రహస్య భేటీ కుట్రను ఛేదిస్తాం: ఆదిమూలపు

23 Jun, 2020 16:21 IST|Sakshi

సాక్షి అమరావతి: నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ రహస్య సమావేశం వెనుక కుట్ర దాగుందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వ్యవస్థలను మేనేజ్‌ చెయ్యడమే పని అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావుతో ఎలా భేటీ అవుతారని ప్రశ్నించారు. సచివాలయంలో మంత్రి ఆదిమూలపు మంగళవారం మాట్లాడారు.

‘చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్‌ని పావుగా వాడి మా ప్రభుత్వం పై కుట్రలు చేస్తున్నాడు. దళిత జడ్జిని మేం ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తే ఇందుకేనా అడ్డుకున్నది? దళిత ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా కుట్ర జరిగింది. నిమ్మగడ్డ, సుజనా, కామినేని రహస్య భేటీకి సంబంధించిన వీడియోలతో మొత్తం కుట్ర బయటపడింది. ఆ రహస్య భేటీలో ఏం జరిగిందో విచారిస్తాం. దీని వెనుకగల కుట్రను ఛేదిస్తాం. సుప్రీం కోర్టుకి కూడా వాస్తవాలు తెలియపరుస్తాం’అని మంత్రి అన్నారు. 
(చదవండి: నిమ్మగడ్డతో రహస్య భేటీపై బీజేపీ అసంతృప్తి)

కాగా, రాష్ట్ర మాజీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఈనెల 13న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌‌లో ఈ భేటీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో రికార్డులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, తమ పార్టీ నేతలు నిమ్మగడ్డతో భేటీ కావడం పట్ల బీజేపీ అధిష్టానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది.
(చదవండి: వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?)

మరిన్ని వార్తలు