బెడిసికొట్టిన అమిత్‌ షా అయోధ్య వ్యూహం!

24 Dec, 2019 18:31 IST|Sakshi

పనిచేయని మోదీ, షా వ్యూహాలు

ప్రభావం చూపని అయోధ్య మందిర అంశం

జార్ఖండ్‌ ఓటమితో కంగుతిన్న కమలనాథులు

రాంచీ: దేశ వ్యాప్తంగా తమకు తిరుగులేదనుకుంటున్న బీజేపీకి జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించిన షాక్‌ ఇచ్చాయి. అధికార బీజేపీ ఎత్తుగడలను సమర్థవంతంగా ఎదుర్కొన్న జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి సంచలన విజయాన్ని నమోదు చేసింది. దేశంలో ఒకవైపు ఎన్‌ఆర్‌సీ, మరోవైపు పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో కాషాయ దళానికి ఈ ఫలితాలు మింగుడుపడటం లేదు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా, హోంమంత్రి అమిత్‌ షా విజయం కోసం శక్తివంచనలేకుండా కృషి చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచి మోదీ 12, అమిత్‌ షా 14 బహిరంగసభల్లో ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జాతీయవాదం వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. (జేఎంఎం కూటమి జయకేతనం)

పనిచేయని షా పాచికలు..
ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, మతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని సాక్షాత్తూ ప్రధాని బహిరంగ విమర్శలకు దిగారు. మరో అడుగు ముందుకు వేసిన అమిత్‌ షా.. అయోధ్యలో ఆకాశాన్నంటే భవ్యమైన రామమందిర నిర్మాణం నాలుగు నెలల్లో మొదలుకానుందని ప్రకటించారు. కానీ షా పాచికలు పారలేదు. జార్ఖండ్‌లోని పకూర్‌ ప్రాంతంలో డిసెంబర్‌ 17న జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ఆయన మందిర ప్రస్తావన తెచ్చారు. రామ జన్మభూమి అంశం కేసు కోర్టుల్లోనే నలిగిపోయేలా చేసేందుకు కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించే ప్రయత్నం చేశారు. గడిచిన మూడు దశాబ్దాలుగా అయోధ్య రామమందిరంపై ప్రచారం చేసుకుంటూ బలమైన శక్తిగా ఎదిగిన బీజేపీ, జార్ఖండ్‌ ఎన్నికల్లోనూ అదే అస్త్రం ప్రయోగించింది. కానీ మందిర నిర్మాణ అంశం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. స్థానిక సమస్యల పరిష్కారంగా భావించిన ఓటర్లు.. అయోధ్య అంశాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అలాగే మోదీ, షా ప్రచారం చేసిన జాతీయ అంశాలనూ జార్ఖండ్‌ ప్రజలు ఏమాత్రం దరిచేరనీయలేదు. (సాదాసీదా సొరెన్‌.. భార్యతో కాబోయే సీఎం!)

ఫలించిన పవార్‌ వ్యూహం..
మహారాష్ట్రలో​ ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ అనుసరించిన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసిన హేమంత్‌ సొరెన్‌ ప్రజల దృష్టిని తనవైపుకు తిప్పుకోవడంలో విజయం సాధించారు. జాతీయ అంశాల జోలికి పోకుండా కేవలం స్థానిక సమస్యలు, గిరిజనుల అభివృద్దే ధ్యేయంగా కాగ్రెస్‌-జేఎంఎం ప్రచారం సాగింది. అలాగే జార్ఖండ్‌లో గడిచిన ఏడాది కాలంలో జరిగిన 20కి పైగా మూకదాడులు అల్పసంఖ్యాక వర్గాల్లో భయాందోళన రేపాయి. ముస్లింలపై దాడులు భారతీయ జనతా పార్టీకి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయి. అలాగే ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ వ్యవహార శైలి కూడా ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఆయన ఏకపక్ష నిర్ణయాలు బీజేపీ ఓటమికి ఒక కారణంగా నేతలు వర్ణిస్తున్నారు. గిరిజన జనభా ఎక్కువగా గల జార్ఖండ్‌లో ఓబీసీకి చెందిన రఘుబర్‌ను ప్రజలు ఏమాత్రం అంగీకరించలేదు. కనీసం ఆయన కూడా గెలవలేకపోయారు అంటే వ్యతిరేకత ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద అధికార బీజేపీకి జార్ఖండ్‌ ఫలితాలు భారీ ఎదురుదెబ్బగా రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.(జార్ఖండ్‌ ఫలితాలు; మోదీ, షాలకు గర్వభంగం)

>
మరిన్ని వార్తలు