రాజధాని మారిస్తే రైతులు నష్టపోరు: అంబటి

19 Dec, 2019 13:06 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : మూడు రాజధానుల నిర్ణయంపై జాతీయ స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. మూడు రాజధానులు ఏర్పాటుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారని.. అధికార వికేంద్రీకరతో అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం అంబటి మాట్లాడుతూ.. అమరావతిని సింగపూర్‌ చేస్తానని చంద్రబాబు చాలాసార్లు చెప్పినా.. దాని అమలు మాత్రం చేయలేకపోమారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ చెప్పిన ప్రతి దాన్ని వ్యతిరేకించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. తినడానికి తిండి లేకున్నా చంద్రబాబు పరమాన్న అడిగేడాడని ఎద్దేవా చేశారు. 

టీడీపీ వాళ్లు ఈ భూములను లాక్కున్నారు
మూడు రాజధానులు అంటే మూడు నగరాలు నిర్మించడం కాదనే విషయాన్ని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అర్థం చేసుకోవాలని హితవు పలికారు. రాజధాని అంటే పరిపాలన భవనాలు నిర్మంచుకోవడమని.. శాసనసభ, సచివాలయ నిర్మాణం.. ముఖ్యమైన భవనాలు నిర్మించడమని స్పష్టం చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి అనేది స్కాం అని, అమరావతిలో బాబు ఆయన బినామీలు పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపించారు. పేదల భూములు భయపెట్టి టీడీపీ నాయకులు లాక్కున్నారని, ఇప్పుడు టీడీపీ నేతల భూ కుంభకోణం బయటకు వస్తుందన్న భయంతోనే చంద్రబాబు భయపడుతున్నారని దుయ్యబట్టారు.  

అమరావతి ప్రజా రాజధాని అనేది పెద్ద భూ కుంభకోణం. రాజధానిలో నిరసన కార్యక్రమాలు తీరు, బాష చూడండి. వారు కావాలనే నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు ఉంది. రైతుల ముసుగులో కొంతమంది సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాంటి వారిని చూస్తూ ఉరుకోము. రాజధాని మారిస్తే రైతులు నష్టపోరు. రైతులు ముసుగులో భూములు కొన్న టీడీపీ నాయకులు మాత్రమే నష్టపోతారు. అన్ని ప్రాంతాలు బాగుండాలనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  భావిస్తున్నారు’ని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు