జయ ఆస్తి కోసం ‘అమృత’ నాటకం!

22 Feb, 2018 19:25 IST|Sakshi
దీప, జయలలిత సోదరుడి కుమార్తె (ఫైల్‌ ఫొటో)

సాక్షి, చెన్నై : తన మేనత్త దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు, వారసత్వం కోసమే బెంగళూరుకు చెందిన అమృత నాటకాలు ఆడుతున్నారని దీప ఆరోపించారు. గురువారం ఈ మేరకు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జయలలిత మరణం తర్వాత వారసత్వంపై జరుగుతున్న పరిణామాలు ఎలాంటివో అందరికీ తెలిసిందే. ఆమె ఆస్తులకు తామే వారసులం అంటూ జయలలిత అన్న జయకుమార్‌ కుమార్తె దీప ,కుమారుడు దీపక్‌లు ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఇక, రాజకీయంగా అమ్మ వారసత్వాన్ని అంది పుచ్చుకునే యత్నంలో కేసులు వెంటాడటంతో చిన్నమ్మ శశికళ కటకటాలకు పరిమితం అయ్యారు. అయితే, అమ్మకు తానే బిడ్డనంటూ బెంగళూరుకు చెందిన అమృత (37) తెర మీదకు రావడంతో కొత్త చర్చ మొదలైంది. జయలలితే తన కన్న తల్లి అని, డీఎన్‌ఏ పరీక్షకు కూడా తాను సిద్ధం అని అమృత ప్రకటించారు.

అమ్మ ఆస్తులు తనకు వద్దని, ఆమెకు కన్నబిడ్డగా సంప్రదాయబద్దంగా జరగాల్సిన అంత్యక్రియలను పూర్తి చేయడానికి తనకు అనుమతి ఇవ్వాలని అమృత న్యాయ పోరాటం చేస్తున్నారు. జయలలితకు వైష్టవ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు జరిపించాలని, తనకు కావాలంటే డీఎన్‌ఏ పరీక్షలు కూడా చేసుకోవచ్చంటూ అమృత హైకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. ఈ కేసు విచారణ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వైద్యనాథన్‌ బెంచ్‌ ముందుకు శుక్రవారం విచారణకు రానుంది.

గత విచారణ సమయంలో అమృత వాదనలను పరిగణించిన కోర్టు దీప, దీపక్‌లతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. అమృత పిటిషన్‌కు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఇప్పటికే దీప, దీపక్‌ లు కోర్టుకు వివరణ ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటి పిటిషన్‌ దాఖలు కాలేదు. శుక్రవారం న్యాయమూర్తి వైద్యనాథన్‌ బెంచ్‌ ముందు సాగే విచారణలో తమకు మరింత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసి, వాయిదాల పర్వంతో కేసును ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, అమృత వాదనలను గత విచారణలో పరిగణలోకి తీసుకున్న బెంచ్‌ తాజాగా ఏదేని కొత్త ఉత్తర్వులు ఇచ్చేనా అని ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని వార్తలు