గౌడ కులస్తులు ఆత్మన్యూనత వీడాలి: కేఈ 

13 Aug, 2018 01:40 IST|Sakshi
సర్వాయి పాపన్న జయంతి వారోత్సవాలలో నీరాను చూపిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఏపీ మంత్రి పితాని, మాజీ ఎంపీలు మధుయాష్కీ, పొన్నం

  రాబోయే కాలం మనదే... ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహం పెడతాం: పొన్నం  

  గౌడ ఐఏఎస్‌లను నిర్లక్ష్యం చేస్తున్న తెలంగాణ సర్కారు: మధుయాష్కీ 

సాక్షి, హైదరాబాద్‌: గౌడ కులస్తులు ఆత్మన్యూనతాభావం వీడాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆకాశం నుంచి తీసుకువచ్చే అమృతంగా నీరాను భావించాలని సూచించారు. గౌడ్‌లు మరుగునపడిన బంగారమని, సానబెట్టినకొద్దీ రాటుదేలుతారని తెలి పారు. సర్దార్‌ సర్వాయి పాపన్న త్యాగధనుడు, అభిమానధనుడని కొనియాడారు. సర్వమత రక్షకుడిగా పాపన్న తన కాలంలో పనిచేశారని చెప్పారు. ‘జై గౌడ్‌’ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్‌ మహారాజ్‌ 368 జయంతి వారోత్సవాలను ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. కృష్ణమూర్తి మాట్లాడు తూ లండన్‌ మ్యూజియంలో పాపన్న ప్రతిమ ఉందని, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో పాపన్న చరిత్ర పదిలంగా ఉందన్నారు.

పాపన్న స్ఫూర్తితో గౌడ కులస్తులు ముందుకు సాగాలన్నారు.‘కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ స్థాయిలో గతంలో గౌడ కులస్తులైన ప్రసాద్‌ లాంటివారు పని చేశారు. మనం ఎవరికీ ఎందులోనూ తక్కువ కాదు’అని పేర్కొన్నారు. రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, బడుగు, బలహీన వర్గాలే తనకు అండగా నిలిచారని అన్నారు. ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ సర్దార్‌ పాపన్న అని అన్నారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహం పెట్టడమే ధ్యేయంగా జైగౌడ్‌ ఉద్యమం ముందుకు సాగాలన్నారు.

రాష్ట్రంలో రాబోయే కాలం మనదే. మళ్లీ నేను, మధుయాష్కీ గౌడ్‌ ఎంపీలుగా గెలుస్తాం’అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ మాట్లాడుతూ గౌడ సామాజికవర్గానికి చెందిన సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం సముచిత పోస్టులు కల్పించడంలేదని విమర్శించారు. ఈ నెల 16న గౌతు లచ్చన్న జయంతి ఉత్సవాలను గుంటూరులో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావు, జైగౌడ్‌ ఉద్యమం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ వి. రామారావు, నేతలు బూర మల్సూర్, బొమ్మగాని శ్రీనివాస్, ఎం.ఏడుకొండలు, తెలుగు యువత అధ్యక్షుడు తూళ్ల వీరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు