కఠోర వాస్తవానికి కత్తెరా!

10 Mar, 2015 00:44 IST|Sakshi
కఠోర వాస్తవానికి కత్తెరా!

ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజకీయ వ్యవస్థ, న్యాయవ్యవస్థ సహితం కొన ఊపిరితో మనుగడ సాగిస్తున్నప్పుడు సామాన్య స్త్రీ పురుషులు ఎవరివైపు చూడాలి? ఎన్నాళ్లని పడిగాపులు పడాలి? ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలుజరపగల ‘నాథుల’ కోసం భారతీయ ఆడబిడ్డలు (నిర్భయలు) కళ్లన్నీ వత్తులు చేసుకొని ఎంతకాలమని చూడాలి? ఈ ప్రశ్నలన్నీ ‘ఇండియాస్ డాటర్’ (భారత పుత్రిక) డాక్యుమెంటరీ చూసిన వాళ్లందరికీ కలగడం సహజం. అంత మాత్రాన్నే డాక్యుమెంటరీని నిషేధించాలని చూడటం సరికాదు.
 
రెండోమాట
 
‘‘నిర్భయ అత్యాచారం (16-12-2013) అనంతరం ఆ కిరాతక చర్యకు నిరసనగా భారతదేశంలో పెల్లుబికిన ఆందోళన, స్త్రీ పురుష విచక్షణ లేకుండా వెల్లువెత్తిన చైతన్యం సరికొత్త ఆశను కూడా ఆవిష్కరించింది. ఈ విషయంలో ఇండియా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. స్త్రీల హక్కుల కోసం, వాటి సాధన కోసం దృఢ సంకల్పంతో ఇండియా మాదిరిగా నిలబడిన మరొక దేశాన్ని నేను పేర్కొనలేను’’.    - లెస్లీ ఉద్విన్

ఇండియాస్ డాటర్’ డాక్యుమెంటరీ సహ నిర్మాత, బ్రిటిష్ పాత్రికేయురాలు

ప్రచార, ప్రసార మాధ్యమాల స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు రాజ్యాంగం హామీ పడింది. దేశంలో దఫదఫాలుగా స్త్రీలపై జరిగే అత్యాచారాలు ప్రపంచ బ్యాం కు విచ్చలవిడి ప్రజావ్యతిరేక సంస్కరణలకు ముందు సంఖ్యాపరంగా తక్కు వే. కానీ సంస్కరణల ప్రవేశం తర్వాత దేశ సంస్కృతీ సంప్రదాయాలను, కుటుంబ వ్యవస్థను, యువత మనసులను పెడమార్గం తొక్కించడానికి జరి గిన తొలి ప్రయత్నం-1991లో నాటి మన ప్రభుత్వం బ్యాంకు బేషరతు సంస్కరణలలో భాగంగా హాలీవుడ్ చిత్రాలపై అంతవరకూ అమలులో ఉన్న ‘ముందస్తు’(ప్రీ) సెన్సార్ నిబంధనలను ఎత్తివేయాలన్న ఫైలు పైన పడిన తొలి సంతకం రూపంలో జరిగిందని మరవరాదు. విదేశీ గుత్త బహుళజాతి కంపెనీలకూ, పెట్టుబడులకూ కాంగ్రెస్ పాలకులకన్నా ముందుకు వెళ్లి బీజేపీ పాలకులు పచ్చజెండాలు శక్తి మేరకు ఊపుతూ వచ్చారు!
 
ఎవరు రక్ష?

 
ఒకవైపు నుంచి కాంగ్రెస్, ఇంకో వైపు నుంచి బీజేపీ పాలకులు ఓట్ల కోసం, సీట్ల కోసం సెక్యులర్ వ్యవస్థకు తూట్లు పొడుస్తూనే వచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత పాత ప్రజావ్యతిరేక విధానాలనే అనుసరిస్తున్నారు. సకల రంగాలనూ లాభాపేక్షాపరుల, స్వార్థపర రాజకీయవేత్తల, స్వల్పవ్యవధిలోనే కోటికి పడగలెత్తిన అధికార స్థానాలను ప్రభావితం చేయగల దేశీయ దళారీ పెట్టుబడి వర్గాల దోపిడీకి స్వేచ్ఛగా వదిలేశారు. ప్రజల త్యాగాలతో నిర్మించు కున్న స్వాతంత్య్రమనే సువర్ణ సౌధానికి ఇప్పుడు పటిష్టమైన కాపలాదారుల అవసరం వచ్చింది. విద్య, వైద్య, సంక్షేమ రంగాలు తమ ఉద్ధరింపు కోసం 65 ఏళ్ల తర్వాత కూడా ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నాయి.  దేశంలో 30 కోట్ల మందికి పైగా పేదరికం బారిన పడి ఉన్నారు. కుటుంబాల పరంగానూ, సామాజికంగానూ ఎన్నడూ లేనంతగా స్త్రీలపై అత్యాచారాలు, వేధింపులు అనంతంగా జరిగిపోతున్నాయి. ‘నిర్భయ’ చట్టం వచ్చిన తరవాత కూడా మూడేళ్లపాటు దుర్మార్గులకు ఇంకా శిక్ష పడలేదన్నా, విధించిన శిక్షను అమలు చేయడం లేదన్నా అందుకు ఎవరిని నిందించాలి? ఆశలు పెట్టుకున్న రాజ కీయ వ్యవస్థ, న్యాయవ్యవస్థ సహితం కొన ఊపిరితో మనుగడ సాగిస్తున్న ప్పుడు సామాన్య స్త్రీ పురుషులు ఎవరివైపు మోరలెత్తుకుని చూడాలి? ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలుజరపగల ‘నాథుల’ కోసం భారతీయ ఆడబి డ్డలు (నిర్భయలు) కళ్లన్నీ వత్తులు చేసుకొని ఇంకా ఎంతకాలమని చూడాలి? ఈ ప్రశ్నలన్నీ ‘ఇండియాస్ డాటర్’ (భారత పుత్రిక) డాక్యుమెంటరీ చూసిన వాళ్లందరికీ కలగడం సహజం (దీని సహ నిర్మాత లెస్లీ కూడా అలాంటి ‘డాటరే’నన్న సంగతి మరవరాదు). అంతమాత్రాన్నే డాక్యుమెంటరీని నిషేధించాలని చూస్తే, ముఖం మీద మరకలను మరుగు పరుచుకునేందుకు తన అద్దాన్ని తానే పగలగొట్టుకునేందుకు ప్రయత్నించడమే అవుతుంది.
 
