మోదీ, యోగిలకే నా మద్దతు: అమర్‌సింగ్‌

31 Jul, 2018 10:04 IST|Sakshi
అఖిలేశ్‌ యాదవ్‌, అమర్‌ సింగ్‌ (ఫైల్‌)

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన సమాజ్‌(బీఎస్పీ) పార్టీలపై బహిష్కృత ఎస్పీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్‌ సింగ్‌ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీలు కుల రాజకీయాలు చేస్తున్నాయని, ఈ పార్టీలు రెండూ ఒకే నాణానికి చెరో వైపు అని వ్యాఖ్యానించారు. ఆదివారం లక్నోలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమర్‌సింగ్‌ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో మోదీ.. ‘కొందరు బహిరంగంగా పారిశ్రామికవేత్తలను కలవరు. కానీ, తెరవెనుక ఉండి కుట్రలు చేస్తారు. అలా పారిశ్రామికవేత్తలతో తెర వెనుక మంతనాలు జరిపేవారెవరో (ఎస్పీ, బీఎస్పీలనుద్దేశించి) అమర్‌ సింగ్‌కు తెలుసు’ అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో అమర్‌సింగ్‌ సోమవారం స్పందించారు.

నిబద్దతో కూడిన రాజకీయాల్లో మీరెవరికి మద్దతిస్తారని నన్నడిగితే బబువా(పిల్లాడు), బువా(అత్త)లకు కాకుండా మోదీ, యోగి ఆదిత్యనాథ్‌లకే నా ఓటు అని చెప్తానని అమర్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. అమర్‌సింగ్‌ తరచుగా అఖిలేశ్‌ యాదవ్‌ను బబువా అని, బీఎస్పీ అధినేత మాయవతిని బువా అని పిలవడం తెల్సిందే. 

బీజేపీలో చేరతారా?
నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభిమానిస్తున్నట్టు చెప్పడం ద్వారా బీజేపీలో చేరాలన్న ఆకాంక్షను అమర్‌సింగ్‌ బహిరంగంగా వ్యక్తపరిచారు. అంతేకాదు తన జీవితం మోదీకి అంకితమని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాగా, కాంగ్రెస్‌లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన కమలం పార్టీలోకి రావాలని చూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

>
మరిన్ని వార్తలు