దేశమంతా చూసేలా సభను నడిపించండి

13 Jun, 2019 13:33 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతిగా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు సభ సభ్యులు అభినందనలు తెలిపారు. సభా సంప్రదాయాలను పాటిస్తూ.. రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ.. సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పిస్తూ.. దేశానికే ఆదర్శవంతంగా అసెంబ్లీ సమావేశాలు సభాపతిగా తమ్మినేని నిర్వహిస్తారని ఆకాంక్షించారు. స్పీకర్‌ ధన్యవాద తీర్మానంపై పలువురు సభ్యులు మాట్లాడారు. వారు ఏమన్నారంటే..

ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశమంతా ఏపీ వైపు, శాసనసభవైపు చూసేలా సభాపతిగా తమ్మినేని సీతారాం అసెంబ్లీని నడిపిస్తారని ఆకాంక్షించారు.  శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేనికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో క్రమక్రమంగా విలువలు తగ్గుతున్నాయని, గత ప్రభుత్వాలు ఒక పార్టీ నుంచి గెలిచిన వారిని అధికార పార్టీలోకి తీసుకోవడం, ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడం గత సభలో చూశామని పేర్కొన్నారు.  సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పినట్లుగా భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు, చట్టసభలవైపు చూసి అభినందించేలా.. గొప్ప పేరు సంపాదించేలా సభాపతి సభను నడపాలని కోరారు. 

అది దేశానికే ఆదర్శం
గిరిజన మహిళ అయిన తనను డిప్యూటీ సీఎంగా నియమించి.. సీఎం వైఎస్‌ జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. తమ పొరుగు జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.  తమ్మినేనిని స్పీకర్‌గా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
 
శ్రీకాకుళం జిల్లాకు లభించిన గౌరవం
తమ్మినేని సీతారాం శాసనసభాపతిగా ఎన్నిక కావడం శ్రీకాకుళం జిల్లాకు లభించిన గౌరవమని సీనియర్‌ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు రాజ్యాంగ పదవి  రావడం సంతోషంగా ఉందన్నారు. అట్టడుగు ప్రజలతో సంబంధాలు కలిగి అన్యాయాన్ని ఎదురించాలనే తపన కలిగిన వ్యక్తి తమ్మినేని అని కొనియాడారు. 

ప్రతి సభ్యుడికి అవకాశం వచ్చేలా చూడండి
గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా శాసనసభలో ప్రతి సభ్యుడిని గౌరవించి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కోరారు. చట్టసభలో చర్చ అనేది జరిగి ప్రజా సమస్యలు పరిష్కారం అయితేనే సభపట్ల ప్రజల్లో కూడా గౌరవం పెరుగుతుందన్నారు. 

సీఎం జగన్‌ దేశానికే రోల్‌ మోడల్‌
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం అవకాశాలు కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనా తమ్మినేని సీతారాంకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ గత చరిత్రకు భిన్నంగా స్వతంత్ర భారత చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 మంది సభ్యులు ఉన్నప్పుడు కూడా ఇవ్వని అవకాశాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కల్పించారని, మంత్రివర్గంలో వారికి 60 శాతం పదవులు ఇచ్చి దేశానికే రోల్‌ మోడల్‌ సీఎంగా మారారన్నారు. సభను స్వేచ్ఛగా, సంప్రదాయబద్ధంగా నడపాలని స్పీకర్‌ను కోరారు. 

బాబు శాశ్వతంగా ప్రతిపక్షంలోనే..
నలభై ఏళ్ల అనుభవం అంటూ గొప్పలు చెప్పుకున్న వ్యక్తులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. చంద్రబాబు శాశ్వతంగా ప్రతిపక్షానికే పరిమితమవుతారని ఆయన అన్నారు. మీరు కూర్చున్న స్థానానికి మరింత గౌరవం తెచ్చేలా చూడాలని సభాపతి తమ్మినేని ఆయన కోరారు. ఈ సభలో అనేకమంది కొత్త సభ్యులు ఉన్నారని, ప్రజలు తమ ఎమ్మెల్యే ఎప్పుడు మాట్లాడుతారా.. టీవీలో ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తుంటారని, తమలాంటి కొత్త సభ్యులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తే బాగుంటుదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్‌ జగన్‌ యువకుడు, దమ్మున్న నాయకుడు అని, మాటతప్పని, మడమ తిప్పని వ్యక్తి అని కొనియాడారు. వైఎస్‌ జగన్‌పైనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. దెయ్యాలు వేదాలు చెప్పినట్లు సభా సంప్రదాయాల గురించి కొందరు చెబితే తెలుసుకోవాల్సిన అవసరం తమకు లేదని టీడీపీ నేతలను ఉద్దేశించి పేర్కొన్నారు.  సభా సంప్రదాయాలు ఏవిధంగా ఉండాలో తమ నాయకుడికి తెలుసనని పేర్కొన్నారు.  

సభా నాయకుడు స్పీకర్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చారు
సభా నాయకుడైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పీకర్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని స్పీకర్‌గా ఎన్నిక చేయడం గొప్ప అదృష్టమన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు మంత్రిగా పని చేసిన వ్యక్తికి స్పీకర్‌గా అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సభను విలువలతో స్పీకర్‌ ముందుకు నడుపుతారని, విజయవంతంగా నమ్ముతున్నానని తెలిపారు. 
 

మరిన్ని వార్తలు