ఫ్రెష్‌ లడ్డులు ఏమైనా పంపారా?

16 Jan, 2020 18:16 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగా, వ్యక్తిగతంగా స్థిరత్వం లేని వ్యక్తి అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. బీజేపీ, జనసేన పొత్తుపై స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. గత ఎన్నికల్లో జనసేన ఎలాంటి ప్రభావం చూపలేదని గుర్తుచేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ ఒక్కొక్క లైబ్రరీలో కూర్చొని పుస్తకం చదువుతూ.. ఒక్కొరకంగా ప్రభావితం అవుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదుతామంటే తమకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీ పాచిపోయిన లడ్డులు ఇచ్చిందని విమర్శించిన పవన్‌కు.. ఇవాళ ఆ పార్టీ నేతలు ఫ్రెష్‌ లడ్డులు ఏమైనా పంపారా అని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా పవన్‌ బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారని అంబటి ప్రశ్నించారు. ప్రజలను మభ్య పెట్టాలనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా అని నిలదీశారు. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ప్రయాణించాయని గుర్తుచేశారు. 2019లో మాత్రం టీడీపీతో పవన్‌ లాలుచీ ఒప్పందం చేసుకుని.. వామపక్షాలతో కలిసి పోటీ చేశారని విమర్శించారు. రాజకీయ స్థిరత్వం లేని పవన్‌.. ఒక పార్టీతోనైనా దీర్ఘ కాలం ఉన్నారా అనేది ఆలోచించుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి స్వచ్ఛమైన పాలన చేస్తుంటే పవన్‌ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. దుర్మార్గమైన పరిపాలన పోయి.. మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. 7 నెలల్లో ఒక్క అవినీతి కూడా జరగలేదని చెప్పారు. 

లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకోం..
ఏ ప్రభుత్వం అందించని సంక్షేమ ఫలాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు అందిస్తోందని అంబటి గుర్తుచేశారు. ఇలా చేయడం తప్పా అని ప్రశ్నించారు. అలాంటిది ప్రభుత్వం వైఫల్యం చెందిందని పవన్‌ ఏ విధంగా ఆరోపిస్తారని ప్రశ్నించారు. తమ పార్టీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిందని.. ఎన్ని పార్టీలు కలిసినా తమకు వచ్చిన ఢోకా ఏమి లేదని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను ఓట్లు అడుతుందని తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు సాయం చేసేందుకే కూటమి కట్టారా అని నిలదీశారు. ఎవరు ఎన్ని కూటమలు కట్టుకున్న తమకు అభ్యంతరం లేదని వెల్లడించారు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. 

చంద్రబాబుకు బాకీ ఉన్నారా?
ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లాంటి వాళ్లను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బీజేపీలోకి పంపారని అన్నారు. వామపక్షాలుకు బాకీ కాదన్న పవన్‌.. మరీ చంద్రబాబుకు బాకీ ఉన్నారా అని సూటిగా ప్రశ్నించారు. స్థిరత్వం లేని వ్యక్తిని బీజేపీ నమ్ముకుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని విమర్శించారు. పవన్‌ నిలకడలేని వ్యవహారాలను వామపక్షాలు గమనించాలని సూచించారు. సిద్ధాంతాలు లేక పీఆర్పీలా జనసేన కూడా కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. 

మరిన్ని వార్తలు