జయమ్ - భారతమ్ - మహాభారతమ్

2 Aug, 2015 04:05 IST|Sakshi
జయమ్ - భారతమ్ - మహాభారతమ్

మహాభారతం కురువంశ చరిత్ర. కురువంశానికి మూలం చంద్రవంశం. చంద్రవంశానికి ఆద్యుడు ‘చంద్రుడు’. ఈ వంశ పరంపరలో, చంద్రుడి తర్వాత వచ్చిన రాజుల్లో దుష్యంతుడి కొడుకు ‘భరతుడు’ వంశకర్త. భరతుడి పేరుమీద ‘చంద్రవంశం’, ‘భరతవంశం’ అయింది. మనదేశం ‘భారతదేశం’ అయింది.
 
 భరతుడికి అయిదు తరాల తర్వాత వచ్చిన రుక్షుడు అనే రాజుకు ‘సంవరణుడు’ అనే కొడుకు పుట్టాడు. ఈ సంవరణునికి, తపతికి పుట్టిన సంతానం ‘కురువు’. ఇతడు వంశకర్త. భరతవంశం ‘కురువంశం’గా వ్యవహారానికి వచ్చింది.
 ధృతరాష్ట్రుడి కుమారులు ధార్తరాష్ట్రులు. పాండురాజు కొడుకులు పాండవులు. ధార్తరాష్ట్రులు, పాండవులు - అందరూ కౌరవులే! ‘ధార్తరాష్ర్టులు’ పలకడంలో క్లిష్టత ఉంది. ఆ కారణంగా వారిని కౌరవులు అనడం మొదలైంది. అదే ‘కౌరవులు’ పదాన్ని పాండురాజు కొడుకులకు కూడా ఉపయోగిస్తే ఎవరు ఎవరని సందిగ్ధత ఏర్పడుతుంది. కాబట్టి, పాండురాజు కొడుకులు ‘పాండవులు’ అయ్యారు.
 
 దాయాదుల మధ్య వైరం ఇంత వినాశనానికి దారితీసిందే - ఈ చరిత్రకు కావ్యరూపం ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది వ్యాసుడికి. మొదట వ్యాసుడు రాసిన కావ్యం ‘జయమ్’. మహాభారత యుద్ధం ప్రకటించబడిన మూడు సంవత్సరాల కాలంలో పూర్తిచేశాడు. యుద్ధంలో మరణించిన వీరులకు అంతిమ సంస్కారాలు చేసి, ధర్మరాజు హస్తినలో అడుగుపెట్టడంతో ‘జయమ్’ పూర్తవుతుంది. ఈ  కావ్య నిడివి 8800 శ్లోకాలు మాత్రమే! ఈ శ్లోకాలు అన్నీ మహాభారతంలోని లక్ష శ్లోకాలలో కలసిపోయి ఉన్నాయి.
 
 సౌతి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ‘‘ఆ గ్రంథం ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు కలది. ఆ శ్లోకాలు నాకు తెలుసు. శుకుడికి తెలుసు. సంజయుడికి తెలుసో తెలియదో (అష్టౌ శ్లోక సహస్రాణి హ్యష్టౌ శ్లోక శతానిచ, అహంవేత్తి శుకోవేత్తి సంజయో వేత్తివానవా - అనుక్రమణికాధ్యాయం)’’ అన్నాడు.
 ఎక్కువమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం క్రీస్తుపూర్వం 1535లో మహాభారత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కురువంశం దాదాపు నశించి పాండవుల వారసుడిగా అభిమన్యుడి కొడుకు పరిక్షిత్తు మిగిలాడు. అతడికి 36 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కృష్ణుడు మరణించాడు. పాండవులు కోరికలు చంపుకొని స్వర్గారోహణ కోసం దేవభూములున్న హిమాలయ పర్వతాలకు వెళ్లడానికి ముందు పరిక్షిత్తుకు పట్టాభిషేకం చేశారు. ధృతరాష్ట్రుడికి, ఒక వైశ్య కన్యకు పుట్టిన యుయుత్సుణ్ని సంరక్షకుడిగా ఉండమన్నారు. పరిక్షిత్తు 60 సంవత్సరాల పాటు రాజ్యంచేసి కొడుకు జనమేజయుడికి పట్టం కట్టాడు. ఆ జనమేజయుడు వయసు మీరుతున్న సమయంలో సర్పయాగం చేశాడు.
 
 జనమేజయుడు సర్పయాగం సంకల్పించినప్పుడు వైశంపాయనుడు కౌరవ పాండవుల చరిత్రను చెప్పాడు. వైశంపాయనుడు చెప్పింది వ్యాసమహర్షి చెప్పిన జయం కావ్యాన్నే. అయితే మధ్యమధ్యలో జనమేజయుడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు. ఎన్నో సందేహాలు వెలిబుచ్చాడు. వాటన్నిటికీ వైశంపాయనుడు సమాధానాలు చెప్పాడు. వాటన్నిటినీ కలుపుకొని జయేతిహాసం నిడివి పెరిగింది. 24,000 శ్లోకాలతో వైశంపాయనుడు చెప్పిన జయం ‘భారతం’ అయింది.
 వైశంపాయనుడు భారతకథను చెప్పినప్పుడు ఎందరో సూతులు విని ఉంటారు. ఆ విన్నవారిలో ఉగ్రశ్రవసుడు ఒకడు. ఆ సూతుడు భారతాన్ని మననం చేసుకొని తన శిష్యులకు నేర్పి ఉంటాడు.
 
 ఉగ్రశ్రవసుడి ద్వారా భారతం నేర్చుకొన్న సౌతి నైమిశారణ్యంలో శౌనకాది మునులు ‘దీర్ఘసత్త్రం’ చేసినప్పుడు వారికి వినిపించాడు. వింటున్న మునులు మరింకెన్నో ప్రశ్నలు వేయడం, సౌతి ఉపాఖ్యానాలు చేర్చి మునులను తృప్తిపరచడంతో భారతం నిడివి మరింత పెరిగింది. సౌతి ఒక్కడే కాదు, ఆ తర్వాత వచ్చిన పౌరాణికులు సందర్భానికి తగినట్లు ఎన్నెన్నో కథలను, నీతులను చేర్చి ఉంటారు. రామాయణం, నలదమయంతుల కథలు కూడా భారతంలో చేరిపోయాయి. ఈ కోణంలో చూస్తే 8800 శ్లోకాలు లక్ష శ్లోకాలు కావడం వింత కలిగించే విషయం కాదు. వ్యాసుడు జయం రాసిననాటికి - సౌతి మునులకు చెప్పిన నాటికి నడుమ 150-170  సంవత్సరాల కాలం దొరలి ఉంటుంది. క్రీస్తుశకం 4వ శతాబ్దానికి చెందిన గుప్తశాసనం ద్వారా అప్పటికి భారతం, మహాభారతం రెండూ ప్రచారంలో ఉండేవని, మహాభారతం పరిమితి లక్ష శ్లోకాలని స్పష్టంగా తెలుస్తోంది.
 
 ఎవరు ఎంత చేర్చినా ఎంత మార్చినా కొన్ని వేల సంవత్సరాల పాటు భారతం నిలబడింది అంటే అది ఆ కథ గొప్పదనం. భారతం మూలకథలో కృష్ణుడు ఒక రాజనీతిజ్ఞుడు. క్రీస్తుపూర్వం 12వ శతాబ్దం శాకటాయనుడి కాలంలో అదే కృష్ణుడు ఒక యుద్ధవీరుడు. క్రీ.పూ.5వ శతాబ్దం వచ్చేటప్పటికి అదే కృష్ణుడు వైదిక మత ప్రవక్త అయ్యాడు. గౌతమబుద్ధుడి కాలం తర్వాత రామ, కృష్ణులు అవతార పురుషులు అయ్యారు. భగవద్గీత భారతంలో అంతర్భాగం అయింది. ఇదంతా బౌద్ధమతం వల్ల, మ్లేచ్ఛుల వల్ల ప్రతిష్ఠ కోల్పోవడం మొదలైన వైదికమత పునరుద్ధరణ కోసం!
 ప్రాచీన కాలంలో మతం అంటే యజ్ఞాది కర్మలు చేయడం, ప్రకృతిని ఆరాధించడం. ఆ కాలంలో దేవతలు ప్రకృతిలో భాగమైన అగ్ని, వరుణుడు, సూర్యుడు, మరుత్తులు లాంటివాళ్లు. దేవతలకు రాజు దేవేంద్రుడు. ఆరోగ్యాన్ని ప్రసాదించేది అశ్వినీ దేవతలు. అప్పట్లో మొత్తం దేవతల సంఖ్య ముప్ఫై మూడు మాత్రమే! దేవతలంతా జనకల్యాణం కోసం ఎత్తయిన ప్రదేశాల్లో నివసిస్తారని ప్రజలు నమ్మేవారు. హిమాలయాల్లో దేవలోకం ఉందని, స్వర్గలోకానికి పొలిమేరలాంటి గంధమాదన పర్వతం దాటితే దేవతలు కనిపిస్తారని అనుకొనేవారు. మహాభారతంలో అర్జునుడు శివుడి అనుగ్రహం సంపాదించడానికి, దేవేంద్రుడితో చెలిమి చెయ్యడానికి వెళ్లింది హిమాలయ పర్వతాలలోకే! చివరికి స్వర్గారోహణ పర్వంలో పాండవులు నడిచింది కూడా అటువైపుకే!
 
 అద్భుతాలు జరుగుతాయి అంటే నమ్మేకాలం మహాభారతకాలం. దేవతలు, మానవాతీత శక్తుల పట్ల అవధులు లేని విశ్వాసం ఉండేది. వాన, గాలి, గడ్డి, కడవ, అగ్ని, నది, సూర్యుడికి పిల్లలు పుట్టారు అంటే నిజమే కాబోలు అనుకొన్నారు.
 అటువంటి కాలంలో వ్యాసమహర్షి సృష్టించిన జయేతిహాసంలోకి నమ్మశక్యంకాని చిట్టడవుల్లాంటి చిన్న చిన్న కథలు వచ్చి చేరాయి. దేవుళ్లు, వేదాంతం, రకరకాల శాస్త్రాలు, లోకనీతులు, రాజనీతులకు సంబంధించి అసంఖ్యాకంగా అంతులేని వ్యాఖ్యానాలు చోటుచేసుకొన్నాయి. ఎన్నో ఊహకందని ఉపాఖ్యానాలు, నీతికథలు, ముగింపులేని యుద్ధాలు, మరణం లేని మహావీరులు, అవినీతిమంతులు, సహనం లేని మునులు, నేలవిడిచి సాముచేసే సాహసవీరులు - మహాభారత కథలోకి బలవంతంగా చొచ్చుకొచ్చారు.
 జయమ్ భారతంగా మారి, మహాభారతంగా స్థిరపడింది.


 
 (నాయుని కృష్ణమూర్తి,ఫోన్: 9440804040, వ్యాసకర్త నవలారూపంలో రాస్తున్న మహాభారతం మూలకథ ‘జయమ్’ అనుబంధం నుండి...)
 

మరిన్ని వార్తలు