బాధను తట్టుకోలేకే రాజీనామా చేశా..

29 Sep, 2019 08:47 IST|Sakshi

సాక్షి ముంబై: ఎన్సీపీ అధ్యక్షులు శరద్‌ పవార్‌కు శిఖర్‌ సహకారి బ్యాంకుతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఆయనపై ఈడీ కేసు పెట్టడంతో తీవ్ర అస్వస్థతతకు గురయ్యానని, అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు అజిత్‌ పవార్‌ పేర్కొన్నారు. ముంబైలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన రాజీనామాతోపాటు పలు విషయాలపై స్పష్టత ఇచ్చారు. ఎన్సీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్‌ తన ఎమ్మెల్యే పదవికి శుక్రవారం సాయంత్రం రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర  రాజకీయాల్లో ఒక్కసారిగా పెను దుమారం లేచిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన సస్పెన్స్‌కు శనివారం తెరదించారు. అజిత్‌ పవార్‌ అనే పేరు ఉన్నందువల్లే శరద్‌ పవార్‌ పేరును అందులో చేర్చారని ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయిన ఇలా చేయడాన్ని తాను తట్టుకోలేకపోయానంటూ భావోద్వేగానికి గురయ్యారు. 

అజిత్‌ పవార్‌

చదవండి: అజిత్‌ రాజీనామా ఎందుకు?

తన కారణంగా ఆయనకు ఈ వయస్సులో ఇలా జరగడాన్ని తట్టుకోలేకే తాను ఏమి చేయాలో తోచక ఇలా రాజీనామా చేశానని స్పష్టం చేశారు. రాజీనామా చేసిన అనంతరం సుమారు 20 గంటల తర్వాత ముంబైలోని ఇంట్లో శరద్‌ పవార్‌తో అజిత్‌ పవార్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేవలం కుటుంబ సభ్యులే చర్చలు జరిపారు. అనంతరం విలేకరుల ముందుకు వచ్చారు. అయితే ఆయనతోపాటు విలేకరుల సమావేశంలో ఎన్సీపీ ప్రముఖ నాయకులందరు పాల్గొనడం విశేషం. 12.50 వేల కోట్ల డిపాజిట్లుండగా రూ. 25 వేల కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఇంత పెద్దఎత్తున కుంభకోణం జరిగి ఉంటే బ్యాంకు ఎప్పుడో దివాళ తీసేదన్నారు.  

కుటుంబ కలహాలేమి లేవు..
పవార్‌ కుటుంబంలో ఎలాంటి కుటుంబ కలహాలు లేవని అజిత్‌ పవార్‌ స్పష్టం చేశారు. కుటుంబ పెద్దగా శరద్‌ పవార్‌దే అంతిమ నిర్ణయం ఉంటుందన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఎలా చెబితే అలా నడుచుకుంటానని స్పష్టం చేశారు. అయితే తాను రాజీనామా చేసిన అనంతరం టీవీలలో పత్రికలలో తమ కుటుంబంలో కలహాలున్నాయని ఏదో ఏదో తమకు తోచిన విధంగా వార్తలు రావడం చాల బాధ కలిగించిందన్నారు. 

మరిన్ని వార్తలు