ఫ్యాన్‌గాలికి కొట్టుకుపోయిన సైకిల్‌

24 May, 2019 14:27 IST|Sakshi
రిటర్నింగ్‌ అధికారి నుంచి ధ్రువీకరణపత్రం తీసుకుంటున్న ఆనం రామనారాయణరెడ్డి

సాక్షి, వెంకటగిరి: వెంకటగిరి నియోజకవర్గంలో ఫ్యాన్‌గాలికి సైకిల్‌ కనిపించనంత దూరంలోకి కొట్టుకుపోయింది. ప్రతిరౌండ్‌లోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి తన ఆధిక్యతను చాటుకుని విజయం వైపు దూసుకుపోయారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇద్దామన్న నినాదం పల్లెల్లోని ఓటర్లలో బలంగా నాటుకుపోవడంతో ఏప్రిల్‌  11వ తేదీన జరిగిన పోలింగ్‌లో ఫ్యాన్‌ గిరాగిరా తిరిగేసింది. ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రామనారాయణరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ సాధించలేని రికార్డు మెజార్టీని సాధించి వెంకటగిరి రాజకీయ చరిత్ర పుటల్లో తనదైన పేజీని దక్కించుకోగలిగారు.

నెల్లూరులోని ప్రిదయదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాల్లో గురువారం సార్వత్రిక ఎన్నికల ఫలితాల లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డికి 1,09,204 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణకు 70,484 ఓట్లు వచ్చాయి. 22 రౌండ్ల పాటు జరిగిన ఎన్నికల ఫలితాల లెక్కింపులో ప్రతిరౌండ్‌లోనూ రామనారాయణరెడ్డికి మెజార్టీ వచ్చింది. కలువాయి మండలం తెలుగురాయిపురం  పోలింగ్‌ కేంద్రం ఈవీఎం నుంచి ఎన్నికల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైయింది. రాపూరు మండలంలో పోలింగ్‌ వన్‌సైడ్‌గా జరిగినట్లు ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తొంది. కలువాయిలో 6,400, రాపూరులో 9,000 పైచిలుకు, సైదాపురం మండలంలో 5,600, డక్కిలిలో 4,320, బాలాయపల్లిలో 4,519 , వెంకటగిరి పట్టణ, రూరల్‌ ప్రాంతాల్లో 7వేల మెజార్టీ ఆనం రామనారాయణరెడ్డి సాధించారు. గతంలో వెంకటగిరి పట్టణ, రూరల్‌ ప్రాంతాల్లో టీడీపీకి 10వేలకు పైగా మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీని తగ్గించి ఈ ఎన్నికల్లో ఏడు వేలు ఓట్లు రావడం విశేషమన్న భావన వైఎస్సార్‌సీపీ నాయకుల నుంచి వ్యక్తమవుతోంది.  

రికార్డు మెజార్టీ
వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థిగా గెలుపొందిన ఆనం రామనారాయణరెడ్డి రికార్డు మెజార్టీ సాధించారు. ఆయన ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణపై 38,720 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. 1956 నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 1985లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన సాయికష్ణ యాచేంద్రకు 25వేలు పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పట్లో ఆయనది ఓ రికార్డుగా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్లకు ఆ రికార్డును రామనారాయణరెడ్డి బద్దలు కొట్టి రికార్డు మెజార్టీతో గెలుపొందారు. 

వైఎస్సార్‌సీపీ నాయకుల్లో జోష్‌ 
వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతోపాటు రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిచడంతో వెంకటగిరి నియోజకవర్గ వైస్సార్‌సీపీ శ్రేణుల్లో జోష్‌ కనిపిప్తోంది. 

గెలుపు ఇలా
వెంకటగిరి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్‌ గురువారం నెల్లూరులోని ప్రియదర్శని ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగింది. ఆనం రామనారాయణరెడ్డికి ప్రతి రౌండ్‌లోనూ మెజార్టీ లభించిది. నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్లు మొత్తం 2074 కాగా వీటిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామనారాయణరెడ్డికి 1,046 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి కె రామకృష్ణకు 903 ఓట్లు వచ్చాయి.  రామనారాయణరెడ్డికి పోస్టల్‌ బ్యాలెట్లలో143 ఓట్ల ఆధిక్యత లభించింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో 98 ఓట్లు ఇన్‌వ్యాలీడ్‌ అయ్యాయి. ఐదుగురు ఉద్యోగులు నోటాకు ఓటు వేశారు. 

మరిన్ని వార్తలు