అంతర్జాతీయ భాషగా హిందీ

14 Sep, 2015 01:35 IST|Sakshi

మనదేశంలో కోట్లాది ప్రజల గుండెచప్పుడును వినిపించే భాష హిందీ. హిందీ జాతీయ భాషగా, రాజభాషగా, అంతర్జాతీయ భాషగా గుర్తింపు పొందింది. 180 విశ్వవిద్యాలయాల్లో హిందీకి సంబంధించి అధ్యయనం, పరిశోధనలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్, మారిషస్, ఫిజీ, జపాన్, గయానా, సురినామ్, ట్రినిడాడ్, హాలెండ్, హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్, జాంబియా,  హుడాంగా, కెనడా, హోలాండ్, స్విట్జర్‌లాండ్, హంగేరి, రష్యా, చైనా, ఖతర్, అమెరికా మొదలగు దేశాల్లో హిందీ తన విలక్షణ శైలితో వెలుగొందుతోంది.
 
 నేడు అన్ని సామాజిక వర్గాల్లో హిందీ ప్రాముఖ్యత పెరుగు తోంది. ఇందులో విశేషంగా భారతీయ సినిమా రంగం పాత్ర కనిపి స్తుంది. నేడు అమెరికాలో హిందీ తరగతులు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఎంతో మంది అమెరికావాసులు హిందీ నేర్చుకుంటున్నారు. హిందీని శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన శబ్దకోశాలచే సన్నద్ధం చేస్తూ మరోవైపు ప్రసార, ప్రచార రంగాలకు కూడా విస్తరింపజేస్తున్నారు. సాంకేతిక విజ్ఞానంలో వచ్చిన మార్పులతో ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో శ్రవ్య, దృశ్య సాధనాల ద్వారా హిందీ ప్రచారంలోనూ ప్రగతిలోనూ విశేషమైన ప్రగతి కనిపిస్తుంది.
 
 హిందీ ఒక సమృద్ధమైన, సంపన్నమైన భాష. దీనికి వ్యాకరణం. లిపి, శబ్ద సంపద ఉంది. జనాభా దృష్ట్యా చూస్తే హిందీ మాట్లాడే వారి సంఖ్య ఇంగ్లిష్, చైనీస్ తర్వాత మూడోస్థానంలో ఉంది. ప్రసార మాధ్యమంలో కూడా హిందీ తన సుస్థిరమైన స్థానాన్ని సాధించింది. ఇంటర్నెట్, కంప్యూటర్ నిపుణులు దేవనాగరి లిపిని అత్యధికంగా సమర్థించి స్వీకరించారు. ఒక లక్షా 75 వేల హిందీ శబ్దాలు ఇంటర్నెట్‌లో నిక్షిప్తం చేశారు. భారత్ సంస్కృత భాష సహకారంతో హిందీలో 8 లక్షల శబ్దాలు కొత్తగా ఆవిష్కరించారు. కంప్యూటర్, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సినిమా, అన్ని చానల్స్ హిందీలో ప్రసారం చేస్తున్నారు. నేడు చాలా కార్యక్రమాలు డబ్బింగ్ ద్వారా హిందీలో ప్రసారం అవుతున్నాయి.
 
 సెప్టెంబర్ 14ను హిందీ దివస్(హిందీ భాషా దినోత్సవం)గా దేశమంతటా ఘనంగా జరుపుకుంటారు. కన్నడ, మలయాళం, తమిళం, ఒరియా, తెలుగు, అస్సామీ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, మణిపురి ఇలా భాష ఏదైనా అందరికీ అర్థమయ్యేది హిందీ. హిందీ.. ఇది కేవలం భాష కాదు. కోట్లాది భారతీయుల హృదయ స్పందన. మన ఆత్మగౌరవం. మన సనాతన సంస్కార సాఫల్యాలకు ప్రతిబింబం. ‘హిందీసే హమ్ హిందుస్తానీ హై హమ్’.    
 (నేడు హిందీ భాషా దినోత్సవం)
 డా॥హిందీ అధ్యాపకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల,
 వెల్దుర్తి, మెదక్ జిల్లా. మొబైల్ : 9848768286

మరిన్ని వార్తలు