ఏడు రాష్ట్రాల్లో రేపు పోలింగ్‌

11 May, 2019 17:49 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆరవ దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 979 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 10.17కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఆరో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో రేపు(ఆదివారం) ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఏడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 1.43 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

వీరిలో 78,73,022 పురుషులు, 64,42,762 మహిళా ఓటర్లతో పాటు 699 మంది ఇతరులున్నారు. దేశ రాజధాని కావడంతో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. పోలింగ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2700 ప్రాంతాల్లో.. 13,819 పోలింగ్ కేంద్రాల్లో.. 1,44,270 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో 47 కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలతో పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 523 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని అధికారులు తెలిపారు. పోలింగ్‌ కోసం దాదాపు 25,146 ఈవీఎంలతో పాటు 13819 వీవీ పాట్లను వినియోగించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

మరిన్ని వార్తలు