కాంగ్రెస్‌లో వారికి ప్రత్యేక అధికారాలు : ఉత్తమ్‌

23 Jun, 2018 19:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై దాదాపు ఐదు గంటలపాటు జరిగిన కీలక సమావేశం ముగిసింది. అనంతరం రాష్ట్ర ఇన్‌చార్జ్‌ కుంతియా మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ బాధ్యతలను ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు అప్పగించినట్లు తెలిపారు. వీటితో పాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు తప్పవని, పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించొద్దని హెచ్చరించారు. అన్ని వర్గాలకు కమిటీల్లో ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. పార్టీ మారే వారు తమ సొంత ప్రయోజనాల కోసమే వీడుతున్నారని విమర్శించారు. ఎవరు పోయినా పార్టీ ఓట్లశాతం తగ్గలేదన్నారు. 

కొత్తగా నియమించిన ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు 40 నియోజకవర్గాల చొప్పున కేటాయించినట్లు కుంతియా తెలిపారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో పీసీసీ కార్యవర్గం, జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 25 నుంచి 90 రోజుల పాటు కార్యదర్శులు వారికి కేటాయించిన ప్రాంతాల్లో విస్తృత పర్యటనలు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండేలా పార్టీని బలోపేతం చేయడమే తక్షణ కర్తవ్యమని వెల్లడించారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే అధిష్టానానికి చెప్పవచ్చని, నేరుగా రాహుల్‌ గాంధీకైనా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కానీ మీడియాలో ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 2014తో పోలిస్తే కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు 10 శాతం పెరిగిందని, తాజా సర్వేలు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.

అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. నూతన ఏఐసీసీ కార్యదర్శులకు వారికి కేటాయించిన ప్రాంతాల్లో విస్తృత అధికారులు ఉంటాయని చెప్పారు. రానున్న ఎన్నికలకు అభ్యర్థులకు టికెట్ కేటాయింపుల్లో సహా వారికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చినట్లు వెల్లడించారు. డిసెంబర్‌లో ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేలా పార్టీని సిద్ధం చేస్తున్నామన్నారు. కేవలం ఈ ఏడాది ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఎన్నికల కమిటీలను నియమించారని తెలిపారు. తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాలకు ఎక్కడా కమిటీలు వేయదని స్పస్టం చేశారు. దీనిపై అనవసర ఆతృత ఎందుకంటూ ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్, జైరాం రమేష్,  కుంతియా, ఏఐసీసీ నూతన కార్యదర్శులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు