వైఎస్సార్‌సీపీ అధికారంలోకొస్తుంది..  అమరావతే రాజధాని

27 Feb, 2019 04:00 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. చిత్రంలో వైఎస్సార్‌ సీపీ నేతలు

అలా అని మేనిఫెస్టోలోనూ పెడతాం

తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

ఇచ్చిన ప్రతీ హామీ అమలుచేస్తాం

పేదల గడపకు అవి చేరేలా ఎన్నికల ప్రణాళిక

ప్రతీ నవరత్నంలోని పథకాలను చేరుస్తున్నాం

పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ మేనిఫెస్టోలో.. 

వచ్చే 3వ తేదీ నుంచి జిల్లా స్థాయిలో భేటీలు

వైఎస్సార్‌ సీపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి 

సాక్షి, అమరావతి : ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది. అమరావతే రాజధానిగా ఉంటుంది’.. అని పార్టీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత ఉమ్మారెడ్ది వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. దీనిని పార్టీ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)లో కూడా పొందుపరుస్తామని వెల్లడించారు. ఈ విషయంలో తమ పార్టీకి నష్టం కలిగించేలా.. ప్రజలను గందరగోళ పరిచేలా కొంతమంది వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. మెరుగైన రాజధానిని నిర్మించడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు. దివంగత మహానేత వైఎస్సార్‌ సంక్షేమ పథకాలనే తాము స్ఫూర్తిగా తీసుకుంటున్నామని, వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని చిత్తశుద్ధితో అమలుచేసేలా మేనిఫెస్టో రూపొందిస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ విజయవాడ కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ మంగళవారం తొలిసారి భేటీ అయింది. అనంతరం సమావేశ వివరాలను ఉమ్మారెడ్డి మీడియాకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో అనేక వర్గాల సమస్యలు, భౌగోళిక పరిస్థితులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారని.. ఈ నేపథ్యంలో ఆయన అనేక వాగ్దానాలు చేశారని, వాటన్నింటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు.

ప్రతీ పేదకు ‘నవరత్నం’
పేదల ముఖంలో చెరిగిపోని చిరునవ్వులుండాలన్న ఉద్దేశ్యంతో వైఎస్‌ జగన్‌ నవరత్నాలను ప్రకటించారని, అన్ని వర్గాల ప్రయోజనాన్ని కాంక్షించే విధంగా ఇందులో పథకాలు పేర్కొన్నారని, వీటన్నింటినీ మేనిఫెస్టోలో పేర్కొంటామని ఉమ్మారెడ్డి తెలిపారు. ప్రతి హామీ నూటికి నూరుపాళ్లు అమలయ్యేలా చూడటమే పార్టీ లక్ష్యమంటూ.. వాటిని మేనిఫెస్టోలో పెట్టాలని తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌ సూచించినట్లు ఆయన చెప్పారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి పలు రకాల అనుబంధ విభాగాలున్నాయని.. వీటితో వచ్చే నెల 3 నుంచి మేనిఫెస్టో కమిటీ సభ్యులు ఆయా జిల్లాల్లో భేటీ అవుతారని ఉమ్మారెడ్డి తెలిపారు. అదే విధంగా విజయవాడ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటుచేస్తున్నామని, మేనిఫెస్టో కమిటీ సభ్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారు.. ఇలా అనేక వర్గాల వారు తమ సమస్యలను ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు ప్రత్యేక సెల్‌కు చెప్పుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. దూర ప్రాంతాల వాళ్లు krishnaysrcpoffice@gmail. com అనే మెయిల్‌కు తమ సూచనలు, సమస్యలను పంపవచ్చన్నారు. వాటిని మేనిఫెస్టో కమిటీ పరిగణలోనికి తీసుకుంటుందన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులు, రాజధాని భూబాధితులకు జరిగిన అన్యాయాలనూ మేనిఫెస్టోలో పెడతామన్నారు. 

మేనిఫెస్టోలో హోదాకు చోటు
విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. వ్యవసాయం, ఇరిగేషన్, పాడి పరిశ్రమ అంశాలపై సబ్‌ కమిటీని ఏర్పాటుచేసి సమాచారం సేకరిస్తామన్నారు. మహిళా సంక్షేమం, వారి సమస్యలు తెలుసుకోవడానికి ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగుల సంక్షేమంపై సమగ్రంగా చర్చించి, తుదిరూపం ఇవ్వాలనుకుంటున్నట్టు ఉమ్మారెడ్డి చెప్పారు. 

ఈ సమావేశంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కే పార్థసారథి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పీడిక రాజన్నదొర, షేక్‌ అంజద్‌బాషా, పాముల పుష్పశ్రీవాణి, ఆదిమూలపు సురేష్, తమ్మినేని సీతారాం, జంగా కృష్ణమూర్తి, ఆళ్ళూరు సాంబశివారెడ్డి, కురసాల కన్నబాబు, షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్, ముదునూరు ప్రసాద్‌రాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, మేరుగ నాగార్జున, మర్రి రాజశేఖర్, ఎంవీఎస్‌ నాగిరెడ్డి, సంజీవ్‌కుమార్, తలారి రంగయ్య, నందిగం సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

విద్య, వైద్యం, ఉపాధికి పెద్దపీట 
విద్య, ఉపాధి రంగాలు తమ పార్టీకి అత్యంత ప్రాధాన్యమని ఆయన తెలిపారు. దివంగత మహానేత వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్గించిన ప్రయోజనాలను స్ఫూర్తిగా తీసుకుని, ఈ పథకాన్ని బలోపేతం చేయాలని చూస్తున్నట్టు చెప్పారు. అదే విధంగా చదువు పూర్తయిన వారికి వృత్తి నైపుణ్యం అందించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను పెట్టాలని భావిస్తున్నామన్నారు. అలాగే, పేదలకు అత్యంత ప్రధానమైన వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని, గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అమలుచేసిన ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలను మరింత మెరుగుగా ప్రజలకు అందించే అంశంపై చర్చించి, దాన్ని మేనిఫెస్టోలో పెడతామన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, మాజీ సైనికోద్యోగుల సమస్యలు కూడా సమీక్షిస్తున్నామన్నారు. కాగా, ప్రస్తుత ప్రభుత్వం తన వాళ్లకే ఇళ్లిచ్చి పేదలకు అన్యాయం చేస్తోందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతీ పేదవాడికి ఇల్లు అందేలా చూస్తామని చెప్పారు. అంతేకాక, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన, ప్రవాస భారతీయుల సమస్యలూ పరిగణలోనికి తీసుకుంటున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ విధంగా మెరుగుపర్చుకోవాలి, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా పెంచుకునే దిశగా కూడా మేనిఫెస్టో కమిటీ దృష్టి పెట్టిందని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు