కలహం ముద్దు... ఐక్యతే ముప్పు

9 May, 2014 00:37 IST|Sakshi
కలహం ముద్దు... ఐక్యతే ముప్పు

రెండు పాలస్తీనా సంస్థలైన ‘హమస్,’ ‘ఫతా’ల మధ్య ఐక్యతా ఒప్పందం కుదరడంతో ఇజ్రాయెల్ శాంతి చర్చల నుంచి వైదొలగింది. అప్రతిష్ట పాలైన ఫతా నేత అబ్బాసీకి ఇజ్రాయెల్‌కు మధ్య సయోధ్యను సాధించడమే పాలస్తీనా ఐక్యతకు విరుగుడని అమెరికా భావిస్తోంది.
 
 పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చడమే లోక రీతి. ఆ రీతిని, మార్జాల నీతిని తప్పితే పశ్చిమ ఆసియా ‘శాంతి’ భగ్నమౌతుంది. గత నెల 23న జరిగిన ఓ హఠాత్పరిణామం... ఇజ్రాయెల్, అమెరికాలే కాదు, పశ్చిమ ఆసియా వ్యవహారాల నిపుణులంతా నోళ్లు తెరిచేలా చేసింది. ఎప్పుడూ కీచులాటలతో తన్నుకు చావాల్సిన రెండు పాలస్తీనా సంస్థలు ‘హమస్’, ‘ఫతా’ గత నెల 23న గాజాలో ఐక్యతా ఒప్పందంపై సంతకాలు చేశాయి. పాలస్తీనా అథారిటీగా (పీఏ) ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఫతా అధికారంలో ఉన్న వెస్ట్‌బ్యాంక్, హమస్ అధికారంలో ఉన్న గాజాలలో కొత్తగా ఎన్నికలను నిర్వహించడానికి అంగీకరించాయి. ఎవరి మధ్యవర్తిత్వం లేకుండానే ఈ చర్చలు జరగడం విశేషం.
 
 ఈ పరిణా మం పాలస్తీనీయుల్లో కొత్త ఆశలను రేకెత్తించింది. గాజా, వెస్ట్‌బ్యాంక్ ప్రాంతాలలో ఐక్యత ప్రదర్శనలు, సంబరాలు సాగాయి. కాగా, అర్ధ శతాబ్దికి పైగా రగులుతున్న పాలస్తీనా సమస్యను తేల్చి పారే యడానికి కంకణం కట్టుకున్న బరాక్ ఒబామా ప్రభుత్వం మాత్రం... ‘దిగ్భ్రాంతికి గురైంది,’ ‘నిరుత్సాహపడింది,’ ‘శాంతి ప్రక్రియకు విఘాతం కలుగుతుందని ఆందోళన చెందింది.’ పీఏ అధ్యక్షునిగా, పాలస్తీనీ యులందరి ఏకైక ప్రతినిధిగా గుర్తింపును పొందుతున్న మొ హ్మద్ అబ్బాసీ చేసిన ‘ద్రోహాన్ని’ ఇజ్రాయెల్ ఖండించింది. ‘హమస్ ఉగ్రవాదాన్ని ఎంచుకున్నవారికి శాంతి అక్కర్లేద’ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ శాంతి చర్చలకు స్వస్తి పలికారు. ఆక్రమిత పాలస్తీనా భూభాగాల పన్నుల్లోం చి ఇజ్రాయెల్ వేసే బిచ్చంపై బతకాల్సిన పీఏ, దాని అధినేత అబ్బాసీల ధిక్కారాన్ని నెతన్యాహూ సహించలేకపోవడం సహజమే. ఆయన ఆగ్రహానికి అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ భీతావహులై పరుగులు తీయడమే విశేషం.   
 
 తిమ్మిని బమ్మిని చేసైనా పశ్చిమ ఆసియాలో ‘సుస్థిర శాంతి’ని నెలకొల్పాలని ఒబామా ప్రభుత్వం తెగ ఆరాటపడిపోతోంది. గల్ఫ్ నుంచి ఆసియా, మధ్య ఆసియాలకు తన సైనిక బలగాలను తరలించి చైనా, రష్యాల పనిపట్టేయాలని చూస్తోంది. అందుకే కెర్రీ, నెతన్యాహూతో కాళ్ల బేరానికి దిగా రు. అమెరికా ప్రభుత్వ రహస్యాలను ఇజ్రాయెల్‌కు చేరవేస్తూ పట్టుబడ్డ ‘మొసాద్’ ఏజెంట్ జనాథన్ పోల్లార్డ్‌ను వి డుదల చేస్తామని ఆశ చూపారు. బందీల విడుదలపై అబ్బాసీతో కుదుర్చుకున్న ఒక్క ఒప్పందాన్నయినా మన్నించి 400 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయించాలని ప్రయత్నించారు.
 
 ఇదంతా హమస్, ఫతాల మధ్య మిత్ర భేదం కో సమేనని చెప్పక్కర్లేదు. ఎట్టకేలకు నెతన్యాహూ 25 మందిని విడుదల చేయడానికి అంగీకరించారు. వారంతా విడుదలై బయట ఉన్నవారే. ఖచ్చితమైన గడువుతో స్థూలంగా  శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అమెరికా ఆయనను ఒత్తిడి చేస్తోంది. ఇజ్రాయెల్ ఏకాకి అవుతుందని హెచ్చరిస్తోంది. గతానికి భిన్నంగా అమెరికా నేడు... 1997 ఓస్లో ఒప్పందా లు అమలు కాకపోవడానికి ఇజ్రాయెలే కారణమని అంటోం ది. పూర్తిగా అప్రతిష్ట పాలైన అబ్బాసీ పరువు దక్కేట్టు చేసి, హమస్‌కు దూరం చేయాలని కెర్రీ తంటాలు పడుతున్నారు.   
 
 కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసి తగువు తెగకుండా, ముడిపడకుండా చేసి లబ్ధిని పొందే దౌత్య విద్యలో ఆరితేరిన నెతన్యాహూకు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించే ఉద్దేశం లేనే లేదు. పైకి ఏమి చెప్పినా... ఆయనది  పాలస్తీనా అస్తిత్వాన్ని నిరాకరించే ‘ఒక్క దేశం సిద్ధాంతం.’ హమస్‌ది  అదే సిద్ధాంతమని ఆయన ఆరోపణ. ఓస్లో ఒప్పందాల ప్రకా రం రెండు దేశాలు ఒకేసారి ఒకదాని మరొకటి గుర్తించాలి. హమస్‌ది అదే వైఖరి.
 
 పాలస్తీనాను గుర్తించే వరకు ఇజ్రాయెల్‌ను గుర్తించేది లేదని అది అంటోంది. ఇజ్రాయెల్, అమెరికాలు, అవి తానా అంటే తందానా అనే ‘అంతర్జాతీయ సమాజం’ ఉగ్రవాద సంస్థగా ముద్ర వేసిన హమస్... 2006 ఎన్నికల్లో పాలస్తీనియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ప్రజల తీర్పును నిరాకరించి, అధికారాన్ని హమస్‌కు అప్పగించకుండా నిరాకరించేలా అబ్బాస్‌ను ‘ఒప్పించినది’ ఎవరు? ప్రపంచం నలుమూలలా డేగ కళ్లతో, కాళ్లతో ప్రజాస్వామ్యానికి కావలి కాచే అమెరికా. పాలస్తీనాకు దేశంగా గుర్తింపు లభిస్తుందని, ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాలను తిరిగి అప్పజెప్పుతారని, దురాక్రమణ కారణంగా దేశ విదేశాల్లో శరణార్థులుగా బతుకుతున్న వారు తిరిగి తమ స్వస్థలాలకు చేరే అవకాశం లభిస్తుందనే భ్రమల్లో పాలస్తీనీయులను ఉంచడానికి... ఎంత అప్రతిష్ట పాలైనా అబ్బాసీ ప్రభుత్వమే మేలు. నెతన్యాహూ అది అర్థం చేసుకోవడం లేదనేదే కెర్రీ బాధ.    
 - పి. గౌతమ్

మరిన్ని వార్తలు