తదుపరి సీఎం కేసీఆరే!

15 Sep, 2018 03:40 IST|Sakshi

ఇండియాటుడే సర్వేలో 43 శాతం మంది మద్దతు

న్యూఢిల్లీ: అసెంబ్లీని ఎనిమిది నెలల ముందుగానే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఎన్నికల రేసులో ఎవరికీ అందనంత దూరంలో దూసుకుపోతున్నారు. ప్రముఖ ఆంగ్ల వార్తా చానల్‌ ఇండియా టుడే, యాక్సిస్‌ మై ఇండియాతో కలిసి చేసిన సర్వేలో.. తదుపరి సీఎంగా కేసీఆర్‌కు 43 శాతం మంది తెలంగాణ ప్రజలు మద్దతు తెలిపారు. కేసీఆర్‌ తర్వాతి స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఉండగా, ఆయన తదుపరి సీఎం కావాలని కోరుకుంటున్నట్లు కేవలం 18 శాతం మందే చెప్పారు. పొలిటికల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌ పేరుతో తెలంగాణలో అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ ఈ సర్వే జరిగింది. మొత్తంగా 7,110 మంది సర్వేలో పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత, నిరుద్యోగం, వ్యవసాయంలో ఇబ్బందులు, నిత్యావసరాల ధరల పెరుగుదల తమకు ప్రధాన సమస్యలుగా ఉన్నాయని తెలంగాణ ప్రజలు వెల్లడించారు. కేసీఆర్‌ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు 11% మంది చెప్పారు.

కుమారస్వామిపై అసంతృప్తి
ఇండియా టుడే– మై యాక్సిస్‌ ఇండియా కర్ణాటకలోనూ సర్వే చేసింది. అక్కడ ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌–కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వ పనితీరు బాగుందని 23 శాతం మంది, ఫరవాలేదని 28 శాతం మంది చెప్పగా ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని 35 శాతం మంది కర్ణాటక ప్రజలు వెల్లడించారు. 11,480 మంది కన్నడిగులు ఈ సర్వేలో పాల్గొన్నారు. తదుపరి ప్రధానిగా 55 శాతం మంది నరేంద్ర మోదీకి, 42 శాతం మంది రాహుల్‌ గాంధీకి మద్దతు తెలిపారు. తాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రత, వ్యవసాయంలో ఇబ్బందులు తమ రాష్ట్రంలో ప్రధాన సమస్యలని సర్వేలో పాల్గొన్న ప్రజలు వెల్లడించారు. కుమారస్వామి సీఎం పదవి చేపట్టి నాలుగు నెలలైనా పూర్తికాకముందే ఆయనపై ఇంతటి వ్యతిరేకత రావడం గమనార్హం.

మరిన్ని వార్తలు