కీలక నిర్ణయం తీసుకోనున్న ఒవైసీ

29 Mar, 2018 12:48 IST|Sakshi

సాక్షి, బెంగళూర్ : పార్టీ విస్తరణలో భాగంగా ఎంఐఎం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ఆ పార్టీ భావిస్తున్న సంగతి తెలిసిందే. సుమారు 40 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ గురువారం కర్ణాటక నేతలతో భేటీ కానున్నారు.

అయితే ఎంఐఎం ఒంటరిగా పోటీ చేస్తుందా, జేడీఎస్‌తో జత కట్టనుందా అనే అంశం తెలాల్సివుంది. ఇప్పటికే బీఎస్పీతో దోస్తికి తయారయిన జేడీఎస్‌, ఎంఐఎంతో కూడా జత కట్టడానికి ఆసక్తి కనబరుస్తుంది. ఇదే అంశంపై ఒవైసీతో చర్చలు జరపడాని ప్రయత్నాలు చేస్తోంది. బీఎస్పీ, ఎంఐఎంతో కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా తమ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న వక్కళిగర్‌తో పాటు దళితుల, ముస్లింల ఓట్లు దక్కుతాయని జేడీఎస్‌ ప్రణాళికలు రచిస్తోంది.

మరోవైపు దళితులు, వెనుకబడిన తరగతులు, కురబలు, ముస్లింల ఓట్లపై ఆధారపడ్డ కాంగ్రెస్‌పై ఈ కూటమి తీవ్ర ప్రభావం కనబరిచే అవకాశాలున్నాయి. ఇక జేడీఎస్‌ ఓటు బ్యాంక్‌ని తమ వైపు తిప్పుకోవడానికి సీఎం సిద్ధరామయ్య బలమైన ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎంఐఎం మహారాష్ట్ర, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు