...ఈ సీమను మార్చేటివారెవరురా!

24 Aug, 2013 02:30 IST|Sakshi
...ఈ సీమను మార్చేటివారెవరురా!

విశ్లేషణ: రాయలసీమ హక్కుల కోసం ముక్తకంఠంతో ముందడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది.  సీమకు న్యాయం జరిగిన తరువాతనే విడిపోవడమైనా, కలిసి ఉండటమైనా అని ఎలుగెత్తిచాటాలి. రాష్ట్ర విభజనకు రంగం సిద్ధమవుతున్న ప్రస్తుత సందర్భంలో అప్రమత్తత తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వానికి సీమ స్థానీయత సెగ తగలాలి. ఆ వైపుగా సీమ ప్రజలంతా కదం తొక్కాలి.
 
 రాష్ట్రంలో అన్ని రంగాలలో చిన్నచూపునకు గురైన ప్రాంతం రాయలసీమ. 1953-1956 ఆది గా అన్యాయాలను అడుగడుగు నా అనుభవిస్తున్నప్పటికీ అంద రం కలిసే అభివృద్ధి సాధించాలనే ఆశయంతో రాయల సీమ ఉమ్మడి రాష్ట్రంలో మనుగడ సాగించింది. తెలంగాణ విభజనకు రంగం సిద్ధమైందనే సూచనలు స్పష్టంగా కనిపి స్తున్నా రాష్ట్రం కలిసి ఉండే అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నాయనే ఆశతో సమైక్య ఉద్యమబాట పట్టి జ్వలిస్తున్న ది. 1984లో రాయలసీమ వెనుకబాటుతనంపై ఉద్యమం జరిగినప్పటికీ ప్రత్యేక రాష్ట్రంగా కాక, రాష్ట్రంలోని మిగిలిన అన్ని వెనుకబడిన ప్రాంతాలతో కలిసి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించింది. ఈ రోజున తెలంగాణ విభజన ప్రకట నతో రేపు తమ భవిష్యత్తు ఏమవుతుందోననే భీతి సీమ ప్రజలను ఆవహించింది.
 
 గతమంతా గాయాలపాలు
 విజయనగ రాజుల కాలంలో దక్షిణ భారతదేశానికే దిశా నిర్దేశం చేస్తూ దేదీప్యమానంగా రాయలసీమ వెలుగొం దింది. ‘రాయలేలిన సీమ రతనాలసీమ’ అనే నానుడి అలా వచ్చిందే. ఈ ప్రాంత వైభవాన్ని చూసి పరాయి రాజులకు కన్నుకుట్టింది. ‘రక్కసి తంగడి యుద్ధం’ (క్రీ.శ. 1565)తో దక్కను సుల్తానులు సీమలో స్వైరవిహారం చేశారు. అనంతర కాలంలో మొఘలులు (1687), మహా రాష్ట్రులు (1667-1740), కడప-కర్నూలు నవాబులు (1700), మైసూరు సుల్తానులు (1761), నైజాం నవా బులు (1790), ఆంగ్లేయులు (1800) ఇలా ఎవరికి వారు సీమపైపడి సర్వం దోచుకుని పీల్చి పిప్పిచేశారు. తమ రాజ్యం భద్రంగా ఉండేందుకోసం నైజాం నవాబులు రాయలసీమను ఆంగ్లేయులకు దత్తతకిచ్చి సీమ ప్రజలను బానిసలుగా మార్చివేసిన సంఘటన ఆధునిక ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు. ఆంగ్లేయుల పాలనా కాలమంతా దత్త మండలంలో దత్తబిడ్డలుగానే సీమ ప్రజలు కొనసాగాల్సివచ్చింది.  
 
 ఆంధ్ర రాష్ట్రం - రాయలసీమ
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళుల ఆధిపత్యంతో అవ మానాలకు గురై, అన్ని రంగాలలోను అరకొర అవకాశాలే పొందుతుండటాన్ని కోస్తాంధ్రులు జీర్ణించుకోలేకపో యారు. తెలుగు భాష మాట్లాడే వారంతా ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడాలనే ఉద్దేశంతో ‘ఆంధ్ర మహాసభ’ను 1913లో స్థాపించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం వలన రాయలసీమ కు ఒరిగే ప్రయోజనాలేమీ ఉండవని 1907లోనే ‘దత్త మండలాల యువకసాంఘికసభ’ ఆ ప్రతిపాదనను వ్యతి రేకించింది. మొదటి ఐదు ఆంధ్ర మహాసభలలోను రాయ లసీమ నాయకులు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకిం చారు. గుత్తి కేశవపిళ్లె, ఏకాంబరయ్యర్, ఎ.ఎస్.క్రిష్ణారావు, లక్ష్మణరెడ్డి, పప్పూరు రామాచార్యులు, కల్లూరు సుబ్బా రావు, కడప కోటిరెడ్డి, హరహల్వి సీతారామిరెడ్డి, టీఎన్ రామకృష్ణారెడ్డి, సీఎల్.నరసింహారెడ్డి, కె.సుబ్రమణ్యం, కె.వి. రామకృష్ణారెడ్డి, తదితర సీమ నాయకులకు  ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు పట్ల అనుమానాలు, అభ్యంతరా లు ఉండేవి. సీమవాసుల అసంతృప్తిని గమనించిన కోస్తాంధ్ర నాయకులు ఆంధ్ర విశ్వవిద్యాలయం అనంతపు రంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు, కానీ నిల బెట్టుకోలేదు.
 
 రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలను ఎదు ర్కొనేందుకు 1934 జనవరి 27న ‘రాయలసీమ మహా సభ’ను సిహెచ్. నరసింహారెడ్డి, కె.సుబ్రమణ్యం ఏర్పాటు చేశారు. మద్రాసులో జరిగిన ప్రథమ సమావేశంలో తిరు పతిలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పరచాలని తీర్మానించారు. 1935 సెప్టెంబర్‌లో కడపలో ‘రాయలసీమ మహాసభ’ రెండవ సమావేశం జరిగింది. ఈ సభకు టి.యన్. రామ కృష్ణారెడ్డి అధ్యక్షత వహించాడు. కోస్తాంధ్రతో సంబంధం లేకుండా రాయలసీమ రాష్ట్రంగా ఏర్పడాలని నిర్ణయిం చారు. ఈ ఉద్యమానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ సీమ నాయ కులు దూరంగా ఉండేవారు.
 
 1937లో జరిగిన మద్రాసు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాయలసీమ మహాసభ పని చేసింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది రాజ గోపాలచారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మంత్రి వర్గంలో ఒక్క రాయలసీమ సభ్యునికి కూడా స్థానం కల్పిం చలేదు. దీనితో రాయలసీమలోని కాంగ్రెస్ నాయకులలో అసంతృప్తి రగిలింది. అప్పటి కోస్తాంధ్రలోని కాంగ్రెస్ నాయకులు, రాయలసీమలోని నాయకులను కలుపుకొని కడప కోటిరెడ్డి అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటుచేశారు.
 
  రాయలసీమ ప్రయోజనాలకు అన్యాయం జరిగే విధంగా కోస్తాంధ్రులతో కలిస్తే కాంగ్రెస్ నాయకులను సీమ నుంచి ప్రజలు తరిమివేస్తారని ఆ నాడు కె.వి.రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఆ కమిటీ తీర్మానాల మేరకు ఇరు ప్రాం తాల నాయకుల పరస్పర అంగీకారంతో 1937 నవంబర్ 16న శ్రీబాగ్ ఒప్పందం కుదిరింది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే రాయలసీమ ప్రాంతంలో రాజధాని నగరం లేదా హైకోర్టు, కృష్ణ, తుంగభద్ర నదీజలాలలో అధిక ప్రాధా న్యం, విశ్వవిద్యాలయ స్థాపన ఈ ఒప్పందంలోని ప్రధా నాంశాలు. సీమ నాయకులు ఈ ఒప్పందాన్ని నమ్మి ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు. మద్రాసు రాష్ట్రంలోనే రాయలసీమ ప్రాంతం ఉండాలని సీమలో కొందరు అభి ప్రాయపడినప్పటికీ తెలుగుజాతి ఐక్యత కోసం రాజీప డ్డారు. మద్రాసు నగరం తమకు దూరమైపోతున్నా మౌనంగా భరించారు. కర్నూలు రాజధానిగా 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
 
 ఆంధ్రప్రదేశ్ - రాయలసీమ
 నైజాం పాలన నుంచి 1948లో తెలంగాణ విమోచనం పొందింది. తెలుగు భాష మాట్లాడే ప్రజలందరూ కలిసి ఒకే రాష్ట్రంగా కొనసాగాలనే విశాలాంధ్ర ఉద్యమంలో భాగంగా పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంతో కలిపి 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మూన్నాళ్ల ముచ్చటగా మూడేళ్లు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలును కాదని హైదరా బాద్‌ను రాజధానిగా చేశారు. తెలుగు జాతి ఐక్యత కోసం రాయలసీమ రాజధాని నగరాన్ని కోల్పోయింది, బళ్లారిని కోల్పోయింది. కర్ణాటక, తమిళనాడులలోని సీమ భూభా గాలను కోల్పోయింది.
 
