ఎల్బీనగర్‌, మహేశ్వరంలలో బోణీ కొట్టని బీఆర్‌ఎస్‌

18 Nov, 2023 07:50 IST|Sakshi

హైదరాబాద్: రాష్ట్రంలో రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. నగర శివారు రంగారెడ్డి జిల్లాలోని ఆ రెండు స్థానాల్లో మాత్రం ఖాతా తెరవలేక పోయింది. గత ఎన్నికల్లో జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో ఆరు స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. కానీ మహేశ్వరం, ఎల్బీనగర్‌లలో మాత్రం ఇప్పటికీ ఆ పార్టీ అభ్యర్థులు గెలువలేకపోయారు. ఈసారైనా ఇక్కడ బోణీ కొట్టాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. కాంగ్రెస్‌ కూడా ఈ స్థానాలను కీలకంగా తీసుకుంది.

మహేశ్వరంలో గులాబీ గుబాళించేనా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటైంది. తొలి ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం చోటుచేసుకున్న పలు రాజకీయ సమీకరణాలతో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో నిర్వహించిన తొలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీలో నిలిచి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో నిలిచారు. ఇప్పటి వరకు ఇక్కడ బీఆర్‌ఎస్‌ గెలుపొందలేదు. ఈ ఎన్నికల్లోనైనా బీఆర్‌ఎస్‌ బోణీ కొడుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఎల్బీనగర్‌లో జెండా ఎగిరేనా..
అప్పటి వరకు మలక్‌పేట్‌ నియోజకవర్గంలో అంతర్భాంగంగా ఉన్న ఎల్బీనగర్‌ 2009లో కొత్త నియోజకవర్గంగా ఆవిర్భవించింది. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, టీడీపీ నుంచి ఎస్‌వీ కృష్ణ ప్రసాద్‌లు పోటీ చేశారు. దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నిక (2014 ఎన్నిక)ల్లో కాంగ్రెస్‌ నుంచి సుధీర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్‌, టీడీపీ నుంచి ఆర్‌ కృష్ణయ్యలు పోటీ చేశారు. ఆర్‌. కృష్ణయ్య విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్‌ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ను వీడి అధికార బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు.

మరిన్ని వార్తలు