస్, దక్షిణ టర్కీలతో కూడిన ఖిలాఫత్ రాజ్యాన్ని ఏర్పాటు చేసే లక్ష్యాన్ని ప్రకటించింది. దీంతో టర్కీ దానితో తెగతెంపులు చేసుకుంది. అప్పటికే ఎర్డోగాన్ సహాయంతో దౌరీ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు ఏర్పరచుకున్నారు.

ఈ విషయాన్ని గ్రహించి సౌదీ దానితో సంబంధాలు పెంచుకుంది. అంతర్జాతీయ మీడియా ఆ విషయాన్ని మరచిపోయినట్టు నటిస్తోంది. సౌదీ, ఖతార్‌ల వైపు వేలెత్తి చూపుతోంది. ఎందుకు?దొంగే దొంగ అని అరిచేదెందుకో అందుకే? మలికి ప్రభుత్వం తప్పుకోవాలని, సున్నీలు, షియాలు, కుర్దులకు ప్రాతినిధ్యం ఉండే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్ప సహాయం అందించేది లేదని బుధవారం శ్వేత సౌధం చేసిన ప్రకటనను చూడండి. అమెరికా ఇప్పుడు సిరియాలోలా ప్రభుత్వం మార్పును కోరుతోంది. ఈ పాచిక తప్పక పారుతుందనే భావి స్తోంది. ఇరాక్‌లో అమెరికా సేనలు నిలిపి ఉంచనిచ్చేది లేదని, చమురు నిల్వలను ప్రైవేటు పరం చేసే బిల్లుపై సంతకం చేయనని నిరాకరించిన మలికి అందుకు అంగీకరించవచ్చు. లేకపోతే సున్నీ, షియా, కుర్దుల మధ్య ఇరాక్ మూడు ముక్కలవుతుంది. రెండు దశాబ్దాలుగా కలలుగంటున్న ఇరాక్, సిరియా, ఇరాన్‌లను ఒక్కొక్కదాన్ని మూడు ముక్కలుగా చేయాలన్న కలకు సిరియాలో పడాల్సిన నాంది ఇరాక్‌లో పడుతుంది. కొసమెరుపు ఏమిటంటే మలికితో సన్నిహిత సంబంధాలున్న ఇరాన్‌ను ఏకాకిని చే యాలనే ప్రధాన లక్ష్యంతో కదలుతున్న అమెరికా ఇరాక్ సంక్షోభ పరిష్కారం కోసం అదే ఇరాన్‌కు స్నేహ హస్తాన్ని చాస్తున్నట్టు నటించడం.
- పిళ్లా వెంకటేశ్వరరావు

మరిన్ని వార్తలు