కరువు సీమకు మిగిలింది కన్నీరే!
1901లోనే సర్ మెకంజీ ‘కృష్ణ, తుంగభద్ర, పెన్నానదుల అనుసంధాన పథకం’ ద్వారా 36 లక్షల ఎకరాల సీమ భూములకు సాగునీరందించేందుకు ప్రణాళికను రూప కల్పన చేశారు. కానీ అది వాస్తవరూపం దాల్చలేదు. ఈ ప్రాజెక్టే మరో రూపంలో 1951లో ‘కృష్ణ-పెన్నార్’ ప్రాజెక్టుగా రూపొందింది. కనీసం ఇది అమలైనా ఏడు లక్షల ఎకరాలకు సాగునీరందేది. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే తమిళనాడుకు ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశంతో కోస్తాంధ్ర నాయకులు, కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ ప్రాజెక్టును రాయల సీమకు ఉపయోగకరంగా సిద్ధేశ్వరం వద్ద కడతామన్నారు. తీరా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత రాయలసీమకు చుక్కనీరు దక్కకుండా దిగువ భాగాన 1955లో నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణానికి నాంది పలికారు. కోస్తా, తెలం గాణ ప్రాంతాలలో 23 లక్షల ఎకరాలకు నీరందే ఏర్పాటు చేసుకున్నారు.
 
 1945లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, నిజాం ప్రభుత్వం భాగస్వామ్యంతో రాయలసీమ మొత్తం అవస రాలు తీర్చేలా తుమ్మలూరు వద్ద నిర్మించాల్సిన తుంగ భద్ర ప్రాజెక్టును అప్పటికి రాయలసీమలో ఉండిన బళ్లారి జిల్లా హోస్పేట వద్ద నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో భాగంగా బళ్లారి జిల్లా రాయలసీమకు దక్కకుండా పోయింది. తుంగభద్ర ప్రాజెక్టు సీమ నుంచి చేజారింది. ఆ ప్రాజెక్టులోని జలాలలో వాటా కోరి రాయలసీమకు సాగునీరు అందించే ప్రయత్నం చేయకుండా, ఆ ప్రాజె క్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కోరిన ఫలితంగా అర కొర నీళ్లను ఇచ్చి సీమవాసుల కడుపుకొట్టారు. 1963లో నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లను కూడా సీమకు అంద కుండా లోతట్టులో నిర్మించి కేవలం విద్యుత్ ప్రాజెక్టుగా ప్రకటించారు. కృష్ణా జలాలలో ఆంధ్రప్రదేశ్ వాటాగా 800 టీఎంసీలు లభిస్తుండగా రాయలసీమకు కేవలం 120 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. ఆ విధంగా కృష్ణా నదీ జలాలలో సీమకు సరైన వాటా దక్కలేదు.
 
పోరుకు సమయం ఆసన్నం
రాయలసీమ హక్కుల కోసం ముక్తకంఠంతో ముందడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. సీమకు న్యాయం జరిగిన తరువాతనే విడిపోవడమైనా, కలిసి ఉండటమైనా అని ఎలుగెత్తిచాటాలి. విడిపోవటమే పరిష్కారమని పాల కులు భావిస్తున్నందున రాయలసీమకు దక్కే ప్రయోజ నాలేవో తేల్చమని ప్రశ్నించాలి. 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందానికి కోస్తాంధ్ర సోదరులు కట్టుబడి ఉంటారో లేదో తెలుసుకొని సీమ ప్రజలు ముందుకు సాగాలి. తుంగభద్ర, కృష్ణా జలాలలో రాయలసీమకు దక్కాల్సిన నికర సాగుజలాల నీటి వాటా తేల్చుకోవాలి. సీమలో మౌలిక వసతుల కల్పనకు, పారిశ్రామిక విద్యాభివృద్ధికి ఏ రకమైన ప్రాధాన్యాలు లభిస్తాయో నిర్ణయించుకోవాలి. సకల రంగాలపై స్పష్టత లేకుంటే మరోసారి ప్రమాదంలో పడకతప్పదు. రాష్ట్ర విభజనకు రంగం సిద్ధమవుతున్న ప్రస్తుత సందర్భంలో అప్రమత్తత తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వానికి సీమ స్థానీయత సెగ తగలాలి. ఆ వైపుగా సీమ ప్రజలంతా కదం తొక్కాలి.  

- డా|| అప్పిరెడ్డి హరినాథరెడ్డి

మరిన్ని వార్తలు