ఎన్సీపీకే పెద్ద పీట

6 Jan, 2020 04:53 IST|Sakshi
అజిత్‌ పవార్‌, ఆదిత్య ఠాక్రే

అజిత్‌కు ఆర్థికం, అనిల్‌కు హోం

మహారాష్ట్రలో శాఖల కేటాయింపు

అసంతృప్తిలో కాంగ్రెస్‌  

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎట్టకేలకు శాఖల్ని కేటాయించారు. ముఖ్యమైన శాఖలెన్నో సంకీర్ణ భాగస్వామ్య పక్షం ఎన్సీపీకే దక్కాయి. శాఖల కేటాయింపులో మహారాష్ట్ర వికాస్‌ అఘాడి ప్రభుత్వంలో విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగిన మూడు రోజులకి కానీ అధికారికంగా ప్రకటన వెలువడలేదు. మహారాష్ట ఉప ముఖ్యమంత్రి, సీనియర్‌ ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌కు ఆర్థిక, ప్రణాళిక శాఖ, ఆయన పార్టీ సహచరుడు అనిల్‌ దేశ్‌ముఖ్‌కు హోంశాఖని కేటాయించినట్టు ఆదివారం ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, శివసేన తరఫున తొలిసారిగా ఎన్నికైన ఆదిత్య ఠాక్రేకి పర్యావరణం, పర్యాటకం, ప్రొటోకాల్‌ వ్యవహారాల శాఖ దక్కింది. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు బాలాసాహెబ్‌ థోరాత్‌కు రెవెన్యూ, అశోక్‌ చవాన్‌కు ప్రజాపనుల శాఖలు దక్కాయి. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ధనుంజయ్‌ ముండే, జితేంద్ర అవ్హాద్‌లకు వరసగా సామాజిక న్యాయశాఖ, గృహనిర్మాణ శాఖలు కేటాయించారు. దీంతో ఎన్సీపీకే కీలక శాఖలు దక్కినట్టయింది. ఇక ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సాధారణ పరిపాలన, ఐటీ, న్యాయశాఖల్ని తన వద్ద ఉంచుకున్నారు. శివసేనకు చెందిన ఏక్‌నాథ్‌ షిందేకు పట్టణాభివృద్ధి శాఖ కట్టబెట్టారు. ప్రభుత్వం పంపిన ఈ శాఖలకి గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ ఆదివారం ఆమోద ముద్ర వేశారు.  

కాంగ్రెస్‌లో అసంతృప్తి
శాఖల కేటాయింపులో అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌లో అసంతృప్తి మొదలైంది. రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ బాలాసాహెబ్‌ థోరాత్‌ కారణమని కొందరు నేతలు నిందిస్తున్నారు. ఎన్సీపీతో పోలిస్తే అప్రాధాన్య శాఖలు కేటాయించారని అంటున్నారు. మరికొందరు సంకీర్ణ భాగస్వామ్య పక్షంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్సీపీ అధ్యక్షుడు పవార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, గృహనిర్మాణం, రవాణా శాఖల్లో కనీసం రెండయినా కేటాయించాలని కాంగ్రెస్‌ పార్టీ పట్టుబట్టినా శివసేన, ఎన్సీపీ తిరస్కరించడంతో పార్టీలో అంతర్గతంగా అసమ్మతి రాజుకుంటోంది. కాగా, శివసేన పార్టీని వీడడం లేదని మంత్రి అబ్దుల్‌ సత్తార్‌ స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం సీఎంతో సమావేశమైన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. తాను శివసేనతోనే కొనసాగుతానన్నారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా