చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులపైనే దృష్టి | Sakshi
Sakshi News home page

చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులపైనే దృష్టి

Published Fri, May 9 2014 12:31 AM

చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులపైనే దృష్టి - Sakshi

పావులు కదుపుతున్న  టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు
 సదాశివపేట, న్యూస్‌లైన్: మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీలు దృష్టిసారించాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు  ఇప్పటికే  పావులు కదుపుతున్నాయి. మెజార్టీ కౌన్సిలర్ స్థానాలు తమకే వస్తాయని రెండు పార్టీలు ధీమాతో ఉన్నాయి. టీఆర్‌ఎస్‌కు  చైర్మన్ వైస్ చైర్మన్ స్ధానాలు దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. ఏది ఏమైనా చెర్మైన్, వైస్ చెర్మైన్ పదవులు తమవేనని ఆ రెండు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

జూన్ రెండు వరకు ఆగాల్సిందే!
 మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈనెల 12 ప్రకటించినా చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక మాత్రం జరిగే అవకాశాలు లేవని చేప్పవచ్చు. వీరి ఎంపిక జూన్ రెండో తేదీ తరువాతనే చేపట్టే అవకాశాలు ఉన్నాయి.  మున్సిపల్ ఎన్నికలు ఏ ముహుర్తాన నిర్వహించారోగాని  అడుగడుగునా  ఉత్కంఠ తప్పడం లేదు. ఎన్నికలైన తరువాత ఫలితాలు  రెండు సార్లు  వాయిదా పడ్డాయి. ఫలితాలు ఎప్పుడెప్పుడాఅని అభ్యర్థులు కళ్లల్లో వత్తులు  వేసుకుని  నిరీక్షిస్తున్నారు. ఫలితాలు విడుదలైతే  మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ల పదవుల ఎన్నిక ఎప్పుడో అనే సందేహం తలెత్తుతోంది.

 ఈ పదవుల ఎన్నికపై   ఎన్నికల కమిషన్  ఇంత వరకు అధికారిక ప్రకటన చేయలేదు. జూన్ 2న అపాయింటెడ్  డే ఉన్నందువల్ల ైచైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో అయోమయం నెలకొంది. సదాశివపేట మున్సిపల్‌లో 23 వార్డులు ఉన్నాయి. ఇందులో 12 వార్డుల్లో మెజార్టీ ఉన్న పార్టీకి చైర్మన్, వైస్ చైర్మన్  పదవులు దక్కే  అవకాశాలు ఉన్నాయి. అయితే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో  ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఏ  పార్టీకి స్పష్టమైన మెజార్టీ  లభించే అవకాశాలు  లేనందువల్ల  ఎంఐఎం, బీజేపీ పార్టీలతో పాటు ముగ్గురు  స్వతంత్రులు గెలిచే అవకశాలు ఉన్నందువ్లల  వారి మద్దతు తప్పనిసరి. సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వుచేశారు.

 మున్సిపల్ ఎన్నికల్లో ఏరాజకీయ పార్టీకూడా చెర్మైన్ అభ్యర్థులను ప్రకటించే సాహసం చేయలేదు. రెండు పార్టీల్లోను చైర్మన్ పేరు ప్రకటించనందువల్ల ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకుందామని చెర్మైన్ అభ్యర్థి ఏవరో ఫలితాలు వచ్చిన తరువాత నిర్ణయం తీసుకోనున్నప్పటికీ   చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను అశిస్తున్న ఆశావహులు పార్టీ ముఖ్యులతో కలిసి ముందుగా మెజార్టీ సభ్యులను  తమ అదుపులో పెట్టుకునేందుకు ఇప్పటి నుంచి గెలిచే అవకాశాలు ఉన్న కౌన్సిలర్లకు ప్రలోభాలు పెడుతున్నారు.

 చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేయాలని వీరు బేరసారాలు  మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. మరో పక్క 12న కౌంటింగ్  పుర్తయి ఫలితాలు వెలువడినా తరువాత గెలిచిన కౌన్సిలర్లను క్యాంపుకు తరలించేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్  నాయకులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను జూన్ రెండు తర్వాతనే చేపట్టేందుకు  అవకాశాలు ఉన్నప్పటికీ అప్పటి వరకు  క్యాంపులు నిర్వహించే అలోచనలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.

చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఎప్పుడుంటుందో  తెలియని పక్షంలో  క్యాంపులు నిర్వహించడం చాల ఖర్చుతో కూడుకున్న పనే. అయినా క్యాంపులు నిర్వహించకపోతే రోజు టెన్షన్ పడాల్సి వస్తుందని  మెజార్టీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించడమే ఉత్తమమని రెండు పార్టీల నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో పక్క  ఎమ్మెల్యే, ఎంపీ ఓటు మున్సిపల్ చెర్మైన్ ఎన్నికల్లో  కీలకం కావడంతో వారు ప్రమాణ స్వీకారం చేసిన  తర్వాతనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేపడతారు. సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి సంగారెడ్డిలోగాని సదాశివపేట మున్సిపల్ పరిధిలో గాని తన ఓటు హక్కును  వినియోగించుకునే వీలుంది.  మెదక్ ఎంపీ విషయానికి వస్తే  అయన మెదక్, సంగారెడ్డి, సదాశివపేట, సిద్దిపేట మున్సిపాలిటీల్లో ఎక్కడో ఒకచోట  ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.

Advertisement
Advertisement