నాలుగేళ్లుగా ప్రభుత్వం అండగా ఉంటోంది: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లుగా ప్రభుత్వం అండగా ఉంటోంది: సీఎం జగన్‌

Published Mon, Dec 11 2023 11:00 AM

YSR Law Nestham Funds Release Updates - Sakshi

సాక్షి, అమరావతి: జూనియర్‌ న్యాయవాదులకు తోడుగా నిలబడే కార్యక్రమం ఇదని, ఇవాళ 2,807 మంది న్యాయవాదులకు మేలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జూనియర్‌ న్యాయ­వాదులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవి­డత వైఎస్సార్‌ లా నేస్తం నిధులను తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం బటన్‌ నొక్కి విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్‌ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్‌ వరకు ఆరునెలలకు ఒక్కొ­క్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, వైఎస్సార్‌ లా నేస్తం ద్వారా ఇప్పటివరకు 6069 మంది న్యాయవాదులకు మేలు జరిగిందన్నారు. నాలుగున్నరేళ్లలో రూ.49.51 కోట్లు అందించాం. రూ.100 కోట్లతో అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. పేదవాడి తరపున న్యాయవాదులంతా ఔదార్యం చూపించాలి. కోవిడ్‌ సమయంలోనూ యువ లాయర్లకు ప్రభుత్వం అండగా నిలబడింది. నాలుగేళ్లుగా యువ లాయర్లకు అండగా ఉంటున్నాం. పేదలకు యువ లాయర్లు న్యాయం చేయాలి’’ అని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..
ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం
వరుసగా నాలుగు సంవత్సరాలుగా వైఎస్సార్ లా నేస్తం అనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తున్నాం
లా పూర్తి చేసుకొని తమ వృత్తిలో తాము నిలబడేందుకు, ఆ నిలబడే సమయంలో వారికి ప్రోత్సాహకంగా ఉండేందుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మూడేళ్లపాటు సంవత్సరానికి రూ.60 వేలు అంటే నెలకు రూ.5 వేల చొప్పున మూడేళ్లకు రూ.లక్షా 80 వేలు ఇస్తున్నాం
వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా వారికి తోడుగా ఉంటున్నాం
మనం చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా దాదాపు ఈ ఏడాదికి సంబంధించి రెండో విడతలో 2,807 మంది అడ్వొకేట్ చెల్లెమ్మలు, తమ్ముళ్లకు ఈరోజు మంచి జరిగిస్తూ దాదాపు 8 కోట్లు బటన్ నొక్కి ఒక్కొక్కరికి 30 వేల చొప్పన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం
నాలుగేళ్లలో మొత్తంగా వైయస్సార్ లా నేస్తం ద్వారా 6,069 మంది జూనియర్ అడ్వొకేట్లకు మంచి జరిగిస్తూ మనందరి ప్రభుత్వం ఖర్చు చేసిన అమౌంట్ రూ.49.51 కోట్లు
ఇటువంటి అడ్వొకేట్లకు వాళ్ల ఇనీషియల్ స్టేజ్‌లో నిలదొక్కుకొనేందుకు ప్రభుత్వం మంచి చేస్తూ అడుగులు ముందుకేస్తోంది
ఈ కార్యక్రమం ద్వారా వాళ్ల ప్రొఫెషన్‌లో వాళ్లు నిలదొక్కుకోవడం, తర్వాత ఇదే మంచిని జ్ఞాపకం ఉంచుకొని పేదవాళ్ల పట్ల అదే ఔదార్యం చూపించే మంచి సంస్కృతికి మనం చేసే ఈ కార్యక్రమం మంచి ముందడుగు అవుతుంది
అడ్వొకేట్లందరూ బాగుండాలని, వారి కోసం మనసారా ఆలోచనలు చేసి మంచి జరగాలని తపిస్తూ వాళ్ల కోసం వైయస్సార్ లా నేస్తమే కాకుండా రూ.100 కోట్లతో అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్టును స్థాపించాం
అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో, లా సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరూ సభ్యులుగా ఆ ట్రస్టులో ఉంచుతూ రూ.100 కోట్లు కేటాయింపు చేశాం
ఆ కేటాయింపు వల్ల కోవిడ్ సమయంలో వీళ్లందరికీ చాలా మంచి జరిగింది.
వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం తరఫున వేగంగా అడుగులు పడ్డాయి.
643 మందికి కోవిడ్ సమయంలో వీళ్ల కుటుంబాలకు రూ.52 లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది
ఇబ్బందుల్లో ఉన్న అడ్వొకేట్స్‌ను ఆదుకుంటూ 7,733 మందికి రూ.11.56 కోట్లు రుణాలు ఇవ్వడం జరిగింది
మరో 14,848 మంది అడ్వొకేట్లకు మెడిక్లెయిమ్ పాలసీ కింద రూ.11.41 కోట్లు చెల్లించడం జరిగింది
రూ.25 కోట్లు ఈ ఫండ్ నుంచి ఇచ్చి అడ్వొకేట్ కమ్యూనిటీకి తోడుగా నిలబడగలిగింది.

ఇవన్నీ మనసు పెట్టి, మంచి జరగాలని మనసారా ఆలోచన చేసి చేయగలిగాం
నా పాదయాత్రలో నా దగ్గరకొచ్చి వీళ్లంతా వినపతిపత్రం ఇచ్చినప్పుడు మాట ఇచ్చాను
మాట ఇచ్చిన మేరకు వాళ్లందరికీ తోడుగా ఉంటూ అడుగులు వేయడం, ఈ నాలుగు సంవత్సరాలుగా చేయగలిగాం అని సంతోషంగా చెబుతున్నా
ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా ప్రతి అడ్వొకేట్‌కు నా తరఫున ఒకే ఒక రిక్వెస్ట్
ప్రభుత్వం ఏ రకంగా మీకు తోడుగా నిలబడుతోందో, పేద వాడి పక్షాన మీరు కూడా అంతే ఔదార్యం చూపిస్తూ, మంచి చేసే విషయంలో మానవతా దృక్ఫథం చూపించాల్సిందిగా ప్రతి అడ్వొకేట్ సోదరుడిని, చెల్లెమ్మను ప్రభుత్వం తరపున మీ అన్నగా, మీ అందరికీ మంచి స్నేహితుడిగా అభ్యర్థిస్తున్నా
దేవుడి దయతో మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, ఇంకా మంచి చేసే అవకాశాలు, పరిస్థితులు రావాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం

Advertisement

తప్పక చదవండి

Advertisement