అపహాస్యమౌతున్న ఆకాశంలో సగం

జాతీయస్థాయి ఆర్థిక పరిశోధనా మండలి జరిపిన దేశవ్యాపిత మానవ వికాస సర్వేక్షణ ప్రకారం (2011-12) ఈరోజుకీ దేశంలో మహిళలకు ఆర్థిక స్వాతం త్య్రం ఆచరణలో అనుభవానికి రాలేదు; 20 శాతం కన్నా తక్కువ మంది స్త్రీలకు మాత్రమే వారి పేరిట ఇళ్లు రిజిస్టరయ్యాయి; తమ పేరిట బ్యాంకు ఖాతాలున్న స్త్రీలు సహితం 10 శాతంకన్నా మించిలేరనీ, మరో పది శాతం మంది స్త్రీలు ఇళ్లకు కావలసిన సరుకుల విషయంలో సొంత నిర్ణయాలు తీసు కునే శక్తి కూడా లేని వారుగానే మిగిలి ఉన్నారని సర్వే వెల్లడించింది. ఇదిగాక ఆంధ్రప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌లలో ఐక్యరాజ్యసమితి స్థాయిలో మహిళల ఆర్థిక ప్రతిపత్తిపై జరిపిన ‘లిండ్‌సా అధ్యయనం’ గురించి కూడా పరిశీలిం చాలి. దీని ప్రకారం, హిందూ వారసత్వ చట్టాన్ని సవరిస్తూ కొడుకులకు, కూతుళ్లకు సమస్థాయిలో ఆస్తి పంపిణీ జరగాలని స్పష్టం చేసినప్పటికీ - ప్రతి పది మంది మహిళల్లో ఒక్కరు మాత్రమే తల్లిదండ్రుల వ్యవసాయ భూమికి వారసులవుతున్నారు. పైగా చట్ట సవరణ జరిగిన పదేళ్ల తర్వాత కూడా పెక్కు మంది ‘మగధీరులు’ తమ అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు భూమికి వారసులు కావ డాన్ని వ్యతిరేకిస్తున్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇక చట్టసభల్లో మహిళల ప్రవేశం పట్ల పాలనావ్యవస్థ ఎలాంటి వివక్ష చూపుతోందో మనకు తెలుసు. స్త్రీల ఓట్లు కావాలి, కానీ వారికి లెజిస్లేచర్లలో సీట్లు దక్కరాదు. అదీ స్వార్థపూరిత వ్యూహం! స్త్రీలది ‘ఆకాశంలో సగం’ జాగా అన్నమాట వాళ్లను ఉబ్బేసి, పురుష పాలకులు తమ పని చాపకింద నీరులా చేసుకుపోయేందుకే! ఇండియాలో మొత్తం 4,120 మంది శాసనసభ్యులు (ఎంఎల్‌ఏలు) ఉంటే అందులో మహిళల సంఖ్య 359. ఇక 543 మంది ఎంపీలలో సగం ఉండవల సిన మహిళలు, ఆ సగంలో సగం కూడా కాకుండా 62 మందే ఉన్నారు. అం దువల్ల ‘మంచి’ చట్టాలున్నాయని చంకలు గుద్దుకుంటే చాలదు, స్త్రీలపై జరి గే అత్యాచారాలు, నేరాల్లో అమలు జరిగే శిక్షల శాతం చాలా తక్కువ. అందుకే స్త్రీలపై అత్యాచారాలు నానాటికీ పెచ్చుమీరిపోతున్నాయి.

కంటిని కాటేసే కన్రెప్ప

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణలో, ప్రైవేట్ గుత్త సంస్థలపై ప్రభుత్వ నియం త్రణ కాస్తా నానాటికీ సడలిపోవడంతో అదుపుతప్పిన వ్యవస్థలో, 250 మంది పార్లమెంటు సభ్యులుగాని, మంత్రులుగానీ స్త్రీలపై అత్యాచార నేరాలకు, వేధింపు చర్యలకు పాల్పడినట్లు కేసులు ఎదుర్కొంటున్నవారేనని వెల్లడైంది. ఈ వివరాలను నిర్భయ కేసులో ప్రధాన నిందితుల తరఫున వకాల్తా పుచ్చు కున్న న్యాయవాది ఒకరు వెరపులేకుండా ప్రకటించారు. నిజానికి ఇలాంటి డాక్యుమెంటరీ చిత్రాల లక్ష్యం-నేరాన్ని సకాలంలో గుర్తించి బరితెగించే పౌర నేరగాళ్లకు సకాలంలో కఠినశిక్షలు విధించేలా చూడడం; తద్వారా జరగబోయే నేరాలకు కళ్లేలు వేసేందుకు తోడ్పడటమే. అంతేగాని ఇండియాను బయటి ప్రపంచంలో ‘యాగీ’ చేయడంగా దీని ఉద్దేశమని భావించకూడదు! అందుకే అసలు భారత పాలనావ్యవస్థలోనే సమూలమైన మార్పులు రావాలి. ఆ మార్పులు నూటికి 90 మంది ప్రజల మౌలిక ప్రయోజనాల రక్షణ కోసం రానంతవరకూ స్త్రీలకే కాదు, బడుగు, బలహీనవర్గాల బతుకుదెరువుకే ప్రమా దం. ఆ ప్రమాదం శిఖరస్థాయికి చేరుకున్నందుకే ఫ్రెంచి విప్లవంలో ప్రభువర్గ ప్రయోజనాల రక్షణ దుర్గంగా ఉన్న ‘బాస్డిల్’ బురుజు కూలిపోయింది. ఆ ఉప్పెనలో దూసుకువచ్చిన మహిళా దీపశిఖే ఊల్‌స్టోన్ క్రాఫ్ట్! ఆ సద్దు నుంచి ప్రభవిల్లిన రాజకీయ సూక్తే - ‘ఫ్రెంచి విప్లవానికి (1789) పూర్తిగా మహిళలే నాయకత్వం వహించి ఉంటే చరిత్రగతి మరోలా ఉండే’దని. ఈ సంద ర్భంగా, ఈ పెట్టుబడిదారీ దోపిడీ సమాజంలో బేరగాళ్లు, నేరగాళ్ల సంఖ్య పెర గడానికి కారల్ మార్క్స్ చెప్పిన

కారణమేమిటో వ్యంగ్యంగా కొసమెరుపుగా చెప్పుకుందాం

‘‘ధనికవర్గ సమాజంలో తత్వవేత్త ఆ సమాజ రక్షణకు కావలసిన భావాలు వ్యాప్తి చేస్తాడు. కవీ అందుకు తగిన కవితలు గిలుకుతాడు, మత వ్యాపకుడు సూక్తులు వల్లిస్తాడు, ‘లా’ ప్రొఫెసర్ గారు న్యాయసూత్రాలు చెబుతాడు; అదే మూసలో ఒక నేరగాడు (క్రిమినల్) నేరాలు చేస్తూంటాడు. అలాంటి సమాజంలో నేరాల ఉత్పత్తికీ, సమాజానికీ మధ్య ఉండే సంబంధం తెలుసుకుంటే మనం చాలా అపోహల నుంచి బయటపడతాం! ఎందుకంటే నేరగాడు నేరాలను సృష్టించడమే కాదు, నేర చట్టానికి (క్రిమినల్ లా) కూడా అతడే సృష్టికర్త! అతనితో పాటు క్రిమినల్ లాపైన ఉపన్యాసాలు దంచుతూ ఉంటాడు ప్రొఫెసర్‌గారు! దానికి తోడు అతనే ఆ ఉపన్యాసాల్ని సంకలనంగా రూపొందించి జనరల్ మార్కెట్‌లోకి మార్కెట్ సరుకుగా విడుదల చేస్తాడు! ఆ వ్యవస్థలో నేరగాడు పోలీసు వ్యవస్థకు, నేర న్యాయవ్యవస్థకు, కానిస్టేబుల్స్ సృష్టికి, జడ్జీల వ్యవస్థకు, ఉరితీసే తలారుల జ్యూరీలో వగైరా సంస్థలకు పునా ది అవుతాడు. ఈ విభిన్న వ్యాపారమార్గాలన్నీ కలసి రకరకాల సామాజిక శ్రమశక్తి పంపిణీ కేంద్రాలుగా తయారవుతాయి! ఇలా, ధనికవర్గ దోపిడీ సమాజంలో నేరాలకు, నేరగాళ్లకు బలమైన పునాదులు పడతాయి. దారి ద్య్రంపై జరగాల్సిన దాడిని సొంత ఆస్తిపై దాడిగా, నేరంగా భావిస్తుంది సంపన్నవర్గం. నేరం కొత్త రక్షణ మార్గాలు వెతుకుతుంది. అది కొత్త యంత్రా లతో పదును పెట్టుకుంటుంది!’’ అలాంటి వ్యవస్థలో మన ఆడబిడ్డలకు రక్షక వ్యవస్థ సమూల ప్రక్షాళన మాత్రమే!
ఏబికే ప్రసాద్ (వ్యాసకర్త మొబైల్: 9848318414)

మరిన్ని వార్తలు